ArticlesNews

కమ్యునిస్టుల నరమేధం

87views

బెంగాల్ లో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన సుమారు 1700 మంది బెంగాలీ హిందు శరణార్థులను పోలీసులు, కమ్యూనిస్టులు దారుణంగా ఉచకోత కోసారు. స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద ఎత్తున తన మనుషులనే నరమేధం చేస్తే ఒక్కరు కూడా దీనికి జవాబు చెప్పలేని పరిస్థితి. ఈ నరమేధాన్ని అప్రాధాన్యతగా చూడడం వరకే కాదు ఇంకా ముందుకు వెళ్లి సమర్థించే స్థాయికి వెళ్లారు కమ్యూనిస్టులు వారి మద్దతుదారులు. భారత్ లో చాలా ముఖ్యమైన భాగంలో ఈ అరాచకం చోటుచేసుకుంటే దేశంలోని చాలా మందికి ఈ విషయం తెలియని స్థితి. 38 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అక్కడి వేలాది కుటుంబాల్లో విషాదం నింపింది.

బెంగాల్  లో సిపిఎం-వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 1979 జనవరి 31న జరిగిన ఘటన ఇది. ఉత్తర పాకిస్తాన్ (తర్వాత బాంగ్లాదేశ్) లో తీవ్ర వేధింపులకు గురై సుందర్బనాల్లోని నిర్జీవ ప్రాంతంలోకి తరలి వచ్చిన బెంగాలీ హిందూ శరణార్థులకు ఇక్కడ కూడా రక్షణ లేక తుపాకులకు బలయ్యారు. సరిహద్దులు దాటి వచ్చిన ఈ అభాగ్యులు అంతా పేదలు… వీరిలో చాల మంది దళితులు, ఓబీసీ లున్నారు. వికృత, అమానుష, క్రూరమైన ధోరణికి అద్దం పట్టేలా కమ్యూనిస్టులు వీరి పట్ల వ్యవహరించిన తీరు నిశ్చేష్ఠులను చేసింది.

కోలకతాకు తూర్పున 75 కిలోమీటర్ల దూరంలో ఉంది మరిచ్ఛపి. పార్టీ బలపడుతూ రాష్ట్రం బలహీన పడేలా వ్యవహరిస్తున్న జ్యోతిబసు కన్ను ఆ ప్రాంతంపై పడింది. పేదల ఛాంపియన్ అని చెప్పుకునే కమ్యూనిస్టులు తమ సహజమైన అసలు రంగును బయటపెట్టారు. అక్కడకు చేరుకుంటున్న శరణార్ధుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

1947 దేశ విభజనకు కొద్దిగా ముందు లక్షలాది మంది బెంగాలీ హిందువులు ఉత్తరపాకిస్థాన్ లో మతపరంగా, సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురై ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టె ప్రయత్నం ప్రారంభించారు. ఆ తర్వాత 1970-71లో పశ్చిమ పాకిస్తాన్ ఆర్మీ తూర్పు పాకిస్తాన్ లో ఉన్న బెంగాలీ మాట్లాడే వారిపై సామూహిక హత్యాకాండకు దిగింది. దీనితో అక్కడి నుండి వారు వలస బాట పట్టారు. “వీరంతా తూర్పు పాకిస్తాన్ లో  పేద, సన్నకారు రైతులు, చిన్న వృత్తులు చేసుకునే వారు. వీరిలో చాల మంది దళితులు, ఓబీసీ లు ఉన్నారు.  తూర్పు బెంగాల్ (1947లో తూర్పు పాకిస్థాన్ గా మారింది)లో ఉన్న ఉన్నత కులాలకు చెందిన, విద్యావంతులు, సంపన్నులైన వారు దేశ విభజనకు ముందే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో సొంత ఇళ్లను సమకూర్చుకున్నారు. కానీ వలస పోవడానికి అవకాశం మార్గం లేని పేదలు, నిమ్న కులాలకు చెందిన వారు అక్కడే ఉండిపోయారు” అని ప్రముఖ చరిత్రకారుడు ఆమియా మజుందార్ వెల్లడించారు.

