
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచ దేశాలు సహించకూడదని భారత్ పేర్కొంది. దాన్ని ఎవరూ సమర్థించకూడదని సూచించింది. ఈ మేరకు రష్యాలోని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ‘‘ఉగ్రవాదం నుంచి మా ప్రజలను రక్షించుకోవడానికి భారత్‌కు హక్కుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుంది. భవిష్యత్తులోనే తీసుకుంటుంది. గడిచిన సంవత్సరాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తుల ముప్పు ఎక్కువైంది. వీటిని ఎదుర్కోవడానికి ఎస్‌సీవో ఏర్పడిందన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు’’ అని జైశంకర్ గుర్తు చేశారు. అలాగే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎస్‌సీవో మారాలని, విస్తృత ఎజెండాను రూపొందించాలని, అందుకు తగ్గట్లు సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి భారత్ పూర్తిగా సహకరిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉందని, దీని వల్ల సరఫరా, డిమాండ్‌లలో సంక్లిష్టతలు ఏర్పడ్డాయని, వీటిని తగ్గించే చర్యలు అత్యవసరమని చెప్పారు.





