
అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా పలు చోట్ల భారీ వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. అయితే వందల ఏళ్లనాటి వృక్షాలను పరిరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆపరేషన్ పునర్‌వనం’ పేరుతో ఈ వృక్షాలను వేరేచోట నాటించాలని ఆధికారులను ఆదేశించింది. దీంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, జిల్లా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల మొదటి వారంలో ‘ఆపరేషన్ పునర్‌వనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వృక్షశాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో అవసరంలేని మేర చెట్ల కొమ్మలను నరికించారు. చెట్టు మాను చుట్టూ భారీ గోతులు తీశారు. అనంతరం క్రేన్ల సాయంతో వృక్షాలను పెకలించి, భారీ ట్రాలర్లపైకి ఎక్కించి, దిబ్బపాలెం ఎస్‌ఈజ్ పునరావాస కాలనీ, కొండకర్ల ఆవ, అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ ఆవరణలో నాటడానికి తరలిస్తున్నారు. కొండకర్ల ఆవ వద్దకు తరలించి భారీ వృక్షాన్ని.. అప్పటికే సిద్ధం చేసి పెద్ద గొయ్యిలో పాతారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కొబ్బరికాయ కొట్టి పూజచేశారు. రోడ్డు విస్తరణ కోసం తొలగిస్తున్న వందేళ్లపైబడిన భారీ వృక్షాలకు తిరిగి జీవం పోయాలనే ఆలోచన చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్‌లను ఆయన అభినందించారు.