విభజన సమయంలో లక్షలాది దిగువ కులాల వారు తూర్పు పాకిస్తాన్ లోనే ఉండిపోయారు. భారతదేశానికి వెళ్లడం కన్నా ఇక్కడే ఉండిపోవాల్సిందిగా వారికి నాయకత్వం వహిస్తున్న జోగేంద్రనాథ్ మండల్ పిలుపు నిచ్చారు. దళిత-ముస్లింలు ఐక్యంగా ఉండాలని చెబుతూ వచ్చే మండల్ ఆలోచన విఫల ప్రయత్నమే అయింది. మండల్ పిలుపుని నమ్మారు లక్షలాది మంది దళితులు, ఓబీసీలు. పాకిస్తాన్ మొదటి కార్మిక, న్యాయ శాఖ మంత్రి అయ్యాడు మండల్. కానీ పాకిస్తాన్ హిందూ వ్యతిరేక విధానాలు, ఇస్లామిస్టుల పట్ల అనుసరిస్తున్న  ఉదార స్వభావం చూసి ఓర్వ లేకపోయాడు మండల్. 1950లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ కి తన రాజీనామా లేఖను సమర్పించాడు మండల్.

ముస్లిం మతతత్వ వాదుల మతపరమైన వేధింపులకు గురవుతూ పశ్చిమ బెంగాల్ కి తరలి వస్తూ మండల్ బాట పట్టారు అనేక మంది దళితులు, ఓబీసీలు. ఇలా వచ్చే వారికి ముందులో స్థానిక అధికారులు ప్రోత్సాహం కూడా ఇచ్చారు. అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో వీరంతా ఉండడటానికి అవకాశం ఇచ్చారు. అయితే రాను రాను వీరి వల్ల భారం పెరుగుతుందని భావించి వారందరికీ దండకారణ్యంలో శరణార్థులుగా ఉండడానికి ఆ మూడు రాష్ట్రాలు, కేంద్రం కూడా అవకాశం కల్పించింది. ఈ దండకారణ్యం చాల విశాలమైన భూభాగం. ప్రస్తుత ఒడిశా, ఛత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల లో వ్యాపించి ఉన్న ఈ దండకారణ్యం జలశూన్యమైనదీ, ఆదివాసీల నివాసం ఉండే విస్తృతమైన ప్రాంతం. శరణార్థులకు స్థిర నివాసం ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దండకారణ్య అభివృద్ధి అథారిటీ (డి.డి.ఏ) ఏర్పాటు చేసింది. వేలాది మంది బెంగాలీ హిందు శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుండి పశ్చిమ బెంగాల్ కి అక్కడి నుండి దండకారణ్యలోకి ప్రవేశించి శిబిరాల్లో తలదాచుకున్నారు. అక్కడ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం శరణార్థులు తమ జీవనం సాఫీగా సాగేలా తగు సహాయం, భూములు పండించుకునేందుకు వీలుగా (ఇజ్రాయెల్ మాదిరీ) అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. శరణార్థులుగా వచ్చిన సుమారు రెండున్నర లక్షల మందికి భూపట్టాలు, స్థలాలు, సాగుకు  వీలయ్యే భూములు అందివ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది డి.డి.ఏ. కానీ శరణార్థులు పంట సాగు చేయడానికి ఒండ్రు ఉన్న గంగా నది డెల్టా ప్రాంతం వైపు వారు వెళ్లడం ప్రారంభించారు. దండకారణ్యం లో పంటలు పండడం  కష్టమే కాకుండా నివాసయోగ్యంగా ఆ ప్రాంతం లేదని శరణార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నది వారి ఆందోళన. అక్కడి నుండి  ఆ శరణార్థుల్లో పాలకులపై వ్యతిరేకత, ఆగ్రహావేశాలు రావడం ప్రారంభం అయింది.

