
పాకిస్థాన్ కు చెందిన ఐ ఎస్ ఐ ప్రతినిధుల వలపు ఉచ్చులో చిక్కుకొని దేశ భద్రత రహస్యాలను వారికి చేరవేసిన భారత నౌకాదళ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాలలో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమయ్యేవని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్ సయ్యద్, షేక్ సహిస్థాలు (మహిళ) పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నౌకాదళ ఉద్యోగుల ఖాతాలలో ఈ సొమ్ములు వేసేవారని గుర్తించింది.
ఉగ్రవాదుల సన్నాహక కార్యక్రమాలలో భాగస్వాములవుతున్నామని నిందితులందరికీ తెలుసునని కూడా నిగ్గుతేల్చింది. ఈనెల 18, 22 మధ్య నిందితులను ఎన్ఐఏ కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో ఈ కేసులో వారి ప్రమేయాన్ని, నేరపూరిత చర్యలను నిందితులే అంగీకరించినట్లు సమాచారం. నిందితులు ఫేస్బుక్, ఈమెయిల్ ఖాతాల ద్వారా పాక్ కు చెందిన ఐ ఎస్ ఐ ప్రతినిధులతో సంభాషణలు జరిపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణుల సాయంతో ఖాతాల్లోకి లాగిన్ అయ్యి అందులోని సమాచారాన్ని విశ్లేషించింది. వాటిలో ఎక్కువ భాగం నేరపూరిత అంశాలే ఉన్నట్లు తేల్చింది. కొన్ని కీలక డాక్యుమెంట్లనూ డౌన్లోడ్ చేయించి స్వాధీనం చేసుకుంది. సంభాషణల సారాంశం ఏంటి? ఎప్పుడెప్పుడు ఎలాంటి సమాచారం పాక్ కు చేరింది? అనే అంశాలపై మరింత లోతుగా దృష్టి సారించింది.
ఫోరెన్సిక్ ప్రయోగశాలకు చేతివ్రాత
నిందితుల మెయిళ్ళలో చేతివ్రాతతో కూడిన కొన్ని కీలక డాక్యుమెంట్లు ఎన్ఐఏకు లభించాయి. వారిని అరెస్టు చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ చేతివ్రాత ఎవరిదో విశ్లేషించేందుకు డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు ఎన్ఐఏ పంపించింది. చేతి వ్రాతను సరిపోల్చేందుకు నిందితుల సంతకాలనూ సేకరించింది.
అంతా పాతికేళ్ళలోపు వారే
ఈ కేసులో ఇప్పటివరకూ 13 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు హవాలా ఆపరేటర్లు, 11 మంది నౌకాదళ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా పాతికేళ్ళలోపు యువకులే కావడం గమనార్హం. ప్రధానంగా సున్నీ కుమార్ అలియాస్ సున్నీ సింగ్, అశోక్ కుమార్ డెగ్, సంజయ్ కుమార్ దాస్, అశోక్ కుమార్, సోమనాథ్ సంజయ్ ఇకడే, సంజయ్ కుమార్, వికాస్ కుమార్, సోను కుమార్, కలవల పల్లి కొండబాబు, అవినాష్ సోమల్ లు వాట్సాప్ ద్వారా యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల కదలికల సమాచారాన్ని, నౌకాదళ కార్యకలాపాల వివరాలను ఎప్పటికప్పుడు పాక్ నిఘా విభాగం అధికారులకు పంపించే వారని దర్యాప్తులో తేలింది. కీలక స్థావరాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను పంపించినట్లు ఎన్ఐఏ గుర్తించింది.
Source : Enadu.





