ArticlesNews

సమతా స్ఫూర్తి తెలుగు సాహిత్య కీర్తి ఉన్నవ లక్ష్మీ నారాయణ

159views

( డిసెంబర్ 4 – ఉన్నవ లక్ష్మీ నారాయణ వర్ధంతి )

ఎంతో మంది సామాజిక సంస్కర్తలు, సమాజ జీవితాన్ని ఆనందమం చేయడానికి నిరంతరంగా తమవంతు ప్రయత్నం చేశారు. అటువంటి విశేష ప్రయత్నం చేసిన ఒక శ్రేష్ఠమైన వ్యక్తి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు. ఈయన డిసెంబర్ 4, 1877న శేషమ్మ, శ్రీరాములు దంపతులకు గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో జన్మించారు. వారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. 1892లో లక్ష్మీబాయితో వివాహం అయ్యింది. 1897లో గుంటూరులో Matriculation పూర్తి చేశారు. 1916లో డబ్లిన్‌ విశ్వవిద్యాలయంలో బారిష్టర్ చదివారు. అనంతరం స్వదేశానికి వచ్చి 1917లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు.

శ్రీ కందుకూరి వీరేశలింగంగారు, బ్రహ్మ సమాజం చేపట్టిన సామాజిక సంస్కరణలు ఉన్నవ గారిని విశేషంగా ప్రభావితం చేశాయి. వారిలో నిద్రాణమై ఉన్న జాతీయ వాదాన్ని తట్టి లేపాయి. అదే సమయంలో, గాంధీగారు, స్వాతంత్ర్య సాధన కోసం సమాజానికి పిలుపునిచ్చారు. శ్రీ లక్ష్మీనారాయణ, అన్నింటినీ తృణ ప్రాయంగా వదిలేసి, సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ వాది అయినప్పటికీ, మత ప్రాతిపదికపై జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్మొహమాటంగా విమర్శించారు ఉన్నవ. స్వాతంత్రోద్యమంలో భాగంగా పల్నాడులో అటవీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన పుల్లరి సత్యాగ్రహం (1921), ఉప్పు సత్యాగ్రహం (1931), క్విట్ ఇండియా ఉద్యమం (1942)లో పాల్గొని అనేక సార్లు కారాగార శిక్ష అనుభవించారు. ఆయనతో పాటు వారి సతీమణి శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయిగారు కూడా అనేక ప్రజాహిత, స్వాతంత్ర్య ఉద్యమాలలో విశేష సేవలు అందించారు. భర్తతో పాటు అనేక సార్లు కారాగార శిక్ష కూడా అనుభవించారు. శ్రీలక్ష్మీనారాయణ, నడిపిన “గుంటూరు పత్రిక” సామాజిక సంస్కరణా ఉద్యమాలకు ప్రేరణా కేంద్రంగా నిలిచింది.

శ్రీ లక్ష్మీనారాయణ స్వాతంత్ర్య సాధనలో భాగంగా, రాయవెల్లూరు కారాగార శిక్ష అనుభవిస్తున్న సమయంలో, ఆయనలోని కవి, సమాజంలోని వివక్షని ఎండగడతూ 1922లో ఆయన చేత “మాలపల్లి” అనే (762) పుటల సుదీర్ఘ నవల వ్రాయించింది. ఈ నవల నాటి రాజకీయ వాతావరణాన్ని, తెలుగువారి జీవన విధానాన్ని, సాంఘిక దురాచారాలని, జాతీయ సత్యాగ్రహ ఉద్యమాలని, మార్పుకి అడ్డుపడుతున్న కుల, వర్గ, వర్ణ వ్యవస్థలని, కులం కారణంగా ఆధ్వాన్నంగా మారిన హరిజనుల సామాజిక, ఆర్థిక అసమానతలని విస్తృతంగా పరిశీలించింది. సామజిక, ఆర్థిక అసమానతలపై బలమైన విమర్శ చేస్తూనే, హరిజనుల అభ్యున్నతి దిశగా వారు ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు వంటి అనేక కార్యకలాపాలకు పురి కొలిపారు.

సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతీ పౌరుడు, అందునా ఒక రచయిత, ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనలను నిశితంగా పరికిస్తాడు. వాటి నుండి స్వదేశానికి, సమాజానికి కావలసినది క్రమం తప్పకుండా తీసుకుంటాడు. ఇది శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారికి కూడా వర్తిస్తుంది. గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపించి గుంటూరు వీరేశలింగంగా ప్రసిద్ధి చెందారు. 1922లో శారదా నికేతన్ స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించారు. వారికి వృత్తి విద్యలలో కూడా శిక్షణ అవకాశాలు అందించారు. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు కేవలం రచనాకారుడుగానే కాక, ఆచరణ పూర్వకంగా హరిజనోధ్ధరణ, సామాజిక సమరసత కోసం తన సంపూర్ణ జీవితాన్ని వెచ్చించి, 25.09.1958లో తుది శ్వాస విడిచారు.