
జమ్మూ కాశ్మీర్ ప్రజలతో తాము “ఏకతాటిపై నిలిచామని” చాటిచెప్పడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న పాకిస్తాన్ “కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం” ఘనంగా జరుపుకుంటుంది. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, అక్టోబర్ 22, 1947న పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతం (PoK) ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం తాము అండగా ఉన్నామని పాకిస్తాన్ చేస్తున్న వాదనల్లో నిజం లేదని, వారు ఆక్రమించుకున్న ప్రాంతంలోని మౌలిక సదుపాయాల దుస్థితే అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. అక్కడ అభివృద్ధి పూర్తిగా కుంటుపడటంతో ప్రజలు పదేపదే తిరుగుబాటు చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి, రోడ్లు, ఆసుపత్రులు, రైల్వేలు, విశ్వవిద్యాలయాలు ఇంకా విద్యుత్ సౌకర్యాలే కొలమానంగా తీసుకోవచ్చు. కానీ పాకిస్తాన్ అధికారికంగా “ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్” అని పిలుచుకునే PoKని, భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌తో పోల్చి చూస్తే.. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉన్న వ్యత్యాసం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఈ కథనం ద్వారా పాకిస్తాన్ చేస్తున్న కపట వాదనలను ఎండగడుతూ.. కనెక్టివిటీ (రవాణా), వైద్యం, విద్య మరియు విద్యుత్ అనే నాలుగు ప్రధాన రంగాల్లో ఉన్న వ్యత్యాసాలను మేము మీ ముందుకు తెస్తున్నాం.
రవాణా సౌకర్యాల కరువు
జమ్మూ & కాశ్మీర్ సుమారు 42,241 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 2011 జనాభా లెక్కల అంచనాల ప్రకారం 2025-2026 నాటికి ఇక్కడి జనాభా సుమారు 1.37 కోట్ల నుండి 1.6 కోట్లుగా ఉంది. దీనికి విరుద్ధంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) కేవలం 13,297 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని, 2017 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉంది. పరిమాణం మరియు జనాభా పరంగా చిన్నదైనప్పటికీ, PoKకి దక్కాల్సిన వాటా పెట్టుబడులు అందకపోగా, దానికి పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ప్రాంతానికైనా ఆధునిక అభివృద్ధి అనేది ‘కనెక్టివిటీ’ (రవాణా అనుసంధానం) తోనే మొదలవుతుంది. నేడు జమ్మూ & కాశ్మీర్ భారత రవాణా వ్యవస్థతో పూర్తిగా అనుసంధానించబడింది. ఇక్కడ ప్రస్తుతం 28 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ తావి, బద్గామ్ మరియు శ్రీనగర్ వంటి కీలక రైల్వే హబ్‌లు ఆధునీకరించబడుతున్నాయి. వీటితో పాటు మెరుగైన రైలు నెట్‌వర్క్, విస్తరిస్తున్న 36 సొరంగ మార్గాల నెట్‌వర్క్ మరియు పర్యాటకం, అత్యవసర వైద్య సేవలు, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా నాలుగు క్రియాశీలక విమానాశ్రయాలు ఉన్నాయి. 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) జూన్ 2025లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, కాశ్మీర్ లోయ నేరుగా జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించబడింది.

Udhampur-Srinagar-Baramulla Rail Link (USBRL)
మరోవైపు, అదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో ఇప్పటికీ ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు. ఆ ప్రాంతంలోని పట్టణాలను లేదా జిల్లాలను కలిపే ఒక్క రైలు మార్గం కూడా అక్కడ లేదు. ఇక్కడి ప్రజలంతా కేవలం 5,000 నుండి 6,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నాసిరకం రోడ్లపైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా.. ఈ రోడ్లపై కొండచరియలు విరిగిపడటం, వాతావరణ మార్పులతో రాకపోకలకు తరచుగా అంతరాయంతో పాటు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. భారత జమ్మూ & కాశ్మీర్ నేడు హై-స్పీడ్ రైళ్లు మరియు లాజిస్టిక్స్ కారిడార్ల గురించి చర్చిస్తుంటే, PoK మాత్రం కనీస రవాణా సౌకర్యాల కోసం అల్లాడుతోంది. ఇది నిజంగా విస్మయానికి గురిచేసే వాస్తవం.
