ArticlesNews

సర్వప్రాణి ఆదరణే సర్వేశ్వరుని అర్చన

319views

క్కడ నిత్యం మూడు వెలుగుతుంటాయి. ఒకటి దేవుడి దగ్గర వెలిగే దీపం, రెండవది ధుని, మూడవది నిత్య అన్నసంతర్పణ కోసం వెలుగుతూ ఉండే కట్టెల పొయ్యి.

ఈ దృశ్యం నెల్లూరు సమీపంలోని పొదలకూరు రోడ్డులో గల వెంకయ్య స్వామి ఆశ్రమంలో మనకు కనిపిస్తుంది. “అన్ని జీవులలోనూ పరమాత్ముడు ఉన్నాడు కదయ్యా? అందరి ఆకలి ఒకటే కదయ్యా? ఆ ఆకలి తీర్చడమే మన పని గదయ్యా?” అని తరచూ చెబుతూ ఉంటారు ఆ ఆశ్రమ అధిపతి శ్రీ ఆనందయ్య స్వామి.

తెలుగు వాళ్లకు సాధారణమైన పంచెకట్టుతో, మామూలు హాఫ్ చొక్కాతో, ఒక సాధారణ రైతు లాగే కనిపిస్తాడాయన. కానీ ఆయన నిర్వహణలో జరుగుతున్న పనిని చూస్తే మాత్రం ఆయన అసామాన్యుడు అనిపించక మానదు. మామూలుగా ఆధ్యాత్మిక వేత్తల వేష భాషలలో కనిపించే పటాటోపం ఆయనలో ఏమాత్రం కనిపించదు. మడి, మునక్కాయ అసలే ఉండవ్. నిత్యం అనేక సమస్యలతో ఆయన దగ్గరకు వచ్చే భక్తులు మాత్రం ఆయన బోధలతో స్వాంతన పొందుతూ ఉంటారు.

శ్రీ ఆనందయ్య స్వామి

“అక్కడ వెలిగేవి మూడూ దీపాలే నాయనా” అంటారు ఆనందయ్య స్వామి. మొదటిది పొయ్యి. మన ఆకలిని తీర్చి, మనల్ని స్థిమిత పరచి, ఒక్కసారైనా భగవంతుడిపై దృష్టి సారించేలా చేస్తుంది. రెండవది ధుని మన కర్మలను హరించి భగవంతుడి వైపు దారి చూపుతుంది. మూడవది దీపం మనలోని ఆత్మ జ్యోతిని ప్రకాశింపజేసి కోటి దీపాల కాంతులను వెదజల్లే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని మనకు చేరువ చేస్తుంది.” అంటారు.

సృష్టిలోని ఏ ఒక్క జీవీ ఆకలితో అలమటించ కూడదన్నదే ఆనందయ్య స్వామి పరమ లక్ష్యం. “ఎవరు ఏ సమయంలో ఆకలంటూ వచ్చినా వారికి లేదనకుండా వడ్డించాలి” అంటారు ఆనందయ్య స్వామి.

మాతో మాట్లాడుతూ ప్రతిరోజూ వందల వేల సంఖ్యలో కోతకు తరలిపోతున్న గోమాతల దుస్థితిని గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టారాయన.  గోమాత రక్షణ కోసం తమ ఆశ్రమం నిర్వహిస్తున్న గోశాలను ఆయనే స్వయంగా చూపించారు. “ఇక్కడ పాలిచ్చే ఆవులే కాదు నాయనా, ఒట్టిపోయిన ఆవులను కూడా సంరక్షిస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ ఆవులను కసాయి వారికి అమ్మరాదన్నదే మా లక్ష్యం.” అని వివరించారు శ్రీ ఆనందయ్య.

నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమం

అంతేకాదు వృద్ధులకు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వీధి బాలలను చేరదీసి వారికి మంచి సౌకర్యాలను, విద్యను అందించాలని కూడా ఆయన సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.

నెల్లూరు ప్రధాన నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పొదలకూరు రోడ్డులో ఓ మూడెకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ ఇప్పుడిప్పుడే ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తున్నారు శ్రీ ఆనందయ్య స్వామి. అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజూ 100 మంది వరకు కడుపు నింపుకుని వెళ్తారు. ఇక విశేషమైన రోజులలో అయితే కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతుందక్కడ.

“ప్రతి ఒక్కరూ తమ తోటి ప్రాణులకు సాయం చెయ్యాలయ్యా” అని చెప్పే ఆనందయ్య స్వామి “ఎవరైనా సరే చేసిన దానాన్ని వెంటనే మరచిపోవాలి, భగవత్ ధ్యానాన్ని మరువకుండా చెయ్యాలి (మరువ వలసినది దానము, మరువకూడనిది ధ్యానము)” అని చెబుతుంటారు.

వంటలు చేస్తున్న మహిళా భక్తులు

బాల్యంలో కొందరు పెద్దల సాహచర్యంతో తనలో ఆధ్యాత్మిక భావాలు మొలకెత్తాయని, అవగాహనా లేమి కారణంగా తాను మాత్రం లౌకిక జీవనం వైపే ఆసక్తి చూపానని ఆయన తెలిపారు.

