
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని కేరళ సీసీబీ పోలీసుల బృందం బళ్లారికి చేరుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బళ్లారిలోని ఓ బంగారు దుకాణంలో, స్థానికంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో కేరళ పోలీసులు విచారణ చేపడుతున్నారన్నారు. బళ్లారికి చెందిన వ్యాపారి నుంచి 400 గ్రాముల బంగారం, ఇతర బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్‌లో ఈ బంగారు తాపడాల నుంచి పసిడిని వేరు చేసి.. పుత్తడిని బళ్లారికి చెందిన బంగారం వ్యాపారి గోవర్ధన్‌కు విక్రయించినట్లు ఉన్నికృష్ణన్ విచారణలో సిట్ అధికారులకు చెప్పారు. దీంతో గోవర్ధన్‌కు సిట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఉన్నికృష్ణన్ తనకు బంగారం విక్రయించడం నిజమేనని గోవర్ధన్ అంగీకరించాడు. అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన సిట్ అధికారులు.. ఉన్నికృష్ణన్‌ను తీసుకొని శుక్రవారం బెంగళూరు బయల్దేరారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు బళ్లారిలో విచారణ చేపట్టారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ 2004-2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అక్కడి ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగి రేకులకు 1998లో బంగారు తాపడం చేసిన విషయం తెలుసుకున్నాడు. కాలక్రమంలో బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్ పొట్టీ ఆలయ తాపడాల బంగారాన్ని తస్కరించడానికి ప్రణాళిక వేశాడు. బంగారు తాపడాలకు మెరుగులుదిద్దుతానని ప్రతిపాదించడంతో ఆలయ నిర్వాహకులు 2019లో ఆ పనిని అతడికి అప్పగించారు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా.. తాపడాలపై ఉన్న బంగారం బరువు తగ్గిన విషయం తాజాగా బయటపడింది.





