
విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. దిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గూగుల్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్‌ప్రెసిడెంట్ బికాస్ కోలీ, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వాల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.

ఇరు పక్షాలూ దీన్ని శుభ, సంతోషకర దినంగా అభివర్ణించాయి. వికసిత భారత్ లక్ష్యసాధనలో ఇదో మైలురాయి అని ప్రకటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకున్నారు.
ఏఐతోపాటు డిజిటల్ మౌలిక వసతులు
ప్రస్తుతం ఒక గిగావాట్ సామర్థ్యంతో ప్రారంభమయ్యే ఈ ఏఐ హబ్ భవిష్యత్తులో బహుళ గిగావాట్లకు విస్తరిస్తుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. ఈ హబ్ ద్వారా ఏఐ టెక్నాలజీతోపాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించబోతున్నట్లు చెప్పారు. ఇందులో టెన్సర్స్ ప్రాసెసింగ్ యూనిట్లను వాడతామని, అవి ఏఐ ప్రాసెసింగ్‌కు మరింత బలం చేకూరుస్తాయని ప్రకటించారు. ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారితే, ఇప్పుడు విశాఖపట్నం ఏఐ హబ్‌గా తయారుకావడం సంతోషకరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాడు మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే, ఇప్పుడు గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయాన్ని రూ.87,250 కోట్లు (10 బిలియన్ డాలర్లు)గా ప్రకటించినప్పటికీ, దీన్ని 15 బిలియన్ డాలర్లకు తీసుకెళ్తామని ఆ సంస్థ సీఈఓ కురియన్ ప్రకటించినందున వచ్చే ఐదేళ్లలో దీని పెట్టుబడి సామర్థ్యం మరో రూ.43,760 కోట్ల మేర పెరిగి మొత్తంగా రూ.1,31,280 కోట్లకు చేరనుంది. అంతేకాదు దీని ద్వారా విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియాతోపాటు మొత్తం 12 దేశాలతో సబ్‌సీ కేబుల్ అనుసంధానం కానుంది. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా అందించే అన్ని రకాల ఉత్పత్తులను ఈ హబ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. సంవత్సరం క్రితం రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లి గూగుల్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాజెక్టు ఆలోచనల్లోకి వచ్చింది. 13 నెలల్లో అది సాకారమైంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
డైనమిక్ నగరం విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్‌ను ప్రారంభిస్తుండటం సంతోషం కలిగిస్తోంది. ఇదో బహుముఖ పెట్టుబడి. ఇందులో వికసిత భారత్ నిర్మించాలన్న మన కలను సాకారం చేసే ఒక గిగావాట్ సామర్థ్యమున్న డేటా సెంటర్ ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించే శక్తిమంతమైన బలం ఇది. దీని ద్వారా కృత్రిమమేధతో కూడిన అత్యాధునిక పరికరాలు ప్రజలకు అందుతాయి. ఇది మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు, ప్రపంచ సాంకేతిక లీడర్‌గా భారత్ స్థానాన్ని మరింత పటిష్ఠపరుస్తుంది.
-‘ఎక్స్’లో ప్రధాని మోదీ
ఏఐతో దేశాభివృద్ధికి ఊతమిచ్చే వేదిక
గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏఐ హబ్‌కు సంబంధించిన మా ప్రణాళికలు, చరిత్రాత్మక పరిణామం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతోపాటు, సరికొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ స్థాయి మౌలిక వసతులతో కలిపి ఈ హబ్ ఏర్పాటవుతోంది. దీని ద్వారా పరిశ్రమలతోపాటు, పారిశ్రామికవేత్తలు, దేశంలోని వినియోగదారులకు అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. దీనివల్ల ఏఐ ఇన్నోవేషన్ మరింత వేగం పుంజుకొని, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో వృద్ధికి ఊతమిస్తుంది.
-‘ఎక్స్’లో గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్
దేశ సాంకేతిక ప్రస్థానంలో గొప్ప మైలురాయి
ఇది నిజంగా చరిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్‌తోపాటు భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో గొప్ప మైలురాయి. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందంతో భారత్‌లో తొలి ఏఐ నగర నిర్మాణానికి పునాదిపడింది. అమెరికా బయట తొలి అతి పెద్ద ఏఐ, డేటా హబ్‌గా ఇది అవతరిస్తుంది. దీనికితోడు గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌గా విశాఖపట్నం మారుతోంది. ఇది కేవలం గూగుల్ ప్రాజెక్ట్ కాదు. ఇక నుంచి మా ప్రాజెక్టు కూడా. భారత ఏఐ ప్రస్థానం ప్రారంభమైంది. దానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుంది.
-ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఐటీ విప్లవకర్తగా చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు
ఈనాడు, దిల్లీ: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు క్రెడిట్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు దక్కుతుంది. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ ఎంతో శ్రమపడి ఈ భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చారు. కేంద్రం గొప్ప సహకారం అందించింది. 15 బిలియన్ల భారీ పెట్టుబడి భారత్‌కు, అందులో ఏపీకి, అందునా విశాఖకు రావడంపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తేవడంతో పాటు విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌ను రప్పించి తాను ఐటీ విప్లవకర్తగా చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఇకపై రాష్ట్రాన్ని చూసే దృక్కోణం మారిపోతుంది. ఈ ప్రాజెక్టుతో భారత్ గ్లోబల్ సౌత్ లీడర్‌గా అవతరిస్తుంది.
-కె.రామ్మోహన్‌నాయుడు, కేంద్ర మంత్రి
లోకేశ్ శ్రమ ఫలితమే ఈ ప్రాజెక్టు
రాష్ట్రాన్ని ఉద్యోగాల కల్పన కేంద్రంగా చేయడంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ల మాదిరిగా రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయడానికి బదులు.. కొత్త అవకాశాలను ముందుగా అందిపుచ్చుకొని ఏపీని ఏఐ హబ్‌గా తయారుచేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మంత్రి లోకేశ్ ఏడాదిగా పడ్డ శ్రమకు ప్రతిఫలం తాజా ఒప్పందం. ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్‌ల సహకారం బాగుంది. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టం నిర్మితమై ఎన్నో ఉద్యోగాలు వస్తాయి.
-పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి
చిరస్మరణీయమైన మైలురాయి
‘విశాఖపట్నం నుంచి వికసిత్ భారత్ దిశగా మార్గం సిద్ధమవుతోంది. ఆ నగరంలో 15 బిలియన్ డాలర్ల విలువైన గూగుల్ ఏఐ డేటా సెంటర్, దేశంలోనే తొలి ఏఐ సిటీ సాధ]న చిరస్మరణీయమైన మైలురాళ్లు. యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, వ్యాపారవేత్తలు, మహిళలు, విద్యార్థుల జీవితాలను ఇది సమూలంగా మారుస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీపై పారిశ్రామికవేత్తలకు ఉన్న విశ్వాసానికి ఫలితమే ఈ ఒప్పందం. చంద్రబాబు బ్రాండ్, ఆయన దూరదృష్టి, అనుభవానికి నిదర్శనం. దేశాన్ని ఏఐ హబ్‌గా మార్చేందుకు సమష్టిగా స్పందించాల్సిన సమయం ఇది’ అని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.
-ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
# గూగుల్ కమ్స్ టు ఏపీ
ఈనాడు, అమరావతి: గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా నిలిచింది. వివిధ వేదికలపై అధిక స్పందనలు సాధించింది. ‘గూగుల్ కమ్స్ టు ఏపీ’ అనే ట్యాగ్ మంగళవారం ‘ఎక్స్’లో ప్రథమస్థానంలో నిలిచింది.
వికసిత్ భారత్ లక్ష్యసాధనకు దోహదం:గవర్నర్ అబ్దుల్ నజీర్
15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం.. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ వేసిన గొప్ప ముందడుగు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ). దేశవ్యాప్తంగా ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతంగా చేసేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఇంతటి అసాధారణ విజయాన్ని సాధించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బృందానికి హృదయపూర్వక అభినందనలు.
దేశ సాంకేతిక శక్తిగా ఏపీ: ఎమ్మెల్యే బాలకృష్ణ
విశాఖకు గూగుల్ క్లౌడ్ రాకతో దేశ టెక్నాలజీ శక్తికి కేంద్రంగా ఆంధప్రదేశ్ నిలవనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, మంత్రి నారా లోకేశ్‌ల నిరంతర కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఇది కేవలం రాష్ట్రానికే కాదు. దేశానికి గర్వకారణమైన మైలురాయి. గూగుల్ క్లౌడ్‌తో ఆంధప్రదేశ్‌లో సాంకేతిక విప్లవం ప్రారంభమవుతుంది.