అయినప్పటికీ ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు తెలియకుండానే తాను ధ్యానమగ్నుడను అవుతూ ఉండేవాడిననీ, అలా ఒకసారి తన బంగారు దుకాణంలో కూర్చుని ఉన్నప్పుడు “నీ కర్మ తీరిపోయింది. నువ్వు ఇక ఇతర ఐహిక విషయాలపై చింతను విడచి సర్వజీవులలోని ఆ పరమాత్ముని సేవపై దృష్టి నిలుపు” అన్న అశరీరవాణి వినిపించిందని, ఆ వెనువెంటనే తాను తన శేష జీవితాన్ని నారాయణ సేవకే అర్పించాలని నిశ్చయించుకొని ఈ మార్గంలోకి వచ్చానని ఆనందయ్య స్వామి తెలిపారు.

“అక్కడ కడతా ఉండే గుడిని చూద్దురుగాని రాండయ్యా” అని ఆయనే స్వయంగా మమ్మల్ని నిర్మాణంలో ఉన్న గుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన గదిలోంచి బయటికి రాగానే ఆ మూల, ఈ మూల ఉండిన కొన్ని కుక్కలు విచిత్రంగా తోక ఊపుకుంటూ ఆయన వెనకే నడవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ గురు పరంపరకు చెందిన 18 మంది గురువుల యొక్క మందిరాల నిర్మాణం ప్రారంభమై ఉంది.

నిర్మాణంలో ఉన్న గురువుల మందిరాలు

“ ఈ స్థలం కొనుగోలుకు, ఆశ్రమ, మందిరాల నిర్మాణానికి, నిరతాన్నదానానికి డబ్బులు ఎలా చేస్తున్నారు?” అని మేమడిగిన ప్రశ్నకు స్వామి చిరునవ్వు నవ్వుతూ “ఇదంతా ఆ నారాయణుని కృప గదయ్యా? మన దేముంది? మనం నిమిత్త మాత్రులమయ్యా. అంతా ఆయనే చూసుకోడంటయ్యా?” అన్నారు.

ఇంతలో ఆయన శిష్యులలో ఒకరు మాకు దగ్గరగా వచ్చారు. వెంటనే స్వామి “ మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. రండి మీకోసం ప్రసాదం సిద్ధంగా ఉంది.” అంటూ ముందుకు వెళ్లి పోయారు. వెనగ్గా మాతోపాటు నడుస్తూ వస్తున్న ఆయన శిష్యుడితో వీటన్నిటికీ డబ్బులు ఎలా? అది అడిగాను. “ఏముంది బాబూ ఈ స్థలానికి అడ్మాన్సు (అడ్వాన్సు) ఇచ్చినప్పుడు కూడా నాయన (శిష్యులు ఆయనను ఆప్యాయంగా ‘నాయన’ అని పిలుచుకుంటారు) దగ్గర ఎర్ర నయాపైసా కూడా లేదు. మేమే తలా కొంచెం పోగేసి టోకెన్ (బయానా) ఇచ్చాం. అప్పుడు కూడా ఆయన ఇలాగే అంతా ఆయనే చూసుకుంటాడు.” అన్నాడు. అన్నట్టే కొనడం అయింది, నిర్మాణాలు ప్రారంభించడమూ అయింది” అన్నాడు.

మేం లోపలికి వెళ్ళేటప్పటికి ఓ కుటుంబం ఆనందయ్య స్వామి ఎదురుగా కూర్చుని ఉంది. స్వామి ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నారు. కొన్ని నిముషాల అనంతరం కళ్ళు తెరిచిన స్వామితో “ నీ దయ వల్ల మాయామి(ఇల్లాలు) ఆరోగ్యం బాగయింది నాయనా.” అన్నాడు  ఆ కుటుంబ యజమాని. “ఇతర ప్రాణులపట్ల నీవెంత దయను చూపిస్తే ఆ సర్వేశ్వరుడు కూడా నీపై అంత దయను వర్షిస్తాడు. సర్వ ప్రాణులలోనూ భగవంతుడున్నాడని గుర్తించు. అన్నీ నీకే అవగాతమవుతాయ్.” అన్నారు స్వామి.

ఆశ్రమం యొక్క భవిష్యత్ కార్యక్రమాల ప్రణాళిక

ఇలా ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో బాధపడేవారు నిత్యం ఎందరో ఆ ఆశ్రమాన్ని దర్శించుకుంటారు. అందరికీ ఆయన తోటి ప్రాణులను ఆదరించమనే చెబుతారు. ఆనందయ్య స్వామి చెప్పిన దాన్ని ఆచరించిన వారికి ఆశ్చర్యకరంగా స్వాంతన లభిస్తోంది. వారి బాధల నుంచి మెల్లిమెల్లిగా విముక్తి లభిస్తోంది. స్వామి, వారి నుంచి ఏ విధమైన కానుకలనూ ఆశించకుండా వారికి సలహాలను ఇస్తారు.

“సర్వప్రాణి ఆదరణే సర్వేశ్వరుని అర్చన” అని బోధించే శ్రీ ఆనందయ్య స్వామి కేవలం ఒక ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు తన బోధనల ద్వారా, తన ఆచరణ ద్వారా భక్తులలో సంస్కారాలను నింపి సమాజంలోని ద్వేషాన్ని, అసూయను, స్వార్థాన్ని నిర్మూలించి ఈర్ష్యాసూయలు, వైషమ్యాలు లేని స్వచ్చమైన, నిర్మలమైన సమాజాన్ని నిర్మించగలిగిన ఒక సంఘ సంస్కర్త కూడా అనిపించింది మాకు. అక్కడి నుంచి నిష్క్రమిస్తూ ఉంటే “సేవాహి పరమో ధర్మః” అన్న పెద్దల వాక్కు గుర్తుకొచ్చింది.

“ఓం నారాయణ – ఆది నారాయణ”

రచన : శ్రీరాంసాగర్.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.