News

ఐసర్‌లో ఆకట్టుకుంటున్న శాస్త్రీయ కళల క్లబ్‌

159views

నూతన పరిశోధనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు.. తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ (ఐసర్‌) విద్యార్థులు. శాస్త్రీయ కళల క్లబ్‌ ఆధ్వర్యంలో పలు కళలను వీక్షిస్తూ, అభ్యసిస్తూ వాటికి జీవం పోస్తున్నారు. ఇటీవల స్పిక్‌ మాకే విరాసత్‌ పేరుతో మూడురోజుల పాటు పలు ప్రాంతాల కళాకారుల ప్రదర్శనలను పరిశీలించి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు.

అలరించిన కచేరీలు
ప్రముఖ విద్వాంసుల ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, రుద్రవీణ, కర్ణాటక సంగీత కచేరి, చెరియల్‌ చిత్రకళ వంటి కార్యశాలలను నిర్వహించారు. ఐసర్‌తో పాటు పక్కనే ఉన్న ఐఐటీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కళాకారులతో కలిసి సందడి చేశారు. అంతరిస్తున్న కళలను కాపాడేందుకు తమవంతు కృషిచేస్తామని శాస్త్ర, సాంకేతిక పరిశోధన విద్యార్థులు ప్రతినబూనారు.

ఏటా తిరునాళ్‌
తమిళనాడులో నిర్వహించే సంక్రాంతి పండగను తిరుపతి ఐసర్‌ విద్యార్థులు ‘తిరునాళ్‌’గా ఏటా వైభవంగా నిర్వహిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగిమంటలు వేస్తారు. పాలు పొంగించి ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. స్థానిక రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొంటారు.

పక్షుల సంరక్షణకు కృషి
పక్షుల సంరక్షణకు ఐసర్‌ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఫిబ్రవరి 13, 14న వివిధ పక్షులను గుర్తించి, వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. బర్డింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి ఐఐటీ ప్రాంగణం, పులికాట్ సరస్సుల్లో పక్షులను వీక్షించడం, వాటి జీవన విధానానికి అవసరమైన పరిశోధనలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు.