
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది.
నాలుగు విభాగాల్లో..
పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు.
ఎంచుకోవాల్సిన అంశాలు
వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్‌గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు.
నమోదు విధానం
ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్‌మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్‌లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.





