
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం చేరుకునే పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధి కారి శ్రీనివాసరావు అన్నారు.
క్షేత్ర పరిధిలోని కైలాసద్వారం, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార ప్రాంతాలను దేవస్థానం ఇంజినీరింగ్, సంబంధిత అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముందుగా కై లాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక చలువ పందిర్లను (తాత్కాలిక షెడ్డు) పరిశీలించారు.
కైలాసద్వారం, భీమునికొలను మెట్ల మార్గంలో నిరంతరం మంచినీటి సరఫరా చేస్తుండాలని ఆదేశించారు. కైలాసద్వారం వద్ద మొత్తం 60 వేల లీటర్లు నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కై లాసద్వారం, హఠకేశ్వరం వద్ద భక్తులకు అన్నదానం చేసే భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలకు దేవస్థానం తరుఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పా టు చేయాలన్నారు. ఆతర్వాత హఠకేశ్వరాలయం వద్ద దేవస్థానం నిర్మిస్తున్న నీటి సంపు నిర్మాణాన్ని పరిశీలించారు. దేవస్థానం నిర్మిస్తున్న జల్లు స్నానాల ఏర్పాట్లను పరిశీలించారు.





