News

గత శతాబ్దంలో కొన్ని శక్తులు వందేమాతరం గీతానికి అన్యాయం చేశాయి : ప్రధాని మోదీ

74views

లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గతంలో జాతీయ గీతాన్ని “తుక్డే తుక్డే” చేసినట్టు ఆరోపించారు. అలాగే, వందేమాతరంతో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉందని నెహ్రూ పేర్కొన్నాడని చెప్పారు. సభలో “శేమ్‌ శేమ్‌” నినాదాలు వినిపించినప్పటికీ, మోడీ వ్యాఖ్యానిస్తూ.. గత శతాబ్దంలో కొన్ని శక్తులు జాతీయ గీతానికి సర్వనాశనం చేశాయని పేర్కొన్నారు. ఆ చరిత్రను వచ్చే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనని ప్రధాని మోడీ అన్నారు.

ఇక, 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ వందేమాతరానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది అని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్, నెహ్రూలు ఆ పోరాటాన్ని ఎదిరించకుండా, వందేమాతరం పై విచారణకు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. జిన్నా ఆందోళన తరువాత సుభాష్ చంద్ర బోస్‌కు నెహ్రూ రాసిన లేఖలో- వందేమాతరం మొత్తం చదివిన తరువాత అది ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలాన్ని గుర్తు చేసుకుంటూ.. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి దేశం మొత్తం బ్రిటిష్ వారి పాలనలో ఉండగా.. 100 ఏళ్లు పూర్తి అయ్యే సమయానికి దేశంలో అత్యవసర పరిస్థితి దేశాన్ని కబలించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను జైలులో పెట్టిన ఆ కాలం భారత చరిత్రలో బ్లాక్ డేస్ గుర్తించబడిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం కాదు. వేదకాలం నుంచి ఈ భూమి నా తల్లి, నేను భూమి పుత్రుడను అని చెబుతుంది. కొన్నాళ్లక్రితం వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలు మొదలైన సమయంలో నేను మాట్లాడుతూ వేల ఏళ్ల సంస్కృతి, స్వాతంత్ర్యం ప్రతిబింబించిందన్నాను. బ్రిటిష్‌ వారు భారతీయుల్లో ఆత్మన్యూనత నింపేశారు. ఆ సమయంలో బంకించంద్ర ఛటర్జీ భారతీయుల శక్తిని తెలియజేసేలా ఈ గీతాన్ని రచించారు. పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఇది ఎన్నో ఆశలు నింపింది. తమ పోరాటం కేవలం భూమి, అధికారం కాదని.. బానిసత్వ సంకెళ్లను తెంచుకొని సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికే అన్న సందేశాన్ని ఇచ్చింది.

ఆంగ్లేయులు విభజించి పాలించే మార్గాన్ని ఎంచుకొన్నారు. ఇందుకు బెంగాల్‌ను ప్రయోగశాలగా మార్చారు. వారికీ తెలుసు.. బెంగాల్‌ శక్తి దేశానికి ప్రేరణగా నిలుస్తుందని. అందుకే ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. దేశం విడిపోతుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే బెంగాల్‌ విభజన జరిగింది. బ్రిటిష్‌ వారు ఈ పాపం చేసిన సమయంలో వందేమాతరం ఓ శిలలా ఎదురొడ్డి నిలిచింది. ఆ నినాదమే ప్రజల్లో ప్రేరణ నింపింది. ఇది భారత్‌ బలహీనపడకుండా.. మరింత బలోపేతం చేసింది. బెంగాల్‌ విభజన జరిగినా.. ఓ పెద్ద స్వదేశీ ఉద్యమం పుట్టుకొచ్చింది. వందేమాతరం అన్నిచోట్ల మార్మోగింది’’ అని మోదీ పేర్కొన్నారు.

అయితే, వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ గీతానికి గౌరవం తిరిగి తీసుకురావాల్సిన సమయం ఇదేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 1875లో బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిగా నిలిచిందని ప్రశంసించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో 10 గంటల ప్రత్యేక చర్చను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో ప్రతిపక్షం తరఫున ప్రియాంకా గాంధీ వాద్రా నాయకత్వం వహిస్తున్నారు.