News

ఇది ‘రాముడి’ బ్యాంక్.. ఇక్కడ నామాలే డిపాజిట్లు

161views

బ్యాంకు అనగానే మనకు ఆర్థిక లావాదేవీలే గుర్తొస్తాయి. కానీ, కేవలం కమర్షియల్‌ బ్యాంకులే కాదు.. బ్లడ్‌ బ్యాంక్‌, ఫుడ్‌ బ్యాంక్‌, క్లాత్‌ బ్యాంక్‌ వంటి వాటి గురించి వింటున్నాం. చూస్తున్నాం. కానీ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ అరుదైన బ్యాంక్‌ ఉంది. డబ్బులు, నాణేలు కాదు.. రామ నామాలే డిపాజిట్లుగా స్వీకరించడం ఇక్కడ ఆనవాయితీ. స్థానిక గోవింద్ దేవ్ జీ ఆలయ ప్రాంగణంలో ‘రామ్ నామ ధన సంగ్రహ బ్యాంక్’ పేరిట ఇది కొనసాగుతోంది. బాలకృష్ణ పురోహిత్ దీన్ని ఏర్పాటు చేశారు. 1987 నుంచి నడిపిస్తున్నారు.

ఈ బ్యాంకులో రామ నామాలు రాసిన పుస్తకాలను డిపాజిట్‌ చేస్తారు. ఇప్పటి వరకు 140 బిలియన్లకు పైగా రామ నామాలు డిపాజిట్ అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల్లో కొందరు అప్పటికే రాసిన రామ నామాల పుస్తకాలను డిపాజిట్‌ చేస్తారు. కొత్త పుస్తకాలను తీసుకెళతారు. అలా ఇక్కడికొచ్చిన వారి పేరిట బ్యాంక్‌ పాస్‌బుక్‌ మాదిరిగా ఒక ‘మంత్ర’ అకౌంట్‌ ఉంటుంది. అందులో ఖాతాదారుడి పేరు, ఇప్పటి వరకు ఎన్ని మంత్రాలు అతడి ఖాతాలో జమయ్యాయి వంటి వివరాలు పొందుపరుస్తారు. తాను నిర్దేశించుకున్న లక్ష్యంలో ఎన్ని చేరుకున్నారు.. ఎన్ని చేరుకోవాలనే వివరాలు అందులో ఉంటాయి. ఇక్కడ లాభనష్టాలు, వడ్డీ లేవని కేవలం భక్తి మాత్రమే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ బ్యాంక్‌ కోసం శాశ్వత భవన నిర్మాణం చేపడుతున్నారు.