
సంక్రాంతి అనగానే హరిదాసులు గుర్తొస్తారు. కాషాయ వస్త్రాలు, కాళ్లకు గజ్జెలు, నుదుట నామాలు, మెడలో పూల దండలు, రుద్రాక్షమాలలు, తలపై అక్షయపాత్రను ధరించి.. ఇల్లిల్లూ తిరుగుతారు. చిడతలు వాయిస్తూ, శ్రావ్యంగా ఆలాపన చేస్తారు. హరినామ స్మరణ చేస్తూ వాగ్గేయకారుల కీర్తనలను గానం చేసే హరిదాసులను పరమాత్మ ప్రతినిధులుగా భావిస్తారు. హరిదాసుల గానామృతం ఆధ్యాత్మిక చింతన పెంచడమే గాక మనలో చైతన్యం కలిగించి, సామాజిక సంస్కరణకు దోహదం చేస్తుంది. వీరిది కృష్ణ భక్తులైన పురందరదాసు, కనకదాసుల సంప్రదాయంగా చెబుతారు.
హరిదాసులకు కాయగూరలు, పండ్లు, బియ్యం సమర్పిస్తే.. తెలిసీ తెలియక చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని విశ్వసిస్తారు. వారు భిక్ష స్వీకరించి, సర్వశుభాలూ చేకూరాలని ఆశీర్వదిస్తే.. సాక్షాత్తూ దేవుడే దీవించిన అనుభూతి పొందుతారు. హరిదాసులు ఈ ధనుర్మాసమంతా ఊరూరా సంచరించి జీవనానికి అవసరమైన గ్రాసాన్ని సంపాదించుకుంటారు. మిగిలిన సమయాల్లో తమకు చేతనైన వృత్తులను చేపడతారు. తమలో తాము ఊర్లను పంచుకుని.. ఒకరు వెళ్లిన ప్రాంతానికి మరొకరు వెళ్లని విధంగా ఏర్పాటు చేసుకుంటారు.
సాధారణంగా భిక్ష అడిగేవారిని విసుక్కోవడం లేదా ఇవ్వకుండా.. తర్వాత రమ్మనడం చూస్తుంటాం. కానీ హరిదాసుల విషయం అలా కాదు. వారిని దైవస్వరూపంగా భావిస్తారు. దూరంగా వారి ఆలాపన వినిపించగానే.. పదార్థాలను సిద్ధం చేసుకుని, వారి రాకకై నిరీక్షిస్తారు. అక్షయపాత్రలో భిక్ష సమర్పించి ఆశీస్సులు పొందుతారు.
హరిదాసులే గాక.. గంగిరెద్దులను ఆడించేవారు, పగటి వేషధారులు, గారడీవాళ్లు, ఎందరెందరో జానపద కళాకారులతో అలరారుతాయి సంక్రాంతి పర్వదినాలు. పండుగ సందర్భంగా ఇటువంటి ఆనందాలను ఆస్వాదిస్తూ, బంధుమిత్రులతో కలిసి చక్కటి పిండివంటలు ఆరగించడం ఆనవాయితీ. భక్తిచింతనతోపాటు సరదాలు పంచే పండుగ సంక్రాంతి.





