
తిరుమల లడ్డు అపవిత్రత విషయం రాష్ట్రంలో ఒక రాజకీయ అంశంగా మారుతున్నదని విశ్వ హిందూ పరిషత్ విచారం వ్యక్తంచేస్తున్నది. దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతున్నదని విశ్వహిందూ పరిషత్ భావిస్తున్నది. పవిత్ర తిరుమల లడ్డూను పార్టీలు రాజకీయ అంశంగా మార్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.దయచేసి రాజకీయ పరస్పర ఆరోపణలకు లడ్డు అంశాన్ని, పవిత్ర తిరుమలను వేదిక చేసుకొనవద్దు.ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంకా లోతైన దర్యాప్తు జరిగి బాధ్యులు అందరికీ తప్పనిసరిగా శిక్ష పడాలి.
లడ్డు అంశము కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో పార్టీలు సమయమనం పాటించమని కోరుతున్నాము.భక్తుల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రకటనలు చేయరాదని VHP కోరుతున్నది.గతంలో కూడా కోర్టు లడ్డు విషయంలో ఎవరు స్పందించవద్దని చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలి.
స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డులో కలపలేదు అనే విషయము ఎంత నిజమో, రాష్ట్రంలో యధేచ్ఛగా ఆవుల అక్రమ రవాణా, గోవధ జరుగుతున్నది అన్నది కూడా అంతే నిజం.వీటిని అరికట్టడానికి కఠినమైన చర్యలు అవసరమని VHP మరియు హిందూ సమాజం భావిస్తున్నది.కోర్టు పర్యవేక్షణలో, దర్యాప్తు సంస్థల విచారణలో లడ్డూ దర్యాప్తు కొనసాగుతున్నది. కావున అందరూ సమయమనం పాటిస్తే కోర్టు తీర్పు ఇస్తుందని, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తుందని VHP భావిస్తున్నది.కోర్టు విధించే శిక్షలను విధిగా అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
స్వామివారి విషయంలో, ఆలయ పవిత్రత విషయంలో, హిందువుల మనోభావాల విషయంలో స్వామివారికి తోడుగా, భక్తులకు అండగా, హిందూ సమాజానికి చేదోడుగా విశ్వ హిందూ పరిషత్ ఉంటుందని తెలియజేస్తున్నాం. -తనికెళ్ళ సత్య రవికుమార్ కార్యదర్శి