విద్య & వైద్యం: ఒకవైపు సమృద్ధి.. మరోవైపు కరువు
వైద్య మౌలిక సదుపాయాలను పరిశీలిస్తే ఈ అసమానత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నేడు భారత జమ్మూ & కాశ్మీర్‌లో సాంబా జిల్లాలోని ఎయిమ్స్ (AIIMS Jammu) తో సహా మొత్తం 2,812 ఆసుపత్రులు ఉన్నాయి. వీటికి తోడుగా 35 విశ్వవిద్యాలయాలు మరియు 9 వైద్య కళాశాలలు నిరంతరం నిపుణులైన వైద్యులను, సేవలను అందిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా, PoKలో మొత్తం జనాభా కోసం కేవలం 23 ఆసుపత్రులు, 6 విశ్వవిద్యాలయాలు మరియు ఒకే ఒక్క వైద్య కళాశాల ఉన్నాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి ప్రజలు తరచుగా పాకిస్తాన్ లోపలి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది, దీనివల్ల సమాజంలోని అధిక శాతం మందికి వైద్య సేవలు అందనంత దూరంలో ఉండిపోతున్నారు.

Drone shot of AIIMS Jammu in Samba, J&K
దీర్ఘకాలిక అభివృద్ధికి విద్యే వెన్నెముక; అయితే, PoKలో విద్యా వ్యవస్థ కేవలం నామమాత్రంగా (skeletal) మిగిలిపోయింది. ఆధునిక ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అక్కడి యువతకు అందించడంలో ఈ ప్రాంతం ఘోరంగా విఫలమైంది. దీని ఫలితం అధిక నిరుద్యోగిత రేటు, యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం మరియు దీర్ఘకాలిక ఆర్థిక స్తబ్ధత రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తాగునీటి విషయానికి వస్తే, ‘వాటర్ ఎయిడ్ పాకిస్థాన్’ నివేదిక ప్రకారం PoKలో 50% కంటే ఎక్కువ మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. దీనివల్ల నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల కారణంగా ఏటా 3,000 మందికి పైగా మరణిస్తున్నారు. అంతేకాకుండా, అక్కడ ఉన్న నీటి వనరులలో 90% సురక్షితం కాదని తేలింది.
విద్యుత్ వైరుధ్యం
PoK దుస్థితిలో అత్యంత చేదు నిజం అక్కడి విద్యుత్ సంక్షోభంలోనే దాగి ఉంది. ఈ ప్రాంతం అపారమైన జలవిద్యుత్ వనరులకు నిలయంగా ఉన్నప్పటికీ, PoK నివాసితులు ఆ ప్రాంతంలోనే అత్యధిక విద్యుత్ ధరలను చెల్లిస్తున్నారు. విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల అనంతరం, మే 2024లో యూనిట్‌కు 1-100 యూనిట్ల వరకు 3 PKR, 100-300 యూనిట్ల వరకు 5 PKR, మరియు 300 యూనిట్లకు పైబడితే 6 PKR గా ధరలను ఖరారు చేశారు. వనరులు తమవే అయినప్పటికీ, అధిక ధరల భారం మాత్రం స్థానిక ప్రజలపైనే పడటం ఒక తీరని శోకం.
