ArticlesNews

ఈ విలువల కోసమేనా వామపక్షాల ఉద్యమాలు?

602views

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించినా, జాతీయ పౌర పట్టికను స్వాగతించినా అది జాతీయ వాదమని, మతతత్త్వమని, హిందుత్వానికి కొమ్ముకాయడమేనని వామపక్ష నేతలు, వారి మద్దతుదారులంటున్నారు. ఈ దారిలోనే అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ నక్సల్స్ చెలరేగిపోతున్నారు. తెలుపును తెలుపు, నలుపును నలుపు అనడం నేరమంటే ఎట్లా? వాస్తవాల్ని, సత్యాన్ని, నిజాన్ని పేర్కొంటే అది సంకుచితత్వమంటే ఎలా? జాతీయవాదమని నిరసిస్తే ఎలా?
జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) కోసం ఎవరైనా మీ ఇంటికొస్తే బిల్లా రంగా అనో, మరో తప్పుడు పేరునో, తప్పుడు వివరాలు ఇవ్వమని వామపక్షాల తరపున మాట్లాడే అర్బన్ నక్సల్, రచయిత్రి అరంధతీ రాయ్ ఇటీవల చెప్పారు. వామపక్ష మేధావుల మేధ ఏ విధంగా పుష్పిస్తున్నదో ఈ ఒక్క సంఘటన తేటతెల్లం చేస్తోంది. అబద్ధాలు చెప్పమని, తప్పుడు సమాచారం నమోదు చేయమని ప్రజలకు పిలుపునివ్వడమంటే ఏ రకమైన విలువలు, ఏ రకమైన సంస్కృతిని మనం పాదుకొల్పుతున్నాం? ఇదా వామపక్షాల సంస్కృతి? ఈ విలువల కోసమా వారు ఉద్యమిస్తున్నది? ఇంత దిగజారుడుతనంతో ప్రజాజీవితంలో కొనసాగడమంటే సిగ్గుచేటు. నీతి-నిజాయితీతో సగర్వంగా తలెత్తుకుని జీవించాలని చాటిచెప్పాల్సినవారు ఇలా అసత్యాలు నమోదుచేయమని ప్రోత్సహించడం, అదో ఘనకార్యంగా తలపోయడం మతిలేని వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇది వారి మానసిక వైకల్యాన్ని తెలియచేయడం కొత్త సంవత్సరంలో, కొత్త దశాబ్దంలో సమాజం పూర్తిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో, సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లి ప్రజల ముంగిళ్ళలోకి సౌకర్యవంతమైన జీవనం రానున్న వేళ, ప్రపంచమంతటా డిజిటల్ ఎకానమీతో సరికొత్త వెలుగులు విరబూస్తున్న సమయాన వామపక్షాలు- వారి మద్దతుదారులు, తమనితాము గొప్ప మేధావులమనుకునే అరుంధతీ రాయ్ లాంటివాళ్లు ఇలా అనైతిక విలువలు, అనాగరిక పద్ధతులు అవలంబించమని బోధించడం ఎంతటి అన్యాయం? అమాయకులను రెచ్చగొట్టి వీధుల్లో విధ్వంసాలకు ప్రోత్సహించడం ఎంతటి అనాగరికం?
ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదారి పట్టించడం, అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వమని మీడియా ముందు పేర్కొనడం వారి డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ఆమెనే గాక ఆమె వెనకాలగల ‘ముఠా’ మొత్తం ఇదే ‘మానసిక స్థితి’లో కనిపిస్తోంది. గుడ్డిగా సిఏఏను వ్యితిరేకించడం తప్ప వీరికి మరో కార్యక్రమం లేకుండాపోయింది. మేధావులు, రచయితలు, ఎంతోకొంత లోకజ్ఞానం ఉన్నవారిగా భావించేవారి కుహనాతత్వం ప్రజలకు తెలిసొచ్చింది. వీరి మేధావితనం ఎటు కొట్టుకుపోతోంది? ఏ వెలుగుల వైపు పయనిస్తోంది? ప్రజలకు దీపధారిగా ఉండాల్సినవారు, లైట్‌హౌస్‌గా వెలుగొందాల్సినవారు, మారుతున్న సమాజంలో సామాన్యులకు సరైన మార్గదర్శనం చేయాల్సిన వారు ఇలా ప్రజల్ని అనైతిక పద్ధతులవైపు ప్రోత్సహించి, రెచ్చగొట్టి ఆందోళనల్లోకి లాగి తమ పబ్బం గడుపుకోవడం దారుణాతి దారుణం. ఇందులోకి హక్కుల సంఘాల వారిని, విదేశీ శక్తులను లాగేందుకు ప్రయత్నించడం నిజంగా దుర్మార్గమే! ఇది చట్టాలను, పార్లమెంట్‌ను అగౌరవ పరచడమే, ఇతరులకు తాకట్టుపెట్టే ప్రయత్నమే. ఇది ఎంతటి నీచమైన వ్యవహారం? ఇలాచేస్తే ఆ వాదం అంతర్జాతీయ స్థాయి పొందుతుందా? పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని సమర్ధిస్తే జాతీయవాదమవుతుందా? మతవాదమనిపించుకుంటుందా? ఈ వాదన ఎంత విడ్డూరం? ఎంతటి కుతర్కం!
