
అది 1963 జనవరి 27.. దిల్లీలోని నేషనల్ స్టేడియంలో ‘ఏ మేరీ వతన్‌కే లోగో’ అంటూ లతా మంగేష్కర్ ఆర్థ్రత నిండిన స్వరంతో.. పాడిన పాట విని అక్కడ ఉన్న ప్రతీఒక్కరి కళ్లూ చెమర్చాయి. చైనా చేసిన వెన్నుపోటు యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల కోసం ఆమె గుండెలోతుల్లో నుంచి పాడిన పాట అది. వాస్తవానికి ఆ సమయానికి యుద్ధంలో ఏ సైనికుల కోసం ఆమె పాడిందో.. వారిలోని కొందరి వీరగాథలు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే 16,000 అడుగుల ఎత్తున మంచు కింద సమాధి అయి మౌనంగా ఉన్నాయి.
యుద్ధం ముగిసిన తర్వాత 1963లో లద్ధాఖ్‌లోని స్థానిక గొర్రెల కాపరి రజాంగ్ లా వద్ద యుద్ధ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడి దృశ్యాలు చూసి అతడి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి. మంచులో కూరుకుపోయిన దాదాపు 100 మందికి పైగా భారత జవాన్ల మృతదేహాలు.. వారి చేతుల్లో తుపాకులు, కత్తులు. వారిలో అందరికీ ఛాతిలో, తలలో, శరీరంలోని ఇతర భాగాల్లో తూటాలు. కానీ, ఏ ఒక్కరికీ వెన్ను భాగంలో తగిలిన గాయాల్లేవు. ఆ దృశ్యం చూస్తే పోరాడుతూ వీరమరణం పొందినట్లు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అతడు వెంటనే సైన్యానికి సమాచారం అందించాడు.
వాస్తవానికి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఈ పోరాటం గురించి సైన్యానికి అప్పటికే సమాచారం ఇచ్చారు. అప్పట్లో అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఫిబ్రవరి 10వ తేదీన ఒక సెర్చ్ పార్టీ, రెడ్ క్రాస్ బృందం అక్కడికి చేరుకొంది. వారిని 13 కుమావ్ రెజిమెంట్‌లోని ‘చార్లీ కంపెనీ’కి చెందిన సైనికులుగా గుర్తించారు. ఈ బృందం మేజర్ షైతాన్ సింగ్ భాటీ నేతృత్వంలోనిది.
యుద్ధ నేపథ్యం ఇదీ..
భారత్-చైనా మధ్య 1961 నుంచే చిన్నచిన్న ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. డ్రాగన్ మూకలు లద్ధాఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. ఇక సింకియాంగ్-టిబెట్‌ల మధ్య భారత భూభాగంలో నుంచి చైనా ఏకంగా జాతీయరహదారినే నిర్మించింది. దీంతో విసుగెత్తిపోయిన నాటి ప్రధాని నెహ్రూ ఫార్వర్డ్ పాలసీని తెర పైకి తెచ్చారు. మరోవైపు చైనా మాత్రం ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ అంటూ దౌత్యనాటకాలు ఆడుతూనే తన ఆయుధాలకు పదును పెట్టుకొంది. 1962 అక్టోబర్ 20న మెరుపుదాడికి పాల్పడింది. సరిహద్దులోని భారత పోస్టులను ధ్వంసం చేసుకొంటూ.. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నవంబర్ నాటికి ఈ యుద్ధంలో భారత్ తీవ్రంగా దెబ్బతింది. లద్ధాఖ్‌ను కాపాడుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలో రజాంగ్‌లా పాస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇది లేహ్‌కు మార్గాన్నిచ్చే చుషుల్ లోయకు ముఖద్వారం వంటిది.
రంగంలోకి చార్లీ కంపెనీ..!
ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సైనికులను రజాంగ్‌లా పాస్ దాటనీయకుండా చూసే బాధ్యతను 13 కుమావ్ రెజిమెంట్‌లోని చార్లీ కంపెనీకి అప్పగించారు. దీని కమాండర్ మేజర్ షైతాన్ సింగ్ జోధ్‌పుర్‌కు చెందిన రాజ్‌పుత్. ఇక ఆ బృందంలో చాలామంది హరియాణాకు చెందిన అహిర్ జవాన్లు. వారి వద్ద రైఫిల్స్, మోర్టార్లు తప్ప పెద్ద ఆయుధాలు ఏమీ లేవు. వీరికి ఇంత తీవ్రమైన మంచులో పోరాడిన అనుభవం కూడా లేదు. కానీ, మొండి ధైర్యంతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు. దాదాపు 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న శిఖరంపై పలు ప్లాటూన్లుగా విడిపోయారు. వీరి టార్గెట్ చుషుల్ ఎయిర్ ఫీల్డ్‌ను కాపాడటం.
నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున వందల సంఖ్యలో చైనా సైనికుల కదలికలను భారత దళాలు గుర్తించాయి. దీంతో వెంటనే లిజనింగ్ పోస్ట్ నుంచి చార్లీ కంపెనీకి ఈ సమాచారం అందింది. ఆ తర్వాత సిపాయ్ భరత్‌సింగ్ లిజనింగ్ పోస్ట్‌లోని హుకుం సింగ్ తదితరులను వెనక్కి తగ్గమని పేర్కొన్నాడు. దీనికి హుకుంసింగ్ స్పందిస్తూ.. చైనా సైనికులకు ఎంతసేపు ఎదురొడ్డి నిలిచి వారిని నిలువరిస్తే.. కంపెనీ విజయానికి అన్ని అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.
