
స్వాతంత్రానికి ముందు, తర్వాత కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశానికి సాటిలేని సహకారాన్ని, సేవను అందిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ నిర్మాణంలో ఆరెస్సెస్ పాత్ర సమాజంలోని ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతూనే వుందన్నారు. ఆర్గనైజర్ పత్రిక నిర్వహించిన “ఛత్తీస్‌గఢ్@25 – షిఫ్టింగ్ ది లెన్స్” అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ప్రతి వ్యక్తి సహకారం కూడా అత్యంత కీలకమైందేనని, అయితే..ఆరెస్సెస్ అత్యంత నిలకడగా, దేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేస్తోందని, అందుకే ప్రత్యేకమైన సంస్థ అని వివరించారు.
స్వాతంత్రానికి ముందు, తర్వాత కూడా దేశ ప్రయాణంలో సంఘ్ చాలా పెద్ద తోడ్పాటును అందించిందని, ఈ విషయాన్ని ఏ చరిత్ర కారుడూ కాదనలేడని తేల్చి చెప్పారు. సామాజిక రంగంలో లేదా మరేదైనా రంగంలో ఆరెస్సెస్ కార్యకర్తల ఉనికి లేకుండా.. దాదాపుగా ఏ రంగమూ కనిపించదన్నారు.
అలాగే అమిత్ షా తన ప్రసంగంలో సంఘ్ చేస్తోన్న విస్తృత కార్యకలాపాలను కూడా వివరించారు. విద్య, సామాజిక సేవతో పాటు విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాలు, జాతీయ భద్రతకు సంబంధించిన వివిధ రంగాల్లోనూ ఆరెస్సెస్ స్వయంసేవకులు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశంలో గానీ, సామాజిక రంగంలో సంఘ్ స్వయంసేవకులు సహకారం అందించని రంగమే లేదన్నారు. స్వాతంత్ర్య అనంతరం అత్యంత ప్రభావవంతమైన శక్తులలో ఆరెస్సెస్ ను ఓ సంస్థగా చెప్పుకోవచ్చన్నారు.
సంస్థలను ఒకసారి మూల్యాంకనం గనక చేయాల్సి వస్తే.. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్ధలలో కెల్లా ఆరెస్సెస్ స్వయంసేవకుల సహకారం ప్రతి రంగంలో చూసినా, సామాజిక రంగంలో చూసినా.. ప్రతి కోణంలోనూ సంఘ్ పాత్ర ప్రముఖమైందన్న విషయాన్ని నిస్సందేహంగా చెప్పగలను అని పేర్కొన్నారు.
ఆరెస్సెస్ పై తరుచుగా వస్తున్న విమర్శలపై కూడా అమిత్ షా స్పందించారు. సంస్థపై వున్న సందేహాలు, అపార్థం లేదా తప్పుడు సమాచారం వల్లే తలెత్తుతున్నాయని, ఇందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదన్నారు. ముందుగా ఏర్పర్చుకున్న అభిప్రాయాల ఆధారంగా కాకుండా, ఆరెస్సెస్ చేసే పనుల ఆధారంగా దానిని అంచనా వేయాలని సూచించారు.





