News

బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ యువకుడి సజీవ దహనం

160views

 

బంగ్లాదేశ్‌లో మరో భయానక ఘటన చోటు చేసుకొంది. దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని సజీవ దహనం  చేశారు. ఈ ఘటన నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది.

శుక్రవారం రాత్రి ఓ దుకాణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. షట్టర్‌ మూసివేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాయి. ఈ సమయంలో షాపులో నిద్రిస్తున్న చంచల్‌ భౌమిక్‌ (23) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. చంచల్‌ మరణించాడని నిర్ధరించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరిలో ఒకరు దివ్యాంగుడు. వీరి తండ్రి చాలా కాలం క్రితమే మృతి చెందాడు. చంచల్‌ ఆదాయంపైనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. కుటుంబ పోషణ కోసం నార్సింగ్డి ప్రాంతంలోని ఓ గ్యారేజీలో అతడు గత ఆరేళ్లుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు.

పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు, చంచల్‌ యజమాని ఆరోపిస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్‌, ఖోకొన్‌ చంద్రదాస్‌ అనే వ్యక్తులను కూడా ఇదే విధంగా అల్లరిమూకలు హత్య చేసిన విషయం తెలిసిందే.