
యూపీలో ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 వ తేదీ లోపు ఉమీద్ పోర్టల్ లో వక్ఫ్ ఆస్తుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు అన్ని ముతవల్లి కమిటీలకు ఆదేశాలిచ్చింది. నిర్ణీత కాలపరిమితి లోపు వివరాలను అప్ లోడ్ చేయాలని, అలా చేయని కమిటీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
భారత ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి. ఈ సందర్భంలో, ఈ ప్రక్రియ పురోగతిని అంచనా వేయడానికి బోర్డు చైర్మన్ అలీ జైదీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.సమీక్షా సమావేశంలో ముతవల్లి కమిటీల నిర్లక్ష్యంపై అలీ జైదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తుల పూర్తి వివరాలను ఉమీద్ పోర్టల్‌కు అప్‌లోడ్ చేయడంలో చాలా కమిటీలు ఇప్పటికీ అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 5 లోపు అన్ని ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
నిర్ణీత సమయంలోపు ఉమీద్ పోర్టల్‌కు వివరాలను అప్‌లోడ్ చేయడంలో విఫలమైన ఏ కమిటీ అయినా దోషిగా పరిగణించబడుతుందని బోర్డు స్పష్టంగా పేర్కొంది. అలాంటి సందర్భాలలో సంబంధిత కమిటీ లేదా నిర్వహణ కమిటీపై చర్యలు కూడా వుంటాయని హెచ్చరికలు పంపారు.
వక్ఫ్ బోర్డు పక్షాన పంపే పత్రాలు గానీ, ఇతరత్రా సమాచారాన్ని ముతవల్లి లేదా, నిర్వాహకుడు లేదా మేనేజింగ్ కమిటీకి సంబంధించిన ఈమేయిల్ నుంచి లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా మాత్రమే పంపాలని కూడా ఆదేశించారు.





