ArticlesNews

ఆకులు రాలని, పూలు వాడని వసంతారామం కృష్ణ శాస్త్రి సాహిత్యధామం

273views

(నవంబర్ 1 – కృష్ణశాస్త్రి జయంతి)

భిన్న కులాలు, వర్గాలు ఎన్ని ఉన్నా ఓ దేశంగా భారతీయులంతా ఒక్కటే. భారతమాత పేరు వినగానే మనసు ఉప్పొంగని భారతీయుడు ఉండడు. జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి అంటూ అపారమైన దేశభక్తితో ఏకంగా భరతమాతనే పరవశింపజేసిన ధన్యజీవి మన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లిగారు రాసిన జనయిత్రీ దివ్యధాత్రి గేయం జాతీయ పండుగల సందర్భాల్లో మన తెలుగువాళ్ల నోట నేటికీ పారాయణంగా మ్రోగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని వర్ణిస్తూ జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ అనే గేయాన్ని సైతం అందించారు. దేశభక్తి ఛాయలోనే ఆంధ్ర దేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ఈ గేయం చాలామంది తెలుగువారికి తెలియదు.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి సమీపంలోని చంద్రపాలెం గ్రామంలో నవంబరు 1వ తేదీన 1897 సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్య గోష్ఠి జరుగుతూ ఉండేది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన కృష్ణశాస్త్రిగారికి చిన్నతనం నుండే పండితుల, కవుల సత్సంగము, సాహిత్యాభిరుచి, సాహిత్యాభినివేశమూ లభించాయి. తన ఏడవ ఏటనే కృష్ణశాస్త్రిగారు నందనందన ఇందిరా నాథ వరద అనే పద్యాన్ని సామర్లకోటలో ఆశువుగా చెప్పారు. పదో ఏట రామతీర్థంలో ఆశువుగా కవిత చెప్పారు. కృష్ణశాస్త్రిగారి విద్యాభ్యాసం పిఠాపురం హైస్కూల్‌లో సాగింది. పాఠశాలలో తన గురువులు కూచినరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకున్నారు. 1918లో విజయనగరం వెళ్లి డిగ్రీ పూర్తి చేసి తిరిగి పిఠాపురం చేరారు.

కృష్ణ శాస్త్రి గారు పెద్దాపురం మిషన్ హైస్కూల్‌లో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు. 1920లో వైద్యం కోసం రైలులో బళ్ళారి వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి ఆకులో ఆకునై, పూవులో పూవునై అని పలవరించారట. అది తెలుగుభావ కవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. ఆ విధంగా ప్రకృతి నుండి లభించిన ప్రేరణ కారణంగా కృష్ణపక్షం కావ్యం రూపుదిద్దుకుంది. 1929లో రవీంద్రనాథ్ టాగూర్‌ను కలిసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. 1947 నుండి మద్రాసులో ఉంటూ సినిమాలకు పాటలు, మాటల రచనను కొనసాగించారు. ఆయన తెలుగు సినిమాకి రాసిన పాటల సంఖ్య 170 కానీ అన్ని పాటలు జనరంజకాలే…అన్నీ ఆణిముత్యాలే..తెలుగులో ఆధునిక సాహిత్య క్షేత్రంలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహిత్యం మధుర స్వప్నంలాంటిది, మహతీ స్వరలాపనలాంటిది.

కృష్ణ శాస్త్రి కవి, గేయకర్త, గేయనాటికా కర్త కూడా. వారు కృష్ణ పక్షము, ప్రవాసము, ఊర్వశి, పల్లకి అనే కవితా సంపుటాలు రాశారు. క్షీరసాగర మథనం, విప్రనారాయణ చరిత్ర, మాళివికాగ్నిమిత్ర మొదలైన యక్షగానాలు, కృష్ణాష్టమి శర్మిష్ఠ, ధనుర్దాసు, సాయుజ్యము, గుహుడు, శివక్షేత్రయాత్ర మొదలైన నాటికలు ప్రధానమైనవి. మంచి వక్తగా, రచయితగా, భావకవులకు ప్రతినిధిగా కవిగా, గేయకారునిగా, గేయనాటికా కర్తగా తెలుగు దేశపు నాలుగు చెరగులా కీర్తి ధ్వజాన్ని ఎగురవేశారు. కృష్ణ శాస్త్రి గారి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగబోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అని ఆ సందర్భంలోనే అన్నారు. వీరికి 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది. 1980 ఫిబ్రవరి 24న మావి చిగురు తినే కోయిల మూగబోయింది. మల్లెలు కన్నీరు మున్నీరయ్యాయి. కార్తీక రాతిరిలో కరిమబ్బు కమ్మింది, ఊర్వశి ఒంటరిదైపోయింది. చేతికి పెట్టుకున్న గోరింటాకు రంగు ఇచ్చి పోయినట్టుగా తన కవిత్వపు అమృతాన్ని మనకిచ్చి వెళ్లిపోయారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. తెలుగు భాష ఉన్నంతవరకు ఆయన కవితలు, పాటలు నిలచి ఉంటాయి. ఆ పాటలు, కవితలు మనల్ని అలరిస్తొన్నంతవరకు కృష్ణశాస్త్రి గారు చిరంజీవే..