శరణార్థులను రెచ్చగొట్టిన కమ్యూనిస్టులు:

1960వ దశకం మధ్యలో బెంగాల్ లో కమ్యూనిస్టులు గట్టి ప్రతిపక్షంగా ఉన్నారు. శరణార్థుల వ్యతిరేకతకు, కోపతాపాలకు మరింత ఆజ్యం పోశారు. బహిరంగంగానే శరణార్థులకు మద్దతు తెలిపారు కమ్యూనిస్టులు. దండకారణ్య ప్రాజెక్టు ను రద్దు చేసి శరణార్థులకు సరైన పునరావాసం కల్పించాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేశారు. దండకారణ్య నుండి శరణార్థులను పశ్చిమ బెంగాల్ కి తరలి వెళ్లేలా ప్రోత్సహించారు. ఇదేదో శరణార్థులపై మమకారంతో కాదు కమ్యూనిస్టులు చేసింది, అధికార పక్షాన్ని బలహీన పరిచి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి వెనుక ఉన్న పథకం. తాము అధికారంలోకి వచ్చాక అన్ని మీకు సమకూరుస్తాం అంటూ ఎర చూపిన కమ్యూనిస్టుల వైపు లక్షలాది శరణార్థులు ఆకర్షితులయ్యారు.

దండకారణ్యంలో ఉన్న శరణార్థులకు అండగా ఉంటానని ప్రకటించాడు కమ్యూనిస్టు నాయకుడు జ్యోతి బసు. దీనిపై అప్పటి ప్రధాని నెహ్రూకి లేఖ రాస్తూ సుందర్బన్ పరిసరాల్లో ఉన్న దీవులను శరణార్థులకు కేటాయించాలని డిమాండ్ చేసారు జ్యోతి బసు. కామ్రేడ్ లను దండకారణ్యానికి పంపి అక్కడ ఉన్న శరణార్థులను రెచ్చగొట్టి పశ్చిమ బెంగాల్ వైపు వారిని మళ్లించే ప్రయత్నం చేసారు.

 దండకారణ్యం నుండి బెంగాల్ కు 

1970 ప్రాంతంలో శరణార్థులు దండకారణ్యం వదిలి పెట్టి పశ్చిమ బెంగాల్ కి తిరిగి వెళ్లడం మొదలు పెట్టారు. అలా అక్రమంగా వలసలు వెళ్తున్న వారిని దారిలోని, రైల్వే స్టేషన్లలో ప్రభుత్వం అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. కానీ చాలా మంది పోలీసుల కన్ను గప్పి పశ్చిమ బెంగాల్ కి చేరుకున్నారు. 1977 లో పశ్చిమ బెంగాల్ లో వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చాక శరణార్థులు పశ్చిమ బెంగాల్ లోని వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడానికి తమ ప్రయత్నాలు ఉధృతం చేసారు. సుందర్బన్ చుట్టూ ఉన్న దీవులలో స్థిరనివాసం ఏర్పరుచుకోడానికి ఉద్బస్తూ ఉన్నాయాంషీల్ సమితి (శరణార్థుల సంక్షేమ కమిటి) నాయకులు తగు ప్రదేశం గురించి శోధిస్తూ చివరకు మరిచ్ఛపి ప్రాంతాన్ని తమ నివాస స్థానంగా నిర్ణయానికి వచ్చారు.

