
శ్రీశైలం పవిత్రతను ధర్మకర్తల మండలి కాపాడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీశైలంలో చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విలేకరులతో మాట్లాడుతూ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసినది శ్రీశైల క్షేత్రం అని అన్నారు. ఉమ్మడి కడప జిల్లాల్లో ఒక ఎన్‌జీవోను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించిన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షుడిగా ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపారు.
చెంచులకు అంకితం
తనకు వచ్చిన ధర్మకర్తల మండలి అధ్యక్షుడి పదవిని చెంచులకు అంకితం చేస్తానని శ్రీశైలం ధర్మకర్తల మండలి కొత్త చైర్మన్ రమేష్‌నాయుడు అన్నారు. దేవస్థానం తరుపున చెంచులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సామాన్య భక్తులకు కూడా స్పర్శదర్శనం కలిగేలా కృషి చేస్తామన్నారు. తనను చైర్మన్‌గా ఎన్నిక చేసిన సీఎం నారా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్వామి, అమ్మవార్లకు పూజలు
శ్రీశైల దేవస్థానంలో ముందుగా అర్చకులు స్వామి, అమ్మవార్లకు పూజలు చేయగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా రమే్‌షనాయుడు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు రమణ, బి.రమణమ్మ, జి.లక్ష్మిశ్వరి, కె.కాంతివర్ధిని, ఎస్.పిచ్చయ్య, దేవకీ వెంకటేశ్వర్లు, జె.రేఖాగౌడ్, ఎ.అనిల్‌కుమార్, డి.వెంకటేశ్వర్లు, బి.వెంకటసుబ్బారావు, సి.హెచ్.కాశీనాధ్, యం.మురళీధర్, యు.సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ, జి.శ్రీదేవితో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన పలువురు సభ్యులు కూడా ఈకార్యక్రమానికి హాజరయ్యారు. సభ్యులందరికీ వేద ఆశీర్వచనాలతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, చిత్రపటాన్ని ఈవో శ్రీనివాసరావు అందజేశారు.





