
ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాధ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు . ఈ అమ్మవారు శ్రీచక్ర -అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి, -ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరకుగడను చేతపట్టుకొని, -మహాకామేశ్వరాంకయై, శ్రీలలితాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే -సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, శ్రీ అమ్మవారు మహాత్రిపురసుందరీదేవిగా పూజలందుకుంటున్నారు.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం
శరన్నవరాత్రులలో నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరీ నామంతో పిలుస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి అధిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు.
సచామర రమావాణీ
ఓ వైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీ దేవి వింజామరలు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరీ దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
శ్లోకం
“సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా” అంటూ అమ్మవారిని సేవిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఈ రోజు లలితా సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు.