1978 మధ్య కాలం వరకు దండకారణ్యం, ఇతర ప్రాంతాల నుండి సుమారు లక్షన్నరకు పైగా శరణార్థులు బెంగాల్ కి వలస దారి పట్టారు. వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశ పడ్డారు. పునరావాసానికి ఇక డోకా లేదని భావించారు. కోల్ కతా సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాలను ఆక్రమించారు కానీ దుర్భర పరిస్థితుల్లో జీవనం ప్రారంభించారు. కమ్యూనిస్టు ప్రభుత్వం తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, భూమి పట్టాలు ఇస్తుందని ఆశతో ఎదురుచూసారు. వందల సంఖ్యలో శరణార్థులు 1978 ప్రారంభంలోనే మరిచ్ఛపి కి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడే ప్రయత్నం చేసారు. ఆ దీవిలో చెత్త చదారం, ఇబ్బడిముబ్బడిగా ఉన్న చెట్లు చేమలను తొలగించుకుని, సరిహద్దు కంచె వేసుకొని గుడిసెలను నిర్మించుకుని, జల వనరులను అభివృద్ధి చేసుకుని అక్కడి అడవులను నివాసయోగ్యంగా మార్చుకున్నారు. ఈ అభివృద్ధిని చూసి మిగిలిన వారికి కూడా ఈ విషయం పాకడంతో వేలాదిగా శరణార్థులు అక్కడ నివాసం ఏర్పరుచుకోడానికి తరలి వెళ్ళడం మొదలుపెట్టారు. 1978 జూన్ కి ఆ ప్రాంతంలో దాదాపు 30,000 మంది నివాసం ఏర్పరుచుకున్నారు. జీవనోపాధికి బీడీ తయారీ, వండ్రంగి పని, బేకరి, అల్లిక వస్తువుల తయారీ వంటి చిరు వ్యాపారాలు ప్రారంభించారు. చిన్న పాఠశాలను కూడా తెరిచారు. సహకార పద్ధతిలో చేపల వ్యాపారం, చిన్నపాటి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. చుట్టూ ఉండే నదీ జలాల వరద  ముప్పు లేకుండా సుమారు 250 కిలోమీటర్ల మేర రక్షణ వలయాన్ని నిర్మించుకున్నారు.

ఇలా మరిచ్ఛపి ఒక పెద్ద నివాస ప్రాంతంగా స్వయం సమృద్ధి సాధించేలా మారిపోయింది. చేపల వేట ప్రధాన వృత్తి అయింది. మగవారంతా చేపలను చుట్టుపక్కల ఉన్న కుమిర్మరి దీవుల్లో అమ్ముకునే వారు. మహిళలు చిన్న పాటి అల్లికలతో దుస్తులను తయారు చేసి అమ్మే వారు. మరిచ్ఛపి బ్రెడ్, కప్ కేక్ లు చాల ప్రాశస్త్యం పొందాయి. స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు స్కూల్లో పాఠాలు చెప్పే వారు. రహదారులు నిర్మించుకున్నారు. డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అనేక కష్టనష్టాలకు ఓడ్చి తమ జీవితాలను చక్కదిద్దుకునే పనిలో పడ్డారు బెంగాలీ హిందు శరణార్థులు

నమ్మక ద్రోహం:

