News

అయ్యప్ప దీక్షా వస్త్రాలతో పాఠశాలకు విద్యార్థిని అనుమతించని యాజమాన్యం

186views

అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని యాజమాన్యం అనుమతించని వైనంపై వివాదం తలెత్తింది. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకుని ఉదయం పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించింది. సమాచారం అందుకున్న అయ్యప్ప మాల ధరించిన భక్తులు, అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ – ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి ఎందుకు అనుమతించరంటూ ప్రశ్నించారు. విషయం తెలిసిన భవానీపురం పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయ్యప్ప దీక్షదారులంతా కలిసి ఈ విషయాన్ని డీఈవో యు.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడడంతో సమస్య సద్దుమనిగింది. జరిగిన సంఘటనపై అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పి విద్యార్థిని అనుమతిస్తామని చెప్పారు. ఇటీవల విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు ఉన్నత పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో వివాదం ఏర్పడింది.

జీఐజీ పాఠశాల యాజమాన్యానికి డీఈవో నోటీసులు
అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించని గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్‌నేషనల్‌ పాఠశాల యాజమాన్యానికి డీఈవో సుబ్బారావు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పాఠశాల యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఏదైనా ప్రైవేటు, ఎయిడెడ్, తదితర పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాల ధరించి వస్తే వారికి అభ్యంతరం తెలపకుండా తరగతి గదిలోకి అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాల నిర్వాహకులు అభ్యంతరం తెలిపినా, అనుమతించకపోయినా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.