
ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ సాహస్ పూర్ లోని ఓ ఇస్లామిక్ విద్యా సంస్థ కోసం భూమి కేటాయించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. దాని వెనుక వున్న ఉద్దేశాలను కాంగ్రెస్ వెంటనే వివరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి నారాయణ దత్ తివారీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ కోసం భూమిని కేటాయించింది.
ఈ భూమికి సంబంధించిన ట్రస్ట్ చిరునామా ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ అని, దాని అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ అసద్ మదానీ. ఈయకు దారుల్ ఉలూమ్, జమియత్ ఉలేమా ఏ హింద్ తో సంబంధముందని జాతీయవాదులు గట్టిగా పేర్కొంటున్నారు. ప్రముఖమైన ఓ రక్షణ సంస్థ ఈ భూ కేటాయింపులను ప్రశ్నించిందని, అయినా.. ఎందుకు ఆమోదించారని మండిపడుతున్నారు.
మరో వైపు దీనిపై అధికార బీజేపీ అనేక ప్రశ్నలను లేవదీస్తోంది. ఏ ఒత్తిళ్లతో ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలని బీజేపీ మీడియా ఇంచార్జీ మనవీర్ సిన్హా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ధామీ నిరంతరం ల్యాండ్ జిహాద్ విషయంలో, జనాభాను మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలపై కన్నేసి వుంచారన్నారు.
ఈ భూమిని కేవలం వ్యవసాయ వినియోగానికి మాత్రమే వాడాలని హైకోర్టు సూచించినా.. ఆ భూమిలో అమ్ముడైన ప్లాట్లన్నీ ఓ వర్గానికి చెందినవేనని సిన్హా పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా తమ రాష్ట్రంలో ఓ వర్గానికి సంబంధించిన జనాభాను విపరీతంగా పెంచాలని చూస్తున్నారని, దీంతో జనాభా అసమతౌల్యం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.





