News

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

67views

రాష్ట్రంలోని శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య సత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు బి.సి.జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనితతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వాలని, క్యూలైన్లలో పాలు, బిస్కెట్లు, అల్పాహారం, మంచినీరు సరఫరాతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీశైలం వైపు ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద టోల్‌ రుసుం తీసుకోకుండా భక్తుల వాహనాలను అనుమతించాలని ఆదేశించారు. వీఐపీ దర్శనాలకు వచ్చే వారికి టైంస్లాట్‌ పాటించాలన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న శివసేవకులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. పాదయాత్రగా వచ్చే భక్తుల్ని ఈ నెల 4 నుంచి నల్లమల మీదుగా అనుమతిస్తారు.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో చంటి పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించాలని.. అత్యవసర సమయాల్లో సేవల కోసం అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక నిఘాలో భాగంగా డ్రోన్‌ పెట్రోలింగ్‌ విధానం అమలు చేస్తారు.. 24 గంటలు లైవ్‌ స్ట్రీమింగ్‌తో పోలీసులు కంట్రోల్‌ రూంలో పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు తెలిపారు.