News

సర్వం భారతీయం!

90views

ప్రపంచ టెక్‌ గమనాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఇన్నాళ్లూ అగ్రరాజ్యాలదే ఆధిపత్యం. కానీ, ఆ గతాన్ని తిరగరాస్తూ భారతీయ స్టార్టప్‌ ‘సర్వం ఏఐ’అద్భుతాలు సృష్టిస్తోంది. కేవలం అనుకరణలతో సరిపెట్టుకోకుండా, మట్టి వాసన తెలిసిన ‘సొంత’సాంకేతికతతో అంతర్జాతీయ దిగ్గజాలైన గూగుల్‌ జెమిని, చాట్‌ జీపీటీనీ వెనక్కి నెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

గూగుల్, చాట్‌ జీపీటీలకే సవాల్‌
భారతీయ మేధస్సు గ్లోబల్‌ టెక్‌ మ్యాప్‌పై తన ముద్రను బలంగా వేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘సర్వం ఏఐ’అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ మోడల్స్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రెండు టూల్స్‌ ద్వారా ఈ సంస్థ టెక్‌ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది.

93.28 శాతం కచ్చితత్వం
ఇది అద్భుతమైన ఓసీఆర్‌ (ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగి్నషన్‌ టూల్‌). భారత భాషల్లోని పత్రాలను చదవడంలో అమోఘమైన పనితీరును కనబరుస్తోంది. ఓఎల్‌ఎంఓసీఆర్‌ బెంచ్‌మార్క్‌లో 84.3 శాతం స్కోరును సాధించి, గూగుల్‌ జెమిని 1.5 ప్రో, చాట్‌ జీపీటీలను మించిపోయింది. సంక్లిష్ట పట్టికలు, గణిత ఫార్ములాలనూ 93.28 శాతం కచ్చితత్వంతో విశ్లేషించగలగడం దీని విశిష్టత.

బుల్‌ బుల్‌ వి3
ఇది అచ్చమైన భారతీయ గొంతుకలతో కూడిన వాయిస్‌ ఏఐ మోడల్‌. ప్రస్తుతం 11 భారతీయ భాషల్లో 35కు పైగా సహజసిద్ధమైన స్వరాలను ఇది అందిస్తోంది. త్వరలో దీనిని 22 భాషలకు విస్తరించనున్నారు. అంతర్జాతీయ టూల్స్‌ భారతీయ భాషల విషయంలో తడబడుతున్న వేళ, సర్వం ఏఐ అత్యంత స్పష్టమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందిస్తోంది.

‘సర్వం’ పనితీరుకు ఫిదా
ఒకప్పుడు భారతీయ ఏఐ నమూనాల సామర్థ్యాన్ని శంకించిన విమర్శకులు సైతం ‘సర్వం’ పనితీరుకు ఫిదా అవుతున్నారు. గ్లోబల్‌ ఏఐ ల్యాబ్‌లు విస్మరించిన భారతీయ భాషా వైవిధ్యాన్ని శక్తిగా మలుచుకుంటూ ఏఐ రంగంలో భారత్‌ అగ్రగామిగా ఎదుగుతోందనడానికి ఈ విజయమే నిదర్శనం.