వెనక్కి తగ్గం.. శత్రువులను ఎదిరిస్తాం..
లిజనింగ్ పోస్టులోని నలుగురు సైనికులతో కలిసి వందల సంఖ్యలో ఉన్న చైనా సైన్యంపై దాడి చేయాలని హుకుం సింగ్ నిర్ణయించుకొన్నాడు. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ.. జాగ్రత్తగా ఎదురుచూశాడు. వారు ఫైరింగ్ రేంజిలోకి రాగానే హఠాత్తుగా కాల్పులు మొదలుపెట్టాడు. ఈ ఊహించని పరిణామంతో చైనా మూకలు హడలిపోయాయి. ఆ తర్వాత తేరుకొని ఎదురుదాడి మొదలుపెట్టాయి. చాలాసేపు పోరాడిన తర్వాత పోస్టులోని ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా.. మరొకరి కాలికి గాయం కావడంతో చైనీయులకు దొరికిపోయాడు.
ఓ పక్క ఈ యుద్ధం జరుగుతుండగానే.. రజాంగ్ లా పాస్‌కు రక్షణగా ఉన్న షైతాన్ సింగ్ నేతృత్వంలోని ప్రధాన బృందం అప్రమత్తమైపోయింది. అయితే లిజనింగ్ పోస్టు వద్ద పోరాటం ముగిసిన కొద్దిసేపటికే చైనా సైన్యం షైతాన్ సింగ్ బృందంపై ముప్పేట దాడి మొదలుపెట్టింది.
నాయబ్ సుబేదార్ సూరజ్ నేతృత్వంలోని 7వ నెంబర్ ప్లాటూన్‌పై 400 మంది చైనా సైనికులు దాడి చేశారు. దీంతో సూరజ్ బృందం 3 అంగుళాల మోర్టార్లతో ఎదురుదాడి చేయడంతో 130 మంది చైనా సైనికులు గాయపడ్డారు. కానీ, చైనా మందబలం ఎక్కువగా ఉండటంతో చివరికి ఈ ప్లాటూన్‌లోని సైనికుల వద్ద ఆయుధాలు కొరవడటంతో చేతితో కూడా పోరాడారు. ఈ క్రమంలో గాయపడిన సూరజ్ చనిపోతూ కూడా.. పోరాడుతూ ఉండండి.. 13 కమావ్ కీర్తిని ఉన్నతంగా ఉంచండి అని పిలుపునిచ్చాడు.
మరోపక్క చైనా సైన్యం భారీగా షెల్లింగ్ చేస్తోంది. మేజర్ షైతాన్ సింగ్ మాత్రం దీనిని లెక్క చేయకుండా మోహరించిన ప్లాటూన్ల వద్దకు వెళ్లి వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. వారిలో ధైర్యం నింపుతున్నాడు. ఒక దశలో మందుగుండు అయిపోతే.. వెనక్కి తగ్గొచ్చని ఉన్నతాధికారులు సూచించారు. కానీ, షైతాన్ సింగ్ బృందం వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు.
భారత సైనికులు చైనా మీడియం మిషిన్‌గన్‌కు బలవుతున్నట్లు గుర్తించారు. గులాబ్ సింగ్, సింగ్‌రామ్ ఆ మీడియం మిషిన్‌గన్‌ను ధ్వంసం చేయాలని నిశ్చయించుకొన్నారు. వారు దానికి కొన్ని అడుగుల దూరం వరకు వెళ్లి చివరి క్షణంలో ప్రాణాలు కోల్పోయారంటే అర్థం చేసుకోవచ్చు.
మా పోరాటాన్ని దేశానికి చెప్పండి..!
చివరికి చాలామంది భారత సైనికులు వీరమరణం పొందడం.. గాయపడటం జరిగింది. 118 మందిలో కేవలం నలుగురు భారత జవాన్లు మాత్రమే తిరిగి వెళ్లారు. భారత సైనికులు ఒక్కొక్కరూ ఒక్కో మేరు పర్వతంలా శత్రు సైనికులకు ఎదురునిలబడ్డారు. మేజర్ షైతాన్ సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయినా చివరికి ఓ లైట్ మిషిన్‌గన్‌ను తెప్పించి.. దాని ట్రిగ్గర్‌కు తాడు కట్టించి.. దానిని తన కాలుకు కట్టుకొని తూటాలు పేల్చాడు. కదల్లేని పరిస్థితిలో కూడా ‘నన్ను వదిలిపెట్టి.. యుద్ధం కొనసాగించండి.. ఒక్క చైనీయుడు కూడా ముందుకు రాకూడదు’ అంటూ తన సైనికుల్లో స్ఫూర్తి నింపాడు. ఆయన తరగని స్ఫూర్తికి గానూ భారత ప్రభుత్వం మరణానంతరం ‘పరమ వీరచక్ర’ని ఇచ్చి గౌరవించింది.
ఇక ఈ పోరాటంలో చైనాకు భారీ నష్టం వాటిల్లింది. వారివైపు 500 మంది వరకు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.





