News

దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

175views

భారత్‌ను ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందిన నాయకుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దిల్లీని ఆక్రమిస్తాం అని అర్థం వచ్చేలా.. ఆ నగరాన్ని పెళ్లికూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో భారత వైమానిక దళంపై కూడా నోరుపారేసుకున్నాడు.

లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు అబ్దుల్‌ రవూఫ్‌. పాక్‌ ఆర్మీ అతడిని సాధారణ పౌరుడిగా పేర్కొంది. అయితే, భారత్‌పై దాడులకు బహిరంగంగా పిలుపునిస్తూ చేసిన వ్యాఖ్యల్లో అతడిలోని ఉగ్ర భావజాలం స్పష్టమవుతుంది. తాజాగా ప్రసంగంలో అతడు మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో సాయుధపోరాటం సమసిపోయిందనే వాదనలను కొట్టిపారేశాడు. వివాదం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించాడు. ఎల్ఐటీ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని ఉద్దేశిస్తూ.. భారత రాజధాని (దిల్లీని ఉద్దేశిస్తూ)ని స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూపు లక్ష్యమన్నాడు. ఈ సందర్భంగా దిల్లీని ఆక్రమిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు.

ఇక భారత సైనిక శక్తిపై కూడా రవూఫ్‌ నోరుపారేసుకున్నాడు. రఫేల్‌ యుద్ధవిమానాలు, ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్‌లు అసమర్థమైనవిగా అభివర్ణించాడు. భారత వైమానిక దళం.. పాక్‌ గగనతలంలోకి ప్రవేశించే ధైర్యం చేయదని వ్యాఖ్యానించాడు. ఇస్లామిక్‌ దేశాల్లో పాక్‌ వద్ద మాత్రమే అసలైన అణ్వాయుధాలు ఉన్నాయన్నాడు.