
భారత పార్లమెంటుపై ఉగ్రమూక కుట్రను తిప్పికొట్టే క్రమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు యావత్తు దేశం ఘన నివాళులర్పించింది. 2001 డిసెంబరు 13న దాడికి పాల్పడిన ఐదుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ క్రమంలో పది మంది భారతీయులు మరణించారు. వారిలో ఆరుగురు దిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా విభాగ అధికారులు, ఒక జర్నలిస్టు, తోటమాలి ఉన్నారు. నాటి వారి త్యాగాలను ప్రతి ఏడాది అదే రోజు పాత పార్లమెంటు భవనంలో స్మరించుకుంటున్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరులకు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు నివాళులర్పించారు.
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారిని జాతి ఎల్లవేళలా గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంలో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. వారి త్యాగానికి భారత్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడిగా పంపిన సందేశంలో అమరవీరులకు నివాళులర్పించారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలన్న నిబద్ధతను భారత దేశం ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తోంది’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.





