News

ఆర్‌ఎస్‌ఎస్‌ సామాన్య కార్యకర్త ప్రధానిగా ఎదిగారు అది ఆ సంస్థ శక్తి : దిగ్విజయ్‌ సింగ్‌

191views

కాంగ్రెస్‌కు మరో తలనొప్పి వచ్చి పడింది. మొన్నటివరకు ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కేంద్రంపై, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తూ.. సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్‌ నేత మోదీకి చెందిన పాత ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. సంఘ్‌ సిద్ధాంతాలపై ప్రశంసలు కురిపించారు.

గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన పాత ఫొటోను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ పంచుకున్నారు. ఇందులో బిజెపి అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ కుర్చీలో కూర్చొని ఉండగా.. ఆయన ముందు నేలపై ప్రధాని మోదీ కూర్చొన్నట్లు ఉంది. నేలపై కూర్చొన్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోదీని ఉద్దేశిస్తూ దిగ్విజయ్‌ కొనియాడారు. ‘నేను ఓ ఫొటో చూశాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌లో సామాన్య కార్యకర్తలా.. నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చొన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్‌, ప్రియాంక గాంధీలను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది.

కాగా.. గత కొంతకాలంగా శశిథరూర్‌ మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మోదీకి కితాబిస్తూ థరూర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ‘‘ఎప్పుడూ ఎలక్షన్‌ మోడ్‌లో ఉంటానని తనను అందరూ ఆరోపిస్తుంటారని మోదీ చెప్పారు. కానీ ఆయన ప్రజల సమస్యల విషయంలో ఎప్పుడూ ఎమోషనల్‌ మోడ్‌లో ఉంటారు’’ అని థరూర్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.