ArticlesNews

స్వస్థత ముసుగులో.. 2025లో మత మార్పిడి నెట్‌వర్క్ – ఒక డేటా అనలిస్ట్ కోణంలో..

187views

ఈ ఎవాంజెలిజం మరియు నకిలీ స్వస్థతల గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడు.. దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుందని నేను మొదట్లో అనుకోలేదు. మే 2025లో మీడియా మానిటరింగ్ చేస్తున్నప్పుడు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక జిల్లా క్రైమ్ రిపోర్టులో ఒక చిన్న వార్త కనిపించింది. మందులు లేకుండానే జబ్బులు నయం చేస్తామంటూ నమ్మించి ఒక చోట “ప్రార్థన సమావేశం” నిర్వహించారు. దానిపై ఆ గ్యాంగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలే. ఇది కేవలం ఆ ఒక్క చోట జరిగిన విషయం కాదు. ఇలాంటి చాలా కేసుల వెనుక ఒకే రకమైన పద్ధతి ఉందని నాకు అర్థమైంది.

కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటిదే మరో కేసు బయటపడింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, అటుపైన మహారాష్ట్ర. ఇలా రాష్ట్రాలు మారాయి, పాస్టర్లు మారారు, ఊర్లు మారాయి.. కానీ వాళ్ళు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే. 2025 మే నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా నమోదైన FIRలు, కోర్టు ఆర్డర్లు, అక్కడ ఉన్న సాక్ష్యాలను ఒకసారి విశ్లేషించి చూస్తే.. ఒక భయంకరమైన విషయం అర్థమైంది. ఈ నకిలీ స్వస్థత సమావేశాలు అనేవి ఏదో అనుకోకుండా జరిగి చెడిపోయినవి కావు. పేదరికాన్ని, అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని పదే పదే చేస్తున్న ఒక కుట్ర. దీనివల్ల జబ్బులు తగ్గకపోగా.. కేసులు నమోదు కావడం, కుటుంబాలు విడిపోవడం, నిశ్శబ్దంగా ప్రజలను లొంగదీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అద్భుతాలు జరుగుతాయని ఊరించి, చివరికి చట్టం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిన ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కథను ఒక జర్నలిస్ట్ దృష్టితో తేదీల వారీగా ఇక్కడ వివరిస్తున్నాను.

1. మే 2025 — మొదటి కేసు

ఈ పద్ధతిని నేను మొదటిసారి మే 2025 మధ్యలో గమనించాను. అప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్ (బెల్హరి బాగ్) నుంచి ఒక కేసు నా ముందుకు వచ్చింది.

అక్కడ ఒక చిన్న గదిని ప్రార్థన హాల్‌గా మార్చారు. ఒక దళిత కుటుంబానికి “ఈరోజే నీ జబ్బు తగ్గిపోతుంది” అని హామీ ఇచ్చారు.

అయితే ఇది నమ్మకంతో చేసిన పనా? లేక బలవంతమా? నిందితుడు దైవ శక్తితో జబ్బు నయం చేస్తానని నమ్మించి, ఆ ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ల చిత్రాలను, వస్తువులను తీయించేశాడు. అంతేకాకుండా, 50 వేల రూపాయలు ఇస్తామని ఆశ చూపి, మతం మారాలని కండిషన్ పెట్టాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మతపరమైన కరపత్రాలను, కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మత స్వేచ్ఛ చట్టం కింద వారిపై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేశారు.

అప్పట్లో ఇది ఎక్కడో ఒక దగ్గర జరిగిన చిన్న విషయం అనుకున్నాను, కానీ అది నా పొరపాటే. అన్నీ ఇలాంటివేనని తర్వాత అర్థమైంది.

2. జూన్ 2025 — ఊరు మారింది కానీ సీన్ మారలేదు

జూన్ వచ్చేసరికి, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుండి రిపోర్ట్స్ రావడం మొదలయ్యాయి.

పేర్లు మారాయి కానీ, వారు వాడే భాష మాత్రం ఒక్కటే.

