
ఢిల్లీలోని బాబానాథ సింగ్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు విజయవంతం అయ్యాయని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు.ఈ సమావేశాలకు 225 మంది సాధు సంతులు హాజరయ్యారని తెలిపారు. భారత రాజ్యాంగంలో మతపరంగా వున్న మైనారిటీలకు ప్రత్యేక హక్కులిచ్చిందని, కానీ.. ఆశ్చర్యంగా రాజ్యాంగం మతపరమైన మైనారిటీకి నిర్వచనం మాత్రం ఇవ్వలేదన్నారు.
మత పరమైన మైనారిటీ అనే పదానికి నిర్వచనం ఇవ్వాలని మార్గదర్శక్ మండల్ గట్టిగా డిమాండ్ చేస్తోందని అలోక్ కుమార్ తెలిపారు. మతం ఆధారంగా హింస లేదా వివక్షను ఎదుర్కొన్నవారు వున్నారా? లేరా? అన్న దానితో సహా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. అసలు మన దేశంలో ఏ సమయంలోనైనా ముస్లిం, క్రైస్తవాలను అనుసించే ప్రజలు మతం ఆధారంగా ఎలాంటి అణచివేతనైనా, వివక్షను ఎదుర్కోలేదని, దీనిని అంగీకరించాల్సిందేనన్నారు. వీరు మిగిలిన సమాజం కంటే ఏమీ వెనుకబడిలేరన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు జనాభాలో 14శాతం కంటే ఎక్కువ మంది వున్నారని, అలాగే వీరి జనాభా ఇప్పుడు 18 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందని ఓ అంచనా అని వెల్లడించారు. మన రాజ్యాంగం మతం ఆధారంగా ఎలాంటి వివక్షనైనా తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు.
అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో మతపరమైన మైనారిటీలను కొనసాగించడం సముచితమేనా? అంటూ అలోక్ కుమార్ ప్రశ్నించారు. న్యాయమైన చర్చకు ఈ అంశం పూర్తిగా అర్హమైందనే వీహెచ్ పీ మార్గదర్శక్ మండల్ భావిస్తోందన్నారు.
ఇక.. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట బాంబు దాడి విషయాన్ని కూడా అలోక్ కుమార్ సూటిగానే లేవనెత్తారు. ఈ దాడిలో పాల్గొన్న వారు పేదలు కాదని, వెనుకబడినవారు కాదని, వారంతా విద్యావంతులు, ఉన్నత ఆదాయ వర్గానికి చెందినవారేనని, సామాజికంగా మంచి గౌరవం పొందారని అన్నారు. అలాగే ఏకంగా ఓ విశ్వవిద్యాలయం జిహాదీల నియామకాలకు, ఆధునిక మార్గాల ద్వారా తీవ్రవాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందన్న విషయం కూడా బట్టబయలైందన్నారు.
ఇక్కడి ఉగ్రవాదులకు ప్రపంచం నలుమూలల నుంచీ నిధులు అందుతున్నాయని, జిహాదీ మనస్తత్వం అనేది కేవలం శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య కానేకాదన్నారు.ఇస్లాంలోని ఒక వర్గం జిహాద్‌ను తమ మతపరమైన విధిగా భావిస్తుందని, అలాగే దానిలో మోసం, దోపిడీ, కిడ్నాప్ మరియు క్రూరమైన హత్యలను కూడా అంగీకరిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో అలాంటి జిహాదీ మనస్తత్వానికి స్థానం లేదని అలోక్ కుమార్ తేల్చి చెప్పారు. ప్రపంచ శాంతిని కాపాడుకోవడానికి అన్ని రకాల, అన్ని స్థాయిల్లోని జిహాదీ ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
హిందూ ప్రయోజనాల దృష్ట్యా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్‌ను తొలగించాలని పార్లమెంటులో అభిశంసన తీర్మానం తీసుకురావాలనే ప్రతిపాదనను మార్గదర్శక్ మండల్ చర్చించిందని అలోక్ కుమార్ ప్రకటించారు. ఒక న్యాయమూర్తి నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, కానీ అభిశంసన అనేది న్యాయవ్యవస్థపై అనవసర ఒత్తిడిని కలిగించే ప్రయత్నమని, దీనిని ఖండించాలని అలోక్ కుమార్ పిలుపునిచ్చారు.





