ArticlesNews

జాతిపిత‌, స్ఫూర్తి ప్ర‌దాత‌ మహాత్మాగాంధీ

129views

(జనవరి 30 – మహాత్మాగాంధీ జయంతి )

సత్యం, అహింస‌, స‌త్యాగ్ర‌హాన్ని ఆయుధాలుగా వాడి ప‌రాయి పాల‌కుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ధీశాలి. భ‌ర‌తమాత‌ను దాస్య శృంఖ‌లాల నుంచి విముక్తం చేయ‌డానికి శాంతి మార్గంలో న‌డిచిన మ‌హ‌నీయుడు. దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ ఏకం చేసి ఆంగ్లేయుల‌ను త‌రిమికొట్టిన మ‌హాత్ముడు మ‌న మోహన్‌దాస్ కర‌మ్‌చంద్ గాంధీ. అందుకే ఆయ‌న మ‌న‌కు జాతిపిత‌, స్ఫూర్తి ప్ర‌దాత‌. ఆయ‌న జీవితం అన్ని త‌రాల‌కు ఆద‌ర్శ‌నీయం. ఆయ‌న మాట‌లు అనునిత్యం అనుస‌ర‌ణీయం. మ‌హాత్ముడు చూపిన మార్గం శిరోధార్యం. ఆ మ‌హ‌నీయుడి వ‌ర్థంతి నేడు. తాను ప‌ర‌మ హిందువున‌ని మ‌హాత్ముడు ఎన్నో సంద‌ర్భాల్లో స్వ‌యంగా ప్ర‌క‌టించుకున్నారు. స‌నాత‌న హిందూ మ‌తాన్ని త‌న జీవితానికి ప్రేర‌ణ‌గా ఆయ‌న భావించేవారు. హిందూ ధ‌ర్మం, గో సంర‌క్ష‌ణ‌, స్వ‌దేశీ, అంట‌రానిత‌నం నిర్మూల‌న వంటి విష‌యాల్లో ఆయ‌న ఆద‌ర్శాలు, ఆలోచ‌న‌లు, సిద్ధాంతాల‌ను పుణికిపుచ్చుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేడు ఆయ‌న ఘ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తోంది. వాస్త‌వానికి సంఘ్ గొప్ప ఆరాధ‌కుల్లో బాపూజీ కూడా ఒకరు.

1934లో మహారాష్ట్రలోని వార్ధాలో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ శిక్షణ‌ శిబిరాన్ని గాంధీజీ సందర్శించారు. అక్క‌డ కుల‌, మ‌త భేదాలు లేకుండా సంఘ్ కార్య‌క‌ర్త‌లు అంద‌రూ ఒకే కప్పు కింద క‌ల‌సి భోజనాలు చేస్తుండటం చూసి అబ్బుర‌ప‌డ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947 సెప్టెంబర్ 16న ఢిల్లీలో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో సంఘ్‌ కార్యకర్తలనుద్దేశించి మ‌హాత్ముడు ప్రసంగించారు. `ఆర్ఎస్ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు శ్రీ హెడ్గేవార్‌ జీవించి ఉన్న కాలంలో నేను సంఘ్‌ శిబిరాన్ని సందర్శించాను. మీరు పాటిస్తున్న‌ క్రమశిక్షణ, అంటరానితనం అనే మాట‌కు తావులేకపోవడం, మీ నిరాడంబరత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాటి నుంచి నేటి వ‌ర‌కూ సంఘ్ దిన‌దినాభివృద్ధి చెందుతూ వ‌చ్చింది. సేవ, ఆత్మ‌బ‌లిదానం అనే ఉన్నత ఆదర్శంతో ప్రేరణ పొందిన ఏ సంస్థ అయినా వృద్ధి సాధిస్తుంద‌ని నేను బ‌లంగా విశ్వ‌సిస్తాను` అని గాంధీజీ పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్‌పై అనేక గొప్ప ర‌చ‌న‌లు చేసిన ప్రముఖ రచయిత డాక్టర్ వాల్టర్ ఆండర్సన్ త‌న ఇంటిగ్రల్ హ్యూమనిజం’ అనే సంకలనంలో గాంధీజీని సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, సిద్ధాంతకర్త పండిట్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయతో పోలుస్తూ ‘గాంధీ అండ్ దీన్ దయాళ్: ఇద్దరు యోగులు అనే ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశారు. 1992లో ప్రచురితమైన ఆ వ్యాసంలో గాంధీజీ, ఉపాధ్యాయ మధ్య పోలికల‌ను, భావ సారూప్యాన్ని విశ‌దీకరించారు. గాంధీజీ, ఉపాధ్యాయ ఇద్ద‌రూ ప్రాథమికంగా వ్య‌వ‌స్థాప‌కులు. తాత్విక అంశాల‌పై ఆస్త‌కి ఉన్న‌వారు. గొప్న‌ ప్ర‌జాకర్ష‌ణ‌ ఉన్న‌వ్యక్తులు. గాంధీజీ చేసిన విజ్ఞ‌ప్తి కాంగ్రెస్‌ను స్వాతంత్ర్య ఉద్య‌మంలో ప్ర‌భావ‌వంత‌మైన పాత్ర పోషించేలా చేసింది. ఉపాధ్యాయ కూడా జ‌న‌సంఘ్ కేడ‌ర్‌పై ఆ స్థాయి ప్ర‌భావాన్ని క‌లిగించారు అని అండర్సన్ పేర్కొన్నారు. స్వరాజ్యం, స్వదేశీ భావాల‌కు గాంధీజీ వీరాభిమాని. ఏకాత్మ మాన‌వ‌తా వాదం గురించి మాట్లాడిన‌ ఉపాధ్యాయ కూడా అవే తాత్వికతలకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. రాజ‌కీయ అధికారం ప్రజా ప్రతినిధులపై అవినీతి ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని అనుమానించిన వారిద్ద‌రూ ఏ రాజ‌కీయ ప‌ద‌వులు చేప‌ట్ట‌లేద‌ని వివ‌రించారు.

1925లో ఆవిర్భవించినప్పటి నుంచి సంవత్సరానికి 365 రోజులూ విరామం లేకుండా శాఖలు నిర్వహించ‌డ‌మే ఆర్ఎస్ఎస్ మూల సూత్రం. కానీ గాంధీజీ మృతికి సంతాప సూచకంగా సంఘ్ శాఖలన్నింటినీ 13 రోజుల పాటు మూసివేశారు. ఇది ఆర్ఎస్ఎస్‌లో మ‌హాత్ముడి ప‌ట్ల‌ ఉన్న గౌర‌వానికి నిద‌ర్శ‌నం. సమాజంలోని స్త్రీ, పురుషుల వ్య‌క్తిత్వ‌మే అంతిమంగా రాజ్య స్వభావాన్ని నిర్ణయిస్తుందని గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ భావించేవారు. అలాంటి వ్య‌క్తుల‌ను తయారుచేసే పనిని ఆర్ఎస్ఎస్ గత ద‌శాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగిస్తోంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి సిద్ధాంతకర్తలు మహాత్ముడి వారసత్వానికి నిజమైన వారసులని చెప్పడంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు