News

‘G RAM G’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం- ప్రతులను చించేసిన విపక్షాలు

151views

‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న ‘వికసిత్‌ భారత్‌ రోజ్‌ గార్ ఆజీవికా హామీ మిషన్‌ గ్రామీణ్‌’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్యే వీబీ జీ రామ్‌ జీ బిల్లుకు ఆమోదం లభించింది. ఆమోద సమయంలో వెల్‌లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు ప్రతులు చించి విసిరేశారు. బిల్లు ఆమోదం తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది.

బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడిన కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రాలు కార్మికులపై ఎక్కువగా ఖర్చు చేసి అభివృద్ధి పనులకు తక్కువగా ఖర్చుచేశాయని తెలిపారు. యూపీఏ కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా నరేగా మాదిరి ఉపాధి గ్యారంటీ పథకాలను ప్రారంభించాయని తెలిపారు. 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేగా పథకానికి మహాత్మా గాంధీ పేరును అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్టిందని శివరాజ్‌సింగ్ ఆరోపించారు. భారత్‌-పాకిస్థాన్ విభజనకు ఒప్పుకొని గాంధీ ఆదర్శాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడించిందని విమర్శించారు.

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం : ఖర్గే
అంతకు ముందు వీబీ జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు నిరసన తెలిపాయి. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌తో గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, కనిమెుళి, టీఆర్ బాలు, ఏ. రాజా తదితర పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. వీబీ జీ రామ్ బీ బిల్లును పార్లమెంటు స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానించడమే కాకుండా, గ్రామాల్లో సామాజిక, ఆర్థిక పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పని హక్కును కూడా అణచివేసిందని మల్లికార్జు ఖర్గే ఉన్నారు. ప్రభుత్వ ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని ఎక్స్​లో పోస్ట్ చేశారు.

పల్లె ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించడం కోసం 2025లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘ఎన్‌ఆర్‌ఈజీఏ’ చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాత 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు. ఇక ఈ కొత్త బిల్లు ప్రకారం, పేరు మార్చడంతోపాటు ఉపాధి హామీ పథకం అమలులో గుణాత్మకమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరంలో కనీసం 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధి కల్పించనున్నారు. దీని ద్వారా సుసంపన్న, సుస్థిర గ్రామీణాభివృద్ధిని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పర్యవేక్షణకే కేంద్రానికే పరిమితం కానుంది. నిర్వహణ, జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. రైతులకు కూలీల లభ్యత పెరిగి కూలీరేట్లు నియంత్రణలో ఉండేందుకు వీలుగా వ్యవసాయ సీజన్లో 60 రోజులపాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని ప్రతిపాదించారు.

ఉపాధి కల్పించడంతోపాటు నాలుగు ప్రాధాన్య రంగాల్లో చిరకాలం మన్నే మౌలికవసతుల కల్పనకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. ప్రతిపనినీ వ్యూహాత్మక దృష్టితో చేపడతారు. జలభద్రత, మౌలికవసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటిద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. కూలీల డిజిటల్‌ హాజరు, డిజిటల్‌ చెల్లింపులతోపాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తారు.