అసలు కథ ఇప్పుడు ప్రారంభమైంది. మృత్యు ఘంటికలు వారికి వినబడకుండానే మ్రోగించింది కమ్యూనిస్టుల ప్రభుత్వం. శరణార్థులంతా తమకు తాముగా ఒక కొత్త జీవితాన్ని గడపడానికి పూర్తిగా నిమగ్నమై స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న తరుణంలో కమ్యూనిస్టుల విధానం ఒక్క సారిగా మార్చుకున్నారు. తూర్పు పాకిస్తాన్ నుండి శరణార్థులుగా వచ్చి దండకారణ్యంలో స్థావరాలు ఏర్పరుచుకున్నపుడే వారి సానుభూతిని కొల్లగొట్టిన కమ్యూనిస్టులు తమ విధానాలను ఇపుడు వెనక్కి మలుపు తిప్పారు. అధికారంలోకి రాకముందు ఒక మాట అయితే అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పొరుగు దేశం నుండి వచ్చిన శరణార్థులకు పశ్చిమ బెంగాల్ లో చోటు లేదని ప్రకటించడంతో అప్పటికే స్థిర నివాసం ఏర్పరుచుకున్న శరణార్థులకుపెద్ద  పిడుగు పాటు పడినట్లయింది.  దండకారణ్యం, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న విదేశీ శరణార్థులు వెంటనే వారు ఎక్కడి నుండి వచ్చారో (బంగ్లాదేశ్) అక్కడికి వెనుదిరగాల్సిందే అని హుకుం జారీ చేశారు. కమ్యూనిస్టు పాలకులు పోలీసులతో పాటు వారి క్యాడర్ ను కూడా  రంగంలోకి దింపారు. కండకావరాన్ని ప్రదర్శించారు.  శరణార్థులను వెనక్కి పంపడానికి తమ బలాన్ని ప్రయోగించారు. వీరి ధాటిని తప్పించుకోడానికి శరణార్థులంతా పరుగులు తీశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు, బస్సులు వీరితో కిక్కిరిసి పోయాయి. వెళ్ళడానికి నిరాకరించిన వారిని విపరీతంగా వేధించడం మొదలు పెట్టారు కమ్యూనిస్టులు. భయపెట్టారు. ముఖ్యమైన పత్రాలను తగలబెట్టారు. ఆస్తులను ధ్వంసం చేసారు. రౌడీ మూకలు దోపిడీలకు, దొంగతనాలకు ఎగబడ్డారు. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి మరీ ఇప్పుడు ఇంత ఘోరంగా ప్రవర్తించిన కమ్యూనిస్టు పాలకులను చూసి దిగ్భ్రాంతి చెందారు వేలాది శరణార్థులు.

ఊచకోతకు ఏర్పాట్లు:

1978 డిసెంబర్ చివరిలో పోలీసులు, సిపిఎం కార్యకర్తలు మరిచ్ఛపి లోకి ప్రవేశించారు. అక్కడ నివాసం ఏర్పరుచుకున్న వారిని ఖాళీ చేయించే పని ప్రారంభించారు. ఉద్రిక్తతలు తలెత్తాయి. దండకారణ్యం నుండి వచ్చిన శరణార్థులంతా వెనక్కి వెళ్లిపోవాలని మెడలపై కత్తులు పెట్టేలా హుకుం జారీ చేశారు. సిపిఎం మనుషులు చుట్టుపక్కల దీవులకు వెళ్లి మరిచ్ఛపి ప్రాంతం వారితో ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరిపిన సహించేది లేదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

దీనితో పాటు సిపిఎం క్యాడర్ మరో దుష్ప్రచారం ప్రారంభించారు. ఈ శరణార్థులు కరుడుగట్టిన హిందువాదులని, వీరిని ఇక్కడ ఉంచితే ముస్లింలపై ఆధిపత్యం చెలాయిస్తారని వ్యాపింపజేసింది సిపిఎం క్యాడర్.  బాహ్య శక్తుల డబ్బుతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నశరణార్థులు  అక్రమంగా ఆయుధాల తయారు చేస్తున్నారని ఆరోపణలు కుడా చేస్తూ దుష్ప్రచారానికి దిగింది సిపిఎం. భారత్ పై తిరుగుబాటు చేయడానికి వ్యూహరచన చేస్తున్నారంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఇప్పుడు కుడా ఈ దుష్ప్రచారాన్ని ఆపలేదు. తప్పుడు ఆరోపణలతో మరిచ్చపి శరణార్థుల ను పూర్తిగా ఇరికించి వారిని దోషులుగా ఉంచే ప్రయత్నం చేసింది వామపక్ష ప్రభుత్వం. తీవ్ర ఆవేదనాభరితపరిస్థుతుల మధ్య ప్రాణాన్ని అరచేతిలో పట్టుకుని తూర్పు పాకిస్తాన్ నుండి వలస వస్తే వారి పట్ల మానవీయ దృక్పథం కూడా లేకుండా వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆంక్షల దిగ్బంధంలో మరిచ్చపి:

కమ్యూనిస్ట్ పాలకుల ఆదేశాలకు మరిచ్చపి శరణార్థులు తల వంచక పోవడం తో అసలు వేధింపులు ప్రారంభించింది సిపిఎం. దీవుల చుట్టూ మోటార్ పడవలతో గస్తీ తిరుగుతూ శరణార్థి నివాసులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించారు. ఏకంగా పోలీస్ బోట్లలో సిపిఎం కార్యకర్తలు కూడా చేరి చేపలు పట్టడానికి వచ్చే వారి నుండి బలవంతంగా ఆ సరుకును లాక్కొంటు అరాచకాలు సృష్టించారు. దీవుల్లోకి వెళ్లి నివాసం ఉన్న వారి ఆస్తులను, ఆదాయ వనరులను విచ్చిన్నం చేస్తూ భయాందోళనలు కలిగించారు. అయితే అప్పటికీ అక్కడున్న శరణార్థుల నుండి స్పందన లేకేపోతే ఆ దీవులపై ఆంక్షలు విధించి ఆర్ధిక దిగ్బంధం చేసే వరకు వెళ్ళారు.పొరుగున ఉన్న కుమిర్మరి దీవుల నుండి ఎటువంటి వస్తువులు సరుకులు కుడా తెచ్చుకోలేని విధంగా ఆంక్షలు తీవ్రతరం చేసి అమానవీయంగా వ్యవహరించారు సిపిఎం కాడర్. బతుకులు చ్ఛిద్రం చేసేవరకు అరాచకాలు సాగాయి. ఇతర దీవుల నుండి రాకపోకలు కూడా లేకుండా దారులు బంద్ చేసారు.

ఈ దయనీయ పరిస్థితిలో కొన్ని సార్లు శరణార్థులు ఎదురు తిరగడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. గోప్యంగా వేరే దీవులకు వెళ్లి కావలసిన సరుకులు తేచుకోవడం కొంతకాలం జరిగినా ఆ పరిస్థితి కూడా దిగ్బంధం అయిపొయింది. ఇక గతి లేక చివరకు  గడ్డిని వారి పిల్లలకు కుడా ఆహారంగా పెట్టిన ఘోర పరిస్థితులు తలెత్తాయి. చిన్న పిల్లలతో సహా వృద్ధులు కుడా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొన్న దుస్థితి దాపురించింది. కేడెర్ కన్ను గప్పి పక్కనున్న దీవులకు వెళ్ళిన సుమారు 20 మందిని బయటకు వెళ్తే ఆ విషయం తెలుసుకుని పోలీసులు, సిపిఎం కార్యకర్తలు వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. 1979 జనవరి 29 వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన నిజంగా శరణార్థులకు కాళరాత్రిగా నిలిచిపోయింది. చావు బతుకుల్లో గడుపుతున్న చిన్నపిల్లలు పెద్దల కోసం ఆహరం తీసుకెళ్ళడానికి కుమిర్మరి దీవికి వెళ్ళడమే పెద్ద శాపం అయిపొయింది. ఇదే అక్కడ చోటు చేసుకున్న మొదటి ఉచకోత.

ఆ మృతదేహాలను పోలీసులు కుమిర్మరి-మరిచ్చపి మధ్య మొసళ్ళతో ఉన్న కోరంఖలి నదిలో పడేసిన అమానుష ఘటన అది. గాయపడ్డ వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. జనవరి ౩౦ వ తేదీ మధ్యాహ్నం మరిచ్చపి వాసులకు ఈ వార్త తెలిసి ఒక్క సారిగా హతాశులయ్యారు. ఆందోళన పెరిగిపోయింది. దిగ్బంధాన్ని, ఆంక్షలను ఉల్లంఘించాలని శరణార్థులు ఒక సమావేశం పెట్టుకుని సంకల్పించారు. మహిళలను పోలీసులు ఏమనరని అనుకుని వారినే ముందు కుమిర్మరి దీవికి పడవలపై పంపారు. 16మంది మహిళలు వేరే దీవికి బయల్దేరారు.