దేశాన్ని, ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు సరైన అంశాన్ని ఎంపిక చేసుకోలేని దౌర్భాగ్యపుస్థితిలో ఉన్నవారు ఇలా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం నిందనీయం, అ న్యాయం. వారు చెబుతున్నదాంట్లో సంపూర్ణ సత్యం ఉంటే విదేశాల్లోని ప్రవాస భారతీయులు, ఇతరులు ఎం దుకు చట్టాన్ని సమర్ధిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తారు? అశేష ప్రజలు వౌనంగానైనా ఎందుకు మద్దతు పలుకుతారు? పాల పొంగులా వారి ఉద్యమం ఎందుకు సమసిపోయింది? అబద్ధాలతో అరుంధతీ రాయ్ లాంటివాళ్లు ఢిల్లీలో చలి కాచుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారు తప్ప, తమ ఉనికి ప్రదర్శించడానికి వీధుల్లోకొచ్చారు తప్ప ఇన్ని వారాల సమయం గడిచినా వారు వ్యక్తం చేసిన భయాందోళనల్లో పిసరంత ‘సత్యం’వెలికి తీయలేకపోయారు. దాంతో తప్పుడు సమాచారం నమోదు చేయండని సరికొత్త అబద్ధాలతో వామపక్షాలు బయలెల్లినాయి. వారి ఉద్యమం,ఆందోళన, వ్యాస పరంపర ఎంత అబద్ధమో, ఎంత అనాగరికమో అరుంధతీ రాయ్ పలుకులే చెబుతున్నాయి. ఇంతకన్నా ఇంకేమి సాక్ష్యం కావాలి? తమ డొల్లతనాన్ని తామే ఇలా తెలియజేసుకున్నారు. వారు మాట్లాడే నైతిక హక్కును పూర్తిగా కోల్పోయారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను ఈ మేధావులు, వామపక్ష నేతలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఇటీవలి ఆందోళనలు స్పష్టం చేశాయి. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకొకటి ఏముంటుంది? గాలిలో సమస్యలు సృష్టించగలమని వారు నిరూపించుకున్నారు. అబద్ధాలు చెప్పడమే జీవన విధానంగా మార్చుకుని ప్రజలు సైతం ఆ దారిలో పయనించమని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఈ దారిలో, ఈ పద్ధతిలో గొప్ప సమాజం ఆవిర్భవిస్తుందా? ఈ ‘‘పాలసీ’’తో పురోభివృద్ధిని సాధించగలమా?
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రపంచ దేశాలకు సైతం విదేశీ వ్యవహారాలశాఖ తెలియజేసింది. అపోహలకు తావివ్వరాదని, ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని ఆ శాఖ ప్రపంచ దేశాలకు తెలిపింది. మానవ హక్కులపై ఎక్కువగా స్పందించే అమెరికా తదితర దేశాల నుంచి ఎ లాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఐక్యరాజ్యసమితిలోని హక్కు ల సం స్థలు సైతం విమర్శించలేదు. వివక్షకు గురైన, దమనకాండకు బలైన పొరుగుదేశాల్లోని మైనార్టీలకు పౌరసత్వం కల్పించడమే సిఏఏ వౌలిక లక్ష్యమని, పార్లమెంట్ దీన్ని ఆమోదించిందన్న సమాచారం వివిధ దేశాల్లోని భారత రాయబారులు ఆయా దేశాలకు తెలిపారు. అంతర్జాతీయ మీడియా ద్వారా సమాచారం ప్రపంచ ప్రజలకు తెలిసింది. ఏ మానవ హక్కుల సంస్థలకు, సంఘాలకు అభ్యంతరం కనిపించలేదు. కేవలం భారతదేశ వామపక్షాలకే, అర్బన్ నక్సల్స్‌కే ఇందులో హక్కుల ఉల్లంఘన కనిపించడం చూస్తే వారి ‘దృక్కోణం’ ఎలాంటిదో, ఎంత లోపభూయిష్టమైనదో తెలుస్తోంది.
జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) సైతం ప్రమాదకరమైనదన్న ప్రచారం చేయడం చూస్తే- ఇంత మధ్యయుగాలనాటి మానసిక స్థితితో వారెలా పెరిగారా? అనిపిస్తుంది. ఎన్‌ఆర్‌సీ అనేది ఇవ్వాళ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ప్రతి పది సంవత్సరాలకొకసారి ఆ పట్టికను ‘అప్‌డేట్’చేయడం అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిన ప్రాథమిక పని. ఆ పని కూడా చేయొద్దు.. అందులో ఏదో ‘మతలబు’ఉందని మనసునిండా ‘విషం’ నింపుకుని మాట్లాడితే ఎలా? ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ ప్రజల పౌర పట్టికను రూపొందిస్తాయి. అలా రూపొందించకపోతే ఉద్యమించాల్సిందిపోయి, రూపొందిస్తే విధ్వంసాలకు తెగబడతామని హెచ్చరించడం, ఆస్తులను ధ్వంసం చేయడం చూస్తే అసలు వీరికి మెడమీద తలకాయ ఉందా? అన్న అనుమానం కలుగుతోంది.
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఎకానమీ ఇట్లా పరిపాలనలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ప్రవేశపెట్టాక ప్రపంచమంతటా ఇదే దారిలో పయనిస్తుండగా అందుకు అవసరమైన డేటాను సేకరించి, ఎక్కడ లోపాలున్నాయి? ఏయే సేవలు ప్రజలకు అందడం లేదు? ఏ రంగంలో ఎవరు వెనకంజలో ఉన్నారు? వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం ఎంతమంది ప్రజల ముంగిళ్ళకు చేరింది? అన్న సమాచారం ప్రోదిచేయడం పాపమన్నట్టు ప్రసంగాలు చేస్తూ, పుస్తకాలు, కరపత్రాలు ముద్రిస్తూ అజ్ఞానానందంతో మురిసిపోవడం చూస్తే వీరికి ప్రపంచం ఎటువైపు కదులుతుందోనన్న ఇంగితజ్ఞానం పిసరంత కూడా లేదనిపిస్తోంది. ప్రపంచం ‘దండకారణ్యం’ వైపు కదులుతోందని అరుంధతీ రాయ్ లాంటివారు భావించడం వారి అజ్ఞానానికి పరాకాష్ఠ.
అమెరికా సామ్రాజ్యవాద దేశమని తూలనాడినా పొ రుగు దేశమైన చైనా (కమ్యూనిస్టు-మావోయిస్టుల ఆరాధ్యదేశం)లో జరుగుతున్న పాలనా మార్పులను, ప్రజల సామాజిక-ఆర్థిక- సాంస్కృతిక అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలనైనా పట్టించుకోవాలి కదా? భారత్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా సాంకేతిక రంగంలో చైనా అభివృద్ధిని సాధించింది. దాదాపు ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందిన ఈ ఇరు దేశాల మధ్యగల అంతరాలను, వాటిని పూడ్చడానికి చేపడుతున్న చర్యలను గమనించకుండా, ఉత్పత్తిరంగానికి ప్రాధాన్యతనిచ్చి, జీడీపీని పెంచి ఆర్థికంగా ఉన్నతస్థాయికి ఎదిగిన చైనాను ఆదర్శంగా తీసుకోవలసింది మరిచి, ఉత్పత్తిని దెబ్బతీసే ఆందోళనలు, విధ్వంసాలు, ఉద్యమాలకు పాల్పడితే ఒరిగేది ఏమిటి? పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా చైనా ప్రవేశపెట్టి పనిచేస్తున్నదో ఈ అర్బన్ నక్సల్స్ ఊహకు కూడా అందదు. జాతీయ పౌర పట్టిక లేకుండానే చైనా అభివృద్ధిని సాధిస్తున్నదా? 21వ శతాబ్దంలో పౌర పట్టికకు పాతర వేయాలని ఏ దేశంలోనైనా డిమాండ్ వినిపిస్తోందా? భారత్‌లో తప్ప ఇంత అజ్ఞానం మూటగట్టుకుని, ఆ అజ్ఞానాన్ని ఇతరులకు బట్వాడాచేసేందుకు ఉత్సుకత ప్రదర్శించడం కేవలం అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ నక్సల్స్‌కే సాధ్యమవుతుంది. స్టార్టప్ సంస్థలు, సైన్స్ కాంగ్రెస్‌లు, ఉపగ్రహాలు, సైబర్ హైవేలు, డ్రోన్లు, రోబోలు, 5జి ఫోన్లు సహా నాల్గవ పారిశ్రామిక విప్లవ ఫలితాలపై దృష్టిసారించి వాటి ఫలితాలు సాధారణ ప్రజలకు ఎలాచేరవేయాలన్న అంశాన్ని పట్టించుకోకుండా, ఉద్యమిస్తే వర్తమానంలో నేరం గాక ఏమవుతుంది…?

-వుప్పల నరసింహం 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యంతో)

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.