జబల్‌పూర్‌లో ఒక అనారోగ్యంతో ఉన్న మహిళకు.. నువ్వు కొత్త మతాన్ని స్వీకరిస్తేనే కోలుకుంటావని చెప్పారు. ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు 2,000 రూపాయలు ఆశ చూపి, మెరుగైన ఆరోగ్యం, ఆర్థిక లాభాలు ఉంటాయని నమ్మబలికారు.

 

ఇక పిలిభిత్‌లో అయితే, ఒక మహిళను నది దగ్గరికి తీసుకెళ్లి, కళ్లకు గంతలు కట్టి రకరకాల ప్రార్థనలు చేయించారు. నీకు జబ్బు రావడానికి కారణం నీ “పాత నమ్మకాలే” అని ఆమెను నమ్మించారు.

ప్రతి కేసులోనూ ఒకే రకమైన పద్ధతి కనిపిస్తోంది:

ముందుగా జబ్బు పడిన వారిని లేదా బలహీనంగా ఉన్నవారిని గుర్తించడం.

ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోతుందని నమ్మించడం.

ఆ స్వస్థతను మత మార్పిడితో ముడిపెట్టడం.

మాట వినకపోతే బెదిరించడం లేదా పదే పదే ఒత్తిడి చేయడం.

ఇప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. దీని వెనుక ఒక పక్కా ప్లాన్ (టెంప్లేట్) ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.

3. జూలై–ఆగస్టు 2025 — ఊపందుకున్న మత మార్పిడులు

జూలైలో, ఉత్తరప్రదేశ్‌లోని విష్ణుపురలో జరుగుతున్న ఒక ప్రార్థన సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మెయిన్ ఆర్గనైజర్ తప్పించుకోగా, మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఆగస్టు వచ్చేసరికి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మరియు యూపీలోని ఇస్లాంనగర్‌లో FIRలు నమోదయ్యాయి. ఈ క్రమంలో “చంగై సభ” అనే పదం పదే పదే వినిపించింది. ఇవి కేవలం జబ్బులు నయం చేసే మీటింగ్స్‌ అని ప్రచారం చేసి, తీరా జనం వచ్చాక వాటిని మత మార్పిడి కార్యక్రమాలుగా మార్చేవారు. పోలీసులు మత స్వేచ్ఛ చట్టంతో పాటు BNS సెక్షన్ 299 కింద కేసు నమోదు చేసి, పాస్టర్ సుఖ్‌నందన్ లహ్రే మరియు రఘునందన్ లహ్రేలను అరెస్ట్ చేశారు.

4. సెప్టెంబర్ 2025 — క్రౌడ్ పెరుగుతోంది..

ఉత్తరప్రదేశ్‌లోని నిగోహన్ (మల్ఖాన్)లో, ఒక పాస్టర్ తన పొలంలోని ఇంట్లోనే ఈ మీటింగ్‌లు పెట్టేవాడు. అనారోగ్యంతో ఉన్న గ్రామస్తులను పిలిపించి, తన ప్రార్థనలతో జబ్బులు నయం చేస్తానంటూ నకిలీ అద్భుతాలు చేసేవాడు. చివరికి ఫిట్స్ (Epilepsy) ఉన్న ఒక చిన్న అబ్బాయికి కూడా నయం చేస్తానని డ్రామాలు ఆడాడు. ప్రజలను ఆకర్షించడానికి డబ్బులు, ఇతర ప్రయోజనాలు ఆశ చూపుతూ.. ముఖ్యంగా ఆడవాళ్లను, పిల్లలను బాప్టిజం తీసుకోమని, మతం మారమని ఒత్తిడి చేసేవాడు.

ఇక జార్ఖండ్‌లోని హజారీబాగ్, ఛత్తీస్‌గఢ్‌లోని బుండియాలో అయితే ఈ సభలు ఇంకా పెద్ద ఎత్తున జరిగాయి. ఏకంగా ఊర్లకు ఊర్లనే పిలిచేవారు. మతం మారితే ఇకపై మీకు అసలు జబ్బులే రావని కొందరు నిందితులు నమ్మబలికారు. మరికొందరైతే మీకు ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తామని గ్యారెంటీ ఇచ్చారు. కానీ తీరా చూస్తే ఆ ఊసే లేదు.