 జనసంహారం :

అయితే వారి కదలికలను పసిగట్టిన పోలీసులు వారిని ఆగమని హెచ్చరించి, వారి బోట్ల వైపు దూసుకుపోయారు. బలంగా ఢీ కొట్టడంతో ఆ దాడికి ఒక్క సారిగా మహిళలంత నదిలో దూకవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి  నుండి వేరే దీవికి పరారయ్యే ప్రయత్నం చేసారు. వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు మహిళలు మృతి చెందారు.  ఇదంతా జనవరి 31, 1979 చోటుచేసుకుంది. తప్పించుకున్న వారిని వెతికి వేటాడి గుర్తించి వారి పట్ల అమానుషంగా పోలీసులు వ్యవహరించారు. సిపిఎం మూకలు ఆ దీవులలోకి ప్రవేశించి తప్పించుకునే ప్రయత్నం చేసిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరిచ్చపిలో పోలీసుల విధ్వంస కాండ ప్రారంభమైంది.  ఆ మర్నాడు ఫిబ్రవరి ఒకటో తేదీన మరిచ్చపి లో సరస్వతి పూజ చేసుకోడానికి ముందు రోజు ఏర్పాట్లు చేసుకుంటున్న చిన్న పిల్లలను భయ కంపితులను చేసారు పోలీసులు. ఆ పిల్లలు అక్కడే ఉన్న స్కూల్ లోకి పరుగులు తీసి తలదాచుకునే ప్రయత్నం చేసారు. వారిని పోలీసులు బయటకు తీసుకొచ్చి సుమారు 15 మందిని పిల్లలని కుడా చూడకుండా అతి అమానుషంగా వ్యవహిరించారు. మరిచ్చపి తుపాకుల మోతలతో మారుమోగిపోయింది. అక్కడ పూజ కోసం సిద్ధం అవుతున్న సరస్వతి దేవి విగ్రహం, పూజ సామగ్రిని ధ్వంసం చేసారు పోలీసులు, కేడెర్.  ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహిళలు, పిల్లలతో సహా సుమారు 1,700 మంది అతి దారుణంగా చంపివేయబడ్డారు. ఈ దారుణ మారణ కాండకు దీవులన్ని తల్లడిల్లిపోయాయి. ఆ మరణ హోమం నుండి కొందరు శరణార్థులు గాయాలతో తప్పించుకుని రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు పరుగులు తీసారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాకు వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగించడం మొదలుపెట్టారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు శరణార్ధులను ఆదుకుంటామని హామీలు కురిపించిన వామపక్షాలు అధికారంలోకి వచ్చాక ఎందుకు యు టర్న్ తీసుకున్నాయి? ఎందుకు అంత దారుణంగా శరణార్థుల పట్ల వ్యవహరించాయి? అన్న దానికి సమాధానం ఇప్పటికీ లేదు. కేవలం వారంతా హిందువులు కావడంతోనే కక్ష తో ఇలా వ్యవహరించారా అనే చర్చ కూడా జరిగింది. చెల్లాచెదురైన ఆ శరణార్థుల బతుకులు ఎక్కడ ఎలా సాగుతున్నాయో కూడా చాల కాలం వరకు తెలియని పరిస్థితి. ఇదీ అప్పటి కమ్యునిస్టుల అరాచక పాలనకు పరాకాష్ట.

ఆంగ్ల మూలం :  Jaideep Mazumdar

తెలుగు అనువాదం : శ్రీ మురళి, విజయవాడ.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.