
దేశంలో అత్యధిక శాతం మందికి దైవంపై విశ్వాసంతో పాటు ఆలయాలలోని ప్రసాదాల పట్ల భక్తి భావం ఉంది. భగవన్నివేదిత పదార్థాన్ని ‘మహా ప్రసాదం’ అంటూ కళ్లకద్దుకొని ప్రీతితో స్వీకరిస్తారు. ఈ ప్రసాదాల తయారీ,రుచిలోనూ చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆయా క్షేత్రాలలో కొలువైన దేవీదేవతల మహత్తో, వండే విధానమో కానీ అవి అమృతోపమానాలు. వాటి రుచిని బట్టి ఆస్తికులే కాదు… నాస్తికులు మధుర పదార్థంగానైనా స్వీకరణను కాదనలేరు. ‘అశుచితో ఉన్నా, అనాచార్యుడైనా, మనసులో పాపపు ఆలోచనలు కలిగినవాడైనా లభ్యమైన ప్రసాదాన్ని స్వీకరించాలి (అశుచిర్వాప్యనాచారో మనసా పాపమాచరన్…. ప్రాప్తమాత్రేణ భోక్తవ్యం నాత్ర కార్యా విచారణా) అని ఆర్యోక్తి. ‘ప్రసాదం’ అంటే అనుగ్రహం అనీ అర్థం ఉంది. లౌకిక జీవితంలో పొందిన మేలును ‘మహా ప్రసాదం’గా సంభావిస్తారు. పదార్థాలు ఏవైనా అవి భగవాన్ సన్నిధికి చేరి పవిత్ర మంత్రజలంతో ప్రోక్షించి ప్రత్యేక మంత్రాలతో అభిమంత్రించడంతో దైవ దృష్టిసోకి అది ‘ప్రసాదం’ అవుతుందని విశ్వాసం. దానిని స్వీకరించడం వల్ల మనో స్థయిర్యం, మానసిక ప్రశాంతత కలుగు తుందని చెబుతారు. ప్రసాదాన్ని విస్మరిస్తే, చులకనగా చూస్తే కలిగే పరిణామలు ఎలా ఉంటాయో సత్యనారాయణస్వామి వ్రతకథలు వినిపిస్తాయి. ప్రసాదం పట్ల గల పవిత్రత, విశ్వాసాలకు అవి తార్కాణాలు.
‘పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః’ (
మనసారా సమర్పించే ఆకు కాని, పువ్వు కాని, పండు కాని, నీటిని కాని ప్రీతితో స్వీకరిస్తాను) అన్నాడు గీతాచార్యుడు. అదే సమయంలో ఆలయాలలో ఇచ్చే ఏ పదార్థాన్నయినా ‘మహా ప్రసాదం’గా స్వీకరించడం హిందూ సంప్రదాయం. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన వారు, ముఖ్యంగా పేదలు ఆకలితో అలమటించ కూడదన్న భావనతో తిరుమల తిరుపతి దేవస్థానం సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ, ప్రసాద వితరణ పథకాన్ని అమలు చేస్తోంది. దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలో ఈ కార్యక్రమం అమలవుతోంది. అందుకు వివిధ సంస్థలు, సంపన్నుల నుంచి సామాన్య భక్తుల వరకు శక్తి మేరకు విరాళాలను ఇస్తున్నారు. అయితే భక్తకోటి ప్రీతితో స్వీకరించే ప్రసాదం కొందరి వాచాలత్వంతో అభాసుపాలవు తోంది. తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామం అందుకు మరో ఉదాహరణ. తమను తాము కుబేరులుగా చెప్పుకుంటూ, హైదరాబాద్ కేంద్రం ఉన్న ఒక టీవీ ఛానల్ యాంకర్, ఆమె భర్త, స్నేహితుడితో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. క్యూలైన్‌లో వేచి భక్తులతో పాటు ఆ ముగ్గురికీ ‘శ్రీవారి సేవకులు’ ప్రసాదం అందచేశారు. ‘అతిసంపన్న(రిచ్చెస్ట్) బిచ్చగాళ్లం. ఖరీదైన (కాస్ట్ల్ట్లీ) ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం. కుబేరులం… జీవితంలో ఎన్నడూ అడుక్కోలేదు. ఇదే మొదటి సారి (ఫస్ట్ టైం)’ అన్న వారి లేకి మాటలు, వెకిలి నవ్వుల వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కెర్లు కొడుతోంది.