5. అక్టోబర్–నవంబర్ 2025: విదేశీ హస్తం

అక్టోబర్‌లో మహారాష్ట్రలోని భివాండి నుండి వచ్చిన ఒక కేసు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో నిందితుల్లో ఒకరు విదేశీయుడు. జేమ్స్ వాట్సన్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి భివాండిలోని గ్రామస్తులను మతం మార్చడానికి ఈ నకిలీ స్వస్థతలనే వాడుకున్నాడు.

బహిరంగంగానే వింత వింత విన్యాసాలు చేస్తూ జబ్బులు నయం చేస్తున్నట్లు నటించేవారు. ఆ సమయంలోనే మతపరమైన పుస్తకాలను కూడా పంపిణీ చేసేవారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఇక నవంబర్‌లో, ఆగ్రాలో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో 8 మంది నిందితుల పేర్లను చేర్చారు. వీరు సుమారు 80 కుటుంబాలను ఆరోగ్య వాగ్దానాలు, పిల్లలకు చదువు, పెద్దలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి మోసం చేశారు.

ఇప్పటికి ఈ నెట్‌వర్క్ ఎలా విస్తరిస్తుందో నాకు క్లియర్ గా అర్థమైంది:

ముందుగా ఒక ఇల్లు → తర్వాత ఊరు → ఆపై జిల్లా → చివరికి రాష్ట్రం మొత్తం.

వీరు ఎప్పుడూ పేదలను, అనారోగ్యంతో ఉన్నవారిని లేదా సమాజంలో ఒంటరిగా ఉన్నవారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. అది కూడా ఏదో “ప్రార్థన” లేదా “వేడుక” పేరుతో ముసుగు వేసి ఈ పనులు చేస్తారు.

6. డిసెంబర్ 2025 — ఆ వైరల్ వీడియో

ఈ ఏడాది చివరి ఫైల్ డిసెంబర్ 9, 2025న పూణే నుండి వచ్చింది.

అప్పుడు ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక క్రిస్మస్ వేడుకలో ఒక పాస్టర్ తాను ఒక మహిళకు ఉన్న ఎయిడ్స్ (AIDS) వ్యాధిని కూడా నయం చేశానని క్లెయిమ్ చేశాడు. దీనిపై పోలీసులు స్పందించి అతడిని అరెస్ట్ చేశారు. ఆ ఫైల్ క్లోజ్ చేసే సమయానికి నాకు ఒక విషయం అర్థమైపోయింది. ఇక దీనిపై ఎలాంటి అనుమానం లేదు. పేర్లు వేరు, రాష్ట్రాలు వేరు కావచ్చు.. కానీ వాళ్ళు చేసే డ్రామాలు ఒక్కటే, వాడే పద్ధతి ఒక్కటే, బాధితులు కూడా ఒకే రకమైన వాళ్ళు.

ఈ కథ మనకు ఏం చెబుతోంది?

మన దేశంలో నమ్మకాన్ని ఎవరూ అడ్డుకోరు.. దానికి రక్షణ ఉంటుంది. కానీ మోసం, బలవంతం మరియు బలవంతపు మత మార్పిడులకు చట్టంలో తావు లేదు. మే నుండి డిసెంబర్ 2025 వరకు జరిగిన ప్రతి కేసూ ఒకే విషయాన్ని నిరూపిస్తోంది. జనం యొక్క బలహీనతలను, అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఈ నకిలీ స్వస్థతలను ఒక సాధనంలా వాడుకున్నారు. ఇది ఏదో అప్పటికప్పుడు అనుకోకుండా జరుగుతున్నది కాదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, పక్కా ప్లాన్‌తో వ్యవస్థీకృతంగా జరుగుతున్న పని. ఇది ఏదో ఒక్కరు చేస్తున్నది కాదు, ఒక భారీ నెట్‌వర్క్ ప్లాన్ ప్రకారం చేస్తున్న పని అని క్లియర్ గా అర్థమవుతోంది.