News

అరసవల్లిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు – భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు

146views

ఆదిత్య క్షేత్రం వెలిగిపోయింది విశ్వకోటికి వెలుగునిచ్చే దినకరుడి పండగ మొదలైంది. అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓ వైపు సూర్యజయంతి మరోవైపు ఆదివారం ఈ పర్వదినాన ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసి తరించేందుకు భక్తజనం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు శనివారం రాత్రి 9 గంటల నుంచే క్యూలైన్లలో నిరీక్షించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు దేవస్థానంలో ఆరంభమైన మహాక్షీరాభిషేక సేవ నయనానందకరంగా సాగింది.

మాఘశుద్ధ సప్తమి రోజున అశేష భక్తజనుల కోలాహలం మధ్య సూర్యనారాయణస్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. భానుడి నిజరూపం దర్శనంతో భక్తులు పులకించిపోయారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఇప్పిలి నగేష్‌శర్మ నిర్వహణలో అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయ్యిదాల నడుమ క్షీరాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఉదయం 11 గంటల లోపు రావద్దు : మరోవైపు రథసప్తమి సందర్భంగా అరసవల్లిలోని ఆదిత్యుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీ రద్దీ కారణంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌, పోలీసులు పలు సూచనలు చేశారు. స్వామివారి దర్శనానికి స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆదివారం ఉదయం 11 గంటల లోపు రావద్దని జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సూచించారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని ఇప్పటికే ఉచిత, నగదు, డోనర్‌ దర్శనాలు సహా క్యూలైన్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయని పోలీసు శాఖ తెలిపింది. అన్నిరకాల పాస్‌లను సైతం ప్రస్తుతానికి అనుమతించడం లేదని పేర్కొంది. భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రద్దీని క్రమబద్ధీకరించి భక్తులందరికీ దర్శనం అవకాశం కల్పిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు : తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వాహనసేవలో అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు, తన తొలిఉషారేఖలను అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ మలయప్పస్వామిపై ప్రసరించి అంజలి ఘటిస్తాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పొటెత్తారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా సాగింది. ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో కన్నుల పండువగా నిర్వహిస్తారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వేంచేసి ఉన్న సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. రథసప్తమి రోజు స్వామివారిని దర్శించుకుంటే సమస్త చీడపీడలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందుతామని ఆయురారోగ్యాలు పెంపొందుతాయని భక్తులు విశ్వాసం. భక్తుల రద్దీని దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గోవింద నామస్మరణలతో దేవుని కడప : రథసప్తమి సందర్భంగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథంపై కూర్చున్న స్వామివారిని దర్శించేందుకు బారులు తీరారు. గోవింద నామస్మరణలతో దేవుని కడప ఆలయమంతా మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి దేవుని కడప పురవీధుల్లో రథంపై స్వామివారిని ఊరేగించనున్నారు.

కర్నూలులో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సూర్య దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి సందర్భంగా యోగా శిక్షణ కేంద్రాల్లో సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేశారు. పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సూర్య నమస్కారాలు చేశారు.