ArticlesNews

భక్త కవయిత్రుల్లో విశిష్టమూర్తి అక్కమహాదేవి

215views

‘నా భర్త చెన్నమల్లికార్జునుడు తప్ప తక్కిన పురుషులంతా కరిగే ఇంద్రధనుస్సు రంగులే కదా’ అంటుందామె. గోదాదేవి శ్రీరంగనాథుణ్ని, మీరాబాయి శ్రీకృష్ణుణ్ని ధ్యానించినట్లు కన్నడ సన్యాసిని అక్కమహాదేవి చెన్నమల్లికార్జునుడి ధ్యానంలో జీవితాన్ని ధన్యం చేసుకుంది.

కర్ణాటకలో సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన వీరశైవ ప్రవక్త బసవేశ్వరుడు అవతరించిన కాలం 12వ శతాబ్దం. బసవన్న వచనాల్లాగే అక్కమహాదేవి వచనాలకూ కన్నడ సాహిత్యంలో మంచి గుర్తింపు ఉంది. పుట్టి పెరిగింది కన్నడరాజ్యంలోనైనా అక్కమ్మ శివైక్యం చెందింది ఆంధ్రదేశంలోని శ్రీశైల క్షేత్రంలో. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ఉడుతడి గ్రామంలో శివభక్తులైన నిర్మల, సుమతి దంపతులకు చాలాకాలం సంతానం కలగకపోవడంతో పార్వతీదేవిని ఆరాధించగా అక్కమ్మ పుట్టిందని చెబుతారు. అక్కమహాదేవికి శిక్షాగురువు గురులింగదేవుడనీ, దీక్షాగురువు మరుళసిద్ధుడనీ తెలుస్తోంది.

తల్లిదండ్రులవల్ల లభించిన సంస్కారం, గురువువల్ల కలిగిన జ్ఞానం ఆమెను బాల్యంలోనే చింతనాపరురాలిని చేశాయి. సహజ సౌందర్యవతి అయిన దేవిని ఉడుతడి పాలకుడు చూసి వివాహం చేసుకున్నాడు. తన శివపూజకు, మహేశ్వర గోష్ఠికి, గురుపాద సేవకు ఆటంకం కలిగించకూడదని మహాదేవి విధించిన షరతులకు రాజు మొదట అంగీకరించినా తరవాత ఆ నియమాలను గౌరవించకపోవడంతో ఆమె రాజభవనాన్ని విడిచిపెట్టింది. ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని వెతుక్కుంటూ శ్రీశైలం బయలుదేరింది. మార్గమధ్యంలో కల్యాణి నగరంలో ఆగింది. అక్కమహాదేవి జీవితంలోని గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలకు ఆ పట్టణం వేదికైంది. అక్కడి అనుభవ మంటపం వీరశైవ ధార్మిక సామాజిక చర్చావేదిక. కిన్నెర బొమ్మయ్య, అనుభవ మంటపం అధ్యక్షుడు అల్లమ ప్రభువూ భక్తురాలిగా ఆమె యోగ్యతలను పరీక్షిస్తారు. శివశరణుల సాన్నిధ్యంలో అక్కమహాదేవి యోగసాధనను సాగించింది. కల్యాణమే కైలాసమని ఒక వచనంలో చెప్పింది.

అక్కమహాదేవి ఒంటరిగా ఆకలిదప్పుల బాధల్ని భరిస్తూ శ్రీశైలానికి ప్రయాణించింది. నిండు యవ్వనంలో రాజైశ్వర్యాన్నీ, తల్లిదండ్రుల ప్రేమనూ వదులుకుని పరమేశ్వరుడే తన పతి అని నమ్మింది. అతణ్ని పొందడానికి ఆమె చేసిన ఐహిక సుఖాల త్యాగం, సమర్పణ భావం, యోగసాధన అసాధారణమైనవి.

కన్నడ సాహిత్యంలో మొదటి కవయిత్రిగా గుర్తింపు పొందిన అక్కమహాదేవి వచనాలు 342 లభ్యమయ్యాయి. అవి వైవిధ్యంతో తాత్విక చింతనతో నాటి సామాజిక వ్యవస్థను ధిక్కరించేవిగా, భక్తి జ్ఞానాలను ప్రబోధించేవిగా ఉంటాయి. 67 త్రిపదులున్న యోగాంగ త్రివిధిని, మరికొన్ని పాటల్ని ఆమె రచించింది. త్రివిధిలో తాను సాధించిన శివయోగాంగాలను వివరించింది. జీవుడికి, శివుడికి గల సంయోగమే శివయోగం. తొమ్మిది రంధ్రాలు కలిగిన ఈ దేహంలో ఆత్మజ్యోతి అనే ముత్యం ఉంది.. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానమని ఆమె ప్రవచనం. ‘దేవుడొక్కడే. నిజలింగాన్ని నమ్మి శుద్ధుడవు కమ్మని’ ఆమె సందేశం. అక్కమహాదేవి వచనాల్లో మధురభక్తి భావమూ గోచరిస్తుంది. దేశంలోని శివభక్తుల్లో, భక్త కవయిత్రుల్లో అక్కమ్మ ఒక విశిష్టమూర్తి.