‘అడుక్కుంటే అడుక్కున్నాం కానీ ప్రసాదం రుచిగా ఉంది’ అనీ ప్రశంసలు కురిపించారు (సదరు యాంకర్ తరువాత మన్నింపు కోరడం వేరే సంగతి). మన సంస్కృతీ సంప్రదాయాలను భాషను కాపాడుకునేందుకు ప్రజలు… ముఖ్యంగా యువత ముందుకు రావాలని మేధావులు, పెద్దలు ఒక పక్క పిలుపునిస్తుంటే.. ఆ యువత ప్రతినిధులనుకొనే వారి కురచ బుద్ధులను, రోత మాటలను ఏమనాలి? భగవత్ ప్రసాదాన్ని కించపరచడం అంటే ఆ పథకం దాతలను, అసలు ఆ వ్యవస్థనే అవమానించి నట్లుగా భావించాలి. ఆ ‘ముగ్గురు’ నోరు పారేసుకోవడమే శోచనీయం అయితే, క్యూలైన్‌లో ఉన్నప్పుడే వీడియో చిత్రీకరించడం తీవ్ర అభ్యంతరకరం, నిబంధన లకు విరుద్ధం. తిరుమలేశుని ఆలయ పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడరాదని, రీల్స్ తీయరాదని నిబంధనలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం, కొత్త పాలకమండలి `ఆ నిబంధనలు ఏ మేరకు అమలవుతున్నాయో సమీక్షించుకోవాలి.
ఈ సంఘటనే కాదు… హిందూ దేవీదేవతలను, దైవప్రసాదాన్ని దూషిం చడం, కించపరచడం ఇటీవల సంవత్సరాలలో ఎక్కువైంది. దేవుడు లేడనడం, ఆస్తికత్వంపై నమ్మకం లేకపోవడం, ప్రసాదాలను స్వీకరించక పోవడం వారి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని కించపరచడమే అభ్యంతరకరం. కొందరు రాజకీయ నాయకుల నుంచి, ప్రముఖులు (సెలబ్రిటీస్), ఇతర సామాన్యులు, హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దైవం మీద నమ్మకం లేకపోవడం వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. అదే సమయంలో తమ వ్యాపార అవసరాల కోసం దైవ సంబంధిత అంశాలను ఉయోగించు కోవడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ‘మేం హిందువులం… హిందువులం అంటున్నారు. రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమన్నా చిన్నమ్మనారా? లేకపోతే రాముడి వంశంలో పుట్టిన్రా మీరు?’ అని తెలంగాణలో అధికార పక్ష నాయకుడు ఒకరు బహిరంగ వేదికపై చేసిన హేళన వీడియో సామాజిక మాధ్యమాలలో తిరుగుతోంది. రథాల దహనం, దేవతా విగ్రహాల విధ్వంసం గురించి ప్రస్తావించుకోవడం చర్విత చర్వణమే అవుతుంది.
ప్రచారం కోసమో, నోటిదురుసుతోనో చేసే ఇలాంటి కువ్యాఖ్యలను తేలికగా తీసుకుంటే మరికొందరికి అలుసు ఇచ్చినట్లవుతుంది. దేశాధినేతల నుంచి వివిధ రంగాల ప్రముఖలు భక్తిభావంతో చేసుకొనే దైవదర్శనాలను, ప్రీతి పాత్రంగా స్వీకరించే ప్రసాదాల గురించి ఇంత చులకనగా మాట్లాడే వారిపై చర్యలు ఉండవా? శ్రీవారిని దర్శించే న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇలాంటి అంశాలను సుమోటోగా స్వీకరించలేరా? ‘చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలి’ అని సామెత. ఇలాంటి వాచాలత్వానికి, విపరీత ధోరణికి చుక్క పెట్టకపోతే ఆధ్మాతికవాదుల, ఆస్తికుల మనోభావాలకు విఘాతం కలుగుతుంది.





