News

సర్వ జీవుల శ్రేయమే హిందూ సంస్కృతి ఆకాంక్ష – శ్రీ జనార్ధన్

940views

అందరూ కలిసి ఆచరించేది, అందరికీ ఆమోదయోగ్యమైనది, అందరినీ సంస్కరించేదే సంస్కృతి అని సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జనార్ధన్ అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓల్డ్ మోహన్ దాస్ థియేటర్ నందు జరిగిన హిందూ చైతన్య ఆత్మీయ సమావేశంలో ముఖ్య వక్తగా శ్రీ జనార్ధన్ పాల్గొని ప్రసంగించారు.

ఒక దేశంలో అనేక మతాలు ఉన్నా దాని సంస్కృతి ఆధారంగా అందరూ కలసి మెలసి జీవించవచ్చని, ముస్లిం దేశాలైనా తమ ప్రాచీన సంస్కృతిని విడిచిపెట్టకుండా ఉన్న ఇండోనేషియా, బాలిలే అందుకు ఉదాహరణలు అని ఆయన తెలియజేశారు. వ్యక్తి ప్రవర్తనను స్వభావం అంటామని, అదే సమాజం యొక్క ప్రవర్తన సంస్కృతి అవుతుందని, అలాగే సమాజము, వ్యక్తులు పరస్పర ప్రేరకాలు అని, వ్యక్తులు సమాజాన్ని, సమాజం వ్యక్తులను పరస్పరం ప్రభావితం చేసుకుంటాయని ఆయన వివరించారు.

తమకు ఉపయోగపడే సృష్టిలోని ప్రతి అంశం మీద కృతజ్ఞత కలిగి ఉండడమే హిందూ సంస్కృతి విశిష్టత అని అందుకే భూమి, గోవు, గంగ, తులసి వీటన్నింటిపైనా మాతృభావనను హిందువులు కలిగి ఉంటారని, అలాగే పర స్త్రీలను సైతం మాతృ భావనతో గౌరవించడం హిందూ సంస్కృతి ప్రత్యేకత అని పేర్కొన్నారు.

హిందూ సంస్కృతి యావత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా ‘వసుదైవ కుటుంబకం’ అన్న భావనతో దర్శించిందని, “సర్వే భవంతు సుఖినః” అంటూ సృష్టిలోని సర్వ జీవుల యొక్క సుఖాన్ని, శ్రేయస్సును కాంక్షించిన జాతి హిందూ జాతి అని, నామరూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే, ఆయన సర్వాంతర్యామి అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా ఒకే సత్యాన్ని పండితులు పలు రకాలుగా బోధిస్తారు (ఏకం సత్ బహుదా వదంతి) అన్న విశాలమైన భావనను కలిగి ఉన్నది హిందూ సంస్కృతి అని శ్రీ జనార్ధన్ వివరించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన హిందూ జాతి సకల మానవాళిని శ్రేష్టులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ కృణ్వంతు విశ్వమార్యంచ’ అంటూ ప్రపంచానికి జ్ఞానాన్ని పంచి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదర్శాలన్నింటినీ హిందూ సమాజం తమ దైనందిన జీవితంలో అడుగడుగునా ఆచరించిందని ఆయన వివిధ ఉదాహరణల ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులు సుమారు 300 మంది పాల్గొని శ్రీ జనార్దన్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. వారి అద్భుత ప్రసంగానికి ఆహూతులు ముగ్దులయ్యారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.