
హిందూ సంప్రదాయంలో గోవుల ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడితో సమానంగా గోవులను హిందువులు, జైనులు పూజిస్తారు. అయితే దేశంలో గోవధ పెరిగిపోవడం ఆందోళనకు దారితీస్తోంది. పలు రాష్ట్రాలు కఠిన చట్టాలు అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో గోవధ యదేచ్ఛగా సాగిపోతోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో గోవధ నిషేధం అమలవుతోంది. మరికొన్ని రాష్ట్రాలునిబంధనలకు లోబడి గోవధను అనుమతిస్తున్నాయి.
గోవధ నిషేధం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం, రాష్ట్రాలు పశువుల సంతతి మెరుగుపరచడానికి గోవధను నిషేధించాలని సూచిస్తుంది, అయితే దీని అమలు రాష్ట్రాలను బట్టి మారుతుంది, కొన్ని రాష్ట్రాలు (కేరళ, పశ్చిమ బెంగాల్) గోమాంసం వినియోగాన్ని అనుమతిస్తే, మరికొన్ని రాష్ట్రాలు (మహారాష్ట్ర, కర్ణాటక) కఠినమైన నిషేధాలు, జరిమానాలు, శిక్షలతో చట్టాలను అమలు చేస్తున్నాయి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు, నిబంధనలను రూపొందిస్తున్నాయి.
2019లో నిర్వహించిన పశుగణన గణాంకాల ప్రకారం దేశంలో 19.34 కోట్ల ఆవులున్నాయి.
ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో గోవధ పలు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతోంది. కేరళలో 2022లో 143474 ఆవులు వధించారని అంచనా.అస్సాంలో 57150 మణిపూర్‌లో 105000 ఆవులను వధించారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇలా దేశంలో పలు రాష్ట్రాల్లో యదేచ్ఛంగా గోవధ సాగిపోతోంది.
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 48, రాష్ట్ర ప్రభుత్వాలకు గోవధ నిషేధం చేసే అధికారం వుంది. దీని ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు గోవధను పూర్తిగా నిషేధించాయి. ఉల్లంఘించిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తాయి,
కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో గోవధ నిషేధంపై కొంత సడలింపు ఉంది.కేంద్ర ప్రభుత్వం జంతు క్రూరత్వ నిరోధక చట్టాల కింద పశువుల మార్కెట్లలో గోవుల అమ్మకం, కొనుగోలుపై నిషేధాలు విధించింది.
ఏపి గోవధ నిషేధ చట్టం 1977
గోవులను వధించినా, గాయపరచినా నాన్ బెయిలబుట్ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా చట్టాలున్నా అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ఏపీ గోవధ నిషేధ చట్టం ప్రకారం గోవులను వధించడం, హింసించడం, ఆహారంలో విషం కలిపి చంపడం, అక్రమ రవాణా చేసేవారికి గరిష్ఠంగా పదివేల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
రెండు శిక్షలు కూడా విధిస్తారు. కర్ణాటక ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాటిల్ యాక్ట్ 2020 అమలు చేస్తోంది. 13 సంవత్సరాలలోపు ఆవుల వధ నిషేదించింది.
భారత రాజ్యాంగంలోని అధికరణం 48 ఏం చెబుతోంది?
గోవధ నిషేధంతోపాటు వివిధ రకాల గోవుల సంతతిని కాపాడాలని భారత రాజ్యాంగంలోని అధికరణం 48 సూచిస్తోంది. భారత ప్రభుత్వ జంతు హింస నిరోధక చట్టం 2016లో కొన్ని నిర్ధిష్టమైన నిబంధనలు రూపొందించారు. గోవుల విక్రయాలు చేసే వారు అవి వధకు వెళ్లకుండా చూసుకోవాలి. గోవుల రవాణాలోనూ నిబంధనలు పాటించాలి.
గోవుల తరలింపులోనూ నిబంధనలు పాటించాలి
వాహనాల్లో గోవులు తరలించే క్రమంలో పలు నిబంధనలు పాటించాలి. 1978 జంతువుల రవాణా చట్టంలోని నిబంధనలు ఈ విధంగా వున్నాయి. వ్యవసాయం కోసం గోవులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిచాల్సి వస్తే ముందుగా గోవు ఆరోగ్యం గురించి పశువైద్యుడి నుంచి సర్టిఫికెట్ పొందాలి. రవాణాకు ఉద్దేశించిన ఆవులకు ఎలాంటి అంటువ్యాధులు లేవని వెటర్నరీ వైద్యుడి సర్టిఫికెట్ పొందాలి. గోవులను తరలించే వాహనాల్లో తప్పనిసరిగా ప్రాథమిక చికిత్స మందులు, సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలి.
గోవులను ఎవరి వద్ద కొనుగోలు చేశారు. ఎవరికి చేరవేస్తున్నారు అనే వివరాలు ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. గోవులను తరలించే క్రమంలో వాటికి ఆహారం అందుబాటులో ఉంచాలి. వాహనంలో గోవులు తరలించే క్రమంలో వాటి మధ్య కనీసం రెండు చదరపు అడుగుల స్థలం ఉంచాలి. వాటికి ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలి. గర్భంతో వున్న ఆవులను ట్రక్కుల్లో తరలింపు నిషేధించారు. అలాంటి వాటిని రైలు మార్గాల్లో తరలించాలి.
గోవధ నిషేధ చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం ఏదీ?
గోవధను నిషేధిస్తూ పలు రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నా, దేశంలో నేటికీ చాలా ప్రాంతాల్లో గోవధ కొనసాగుతూనే ఉంది. గోసంరక్ష్‌లు అక్రమంగా గోవుల రవాణా అడ్డుకునే సందర్భంలో ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తోంది. గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రత్యేక యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు. పోలీసులు, రవాణా అధికారులకే ప్రస్తుతం జంతు రవాణాను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అక్రమార్కులు రాత్రి వేళల్లో గుట్టుగా గోవుల అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు.





