
( నవంబరు 21 – పోలిస్వర్గదీపం )
నెల రోజులపాటు నదీస్నానాలు, పూజలు, వ్రతాలు, నియమనిష్ఠలతో గడుస్తుంది కార్తికమాసం. ఆ తర్వాత వచ్చేదే పోలిస్వర్గం. కార్తికమాసంలో దీపం వెలిగిస్తే పుణ్యప్రదమని, తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. కార్తికమాసంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి దీపం వెలిగించాలని పోలిస్వర్గం కథ తెలియజెబుతుంది.
ప్రచారంలో ఉన్న కథను అనుసరించి… పూర్వం పోలి అనే బాలిక ఉండేది. ఆమె చిన్నతనంలోనే దైవభక్తి అలవరచుకుని పూజలు, వ్రతాలు చేసేది. నిత్యం పూజ చేయనిదే మంచినీరైనా తాగేదికాదు. బంధుమిత్రులంతా పోలిని ఎంతో మెచ్చుకునేవారు. పెళ్లయ్యాక కూడా అలాగే భక్తిప్రపత్తులతో మెలిగేది. తన చిన్న కోడలైన పోలిని ఇరుగూపొరుగూ ప్రశంసిస్తుంటే.. ఆమె అత్తకు నచ్చలేదు. ‘తన కంటే కోడలు ఉత్తమురాలా?’ అని ఉక్రోషం చెందేది. తానే పరమ భక్తురాలు, పూజలేవైనా తానే చేయాలి, అందరూ తననే పొగడాలి- అనుకునేది. ఆ సంవత్సరం కార్తికమాసం రాగానే అత్త తన ఆధిక్యతను నిరూపించుకోవాలనుకుంది. పోలిని ఇంట్లోనే ఉండమని మిగతా కోడళ్లను తనతో నదికి తీసుకువెళ్లసాగింది. వారంతా నదీస్నానాలు చేసి దీపాలు వెలిగించి వచ్చేవారు. చిన్నకోడలు పోలి ఇంట్లోనైనా దీపం వెలిగించే అవకాశం లేకుండా నూనె, ఒత్తులు అందుబాటులో లేకుండా చేసేది అత్త. కానీ పోలి నిరాశచెందలేదు. సమయస్ఫూర్తితో పెరట్లో ఉన్న పత్తిచెట్టు దూదితో ఒత్తులు చేసి, కవ్వానికి అంటుకుని ఉన్న కాస్త వెన్నతో దీపం వెలిగించేది. ఆ దీపం కనిపిస్తే అత్త కోప్పడుతుందన్న భయంతో దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తికమాసమంతా దీపం వెలిగించింది. చివరి రోజు కూడా కార్తికదీపాలను నదిలో వదిలేందుకు వెళ్తూ పోలికి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్లింది ఆమె అత్త. పోలి ఆ పనులన్నీ వేగంగా ముగించి దీపం వెలిగించింది.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా అచంచల భక్తితో దీపారాధన చేసిన పోలిని చూసి దేవతలు సంతోషించారు. ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు దేవదూతలను పంపారు. అదే సమయానికి ఇంటికి చేరుకున్న అత్త, మిగతా కోడళ్లూ దేవదూతలను, విమానాన్ని చూసి.. తమ కోసమే అనుకుని సంతోషించారు. కానీ అది పోలి కోసమని అర్థమై అసూయచెందారు. ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వస్తామని ప్రాధేయపడగా దేవదూతలు నిరాకరించారు. పోలికి మాత్రమే స్వర్గానికి వచ్చే అర్హత ఉందని చెప్పి ఆమెని తీసుకుని వెళ్లిపోయారు. మనసుంటే మార్గం ఉంటుంది, అసలైన భక్తిని ఎవరూ అడ్డుకోలేరు, నిరోధించలేరు- అని పోలిస్వర్గం కథ నిరూపిస్తుంది. దైవభక్తికి కావల్సింది శ్రద్ధాసక్తులని, ఆడంబరాలు కాదని, అహంకారంతో సాగే పూజలు కొరగావని సందేశం ఇస్తుంది.
ఈ రోజున ఏం చేయాలి..
అమావాస్యరోజు ఉదయాన్నే పోలిని తల్చుకుంటూ వెలిగించిన దీపాలను అరటి దొప్పల్లో ఉంచి నీటిలో వదులుతారు. కార్తికమాసంలో ఏ రోజైనా దీపాన్ని వెలిగించలేక పోయినా.. ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందన్నది పెద్దల మాట. ఈ రోజున కొందరు దీపదానం చేస్తారు. కార్తిక అమావాస్య రోజున సాయంసంధ్య వేళలో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజించిన వారికి చింతలు తొలగి సంపదలు కలుగుతాయని బ్రహ్మపురాణం వివరిస్తోంది. చీకటిని పారదోలడమే కాదు.. చింతలను తొలగిం చగల మహిమ కార్తిక దీపానికి ఉందని భక్తులు విశ్వసిస్తారు.