కాశ్మీర్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బయటి ప్రాంతాలకు తరలిపోతుంటే, ఆ ఖర్చు భారం మాత్రం స్థానిక ప్రజలపైనే పడుతోంది. జీలం వంటి PoK నదులు పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలను వెలిగిస్తున్నాయి, కానీ అక్కడి సొంత ప్రజలు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ‘నీలం-జీలం హైడ్రోపవర్ ప్రాజెక్ట్’ తమ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లోని ముజఫరాబాద్ నివాసితులు ఇప్పటికీ తీవ్రమైన విద్యుత్ కొరతతో పాటు.. గంటల తరబడి కొనసాగే లోడ్ షెడ్డింగ్‌ను (కరెంటు కోతలు) ఎదుర్కొంటున్నారు.

Thousands tear electricity bills to protest against rising power tariffs
LoC దాటితే.. పూర్తి భిన్నమైన ప్రపంచం!
మౌలిక సదుపాయాలే జీవనోపాధిని నిర్దేశిస్తాయి. భారత జమ్మూ & కాశ్మీర్‌లో అత్యాధునిక విమానాశ్రయాలు, రహదారులు, హోటళ్లు మరియు పటిష్టమైన ప్రజా భద్రత వంటి మౌలిక సదుపాయాల కారణంగా 2023లో రికార్డు స్థాయిలో 2.11 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. వీరిలో 50,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు ఉండటం గమనార్హం. అయితే, PoKలో కూడా దాదాపు అవే భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఆ ప్రాంతం ఎక్కడా కనిపించదు. బలహీనమైన రవాణా వ్యవస్థ, కనీస సౌకర్యాల లేమి మరియు రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ పర్యాటక రంగం ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం కానీ, ఉపాధి కానీ లభించని పరిస్థితి నెలకొంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో పౌర మౌలిక సదుపాయాలు అత్యంత దయనీయంగా (threadbare) ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో అధికారికంగా గుర్తించబడిన 60కి పైగా ఉగ్రవాద శిబిరాలున్నాయి. అక్కడ రైల్వేలకు సంబంధించిన సదుపాయాలు ఏరోజూ నిర్మించలేదు. అలాగే, నిత్యం ఆసుపత్రుల్లో నిధుల కొరత కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఉగ్రవాద మౌలిక సదుపాయాలు మాత్రం విపరీతంగా అభివృద్ధి చెందాయి. విస్తుపోయే విషయం ఏమిటంటే, PoKలోని పౌర జనాభా నివసించే ప్రాంతాలలోనే భారీ ఉగ్రవాద శిబిరాలు విస్తరించి ఉన్నాయి. మార్చి 2025 నాటి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) నివేదిక ప్రకారం, PoKలో ఉగ్రవాద నియామకాలు మరియు శిక్షణ శిబిరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, ఇవి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ నోరు మెదపకుండా చేస్తున్నాయని వెల్లడించింది. మే 2025లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఈ నిజాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ సమయంలో PoKలోని తొమ్మిది ప్రాంతాలలో ఉన్న లష్కరే తోయిబా మరియు జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు నిర్వహించింది.
ఫిబ్రవరి 5: పాకిస్థాన్ ద్వంద్వ నీతికి పరాకాష్ట
పాకిస్థాన్ ‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ జరుపుకోవడం కంటే ముందు, నియంత్రణ రేఖ (LoC) కి అటువైపు ఉన్న జమ్మూ కాశ్మీర్ వైపు కాకుండా, తమ ఆక్రమణలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) వైపు చూసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా ఉంటామని చెప్పే ముందు, PoK ప్రజల డిమాండ్లను, వారి ఆర్తనాదాలను పాకిస్థాన్ వినాలి. ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్ నిజంగా సంఘీభావం తెలపాల్సింది తాము ఆక్రమించుకున్న ప్రాంతంపైనే. ఎందుకంటే, ఒకవైపు భారత జమ్మూ కాశ్మీర్.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన ‘చీనాబ్ వంతెన’ వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్టులతో విరాజిల్లుతుంటే, మరోవైపు PoKలోని సామాన్య పౌరులు మాత్రం ఉగ్రవాదుల మధ్య బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి నెలకొంది.





