News

దేవాలయాల కేంద్రంగా గ్రామ వికాసం కూడా సాధ్యమే : దత్తాత్రేయ హోసబళే

268views

మన దేవాలయాలు కేవలం పుణ్యం సంపాదించి పెట్టే, లేదా యాచించడానికి వున్న స్థలాలు కావని, అవి అంతర్గత చైతన్యాన్ని మేల్కొలిపే కేంద్రాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అంతర్గత చైతన్యాన్ని మేల్కొలపడం మొదలు, ఇతరుల బాధలను తొలగించడం వరకూ దేవాలయాలు సేవా భావాన్ని కూడా మనుషులలో పెంపొందిస్తాయని అన్నారు. యూపీలోని బారంబకీ ప్రాంతంలో నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ప్రారంభోత్సవంలో దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ కార్యంలో వున్న ఏ సంస్థ అయినా.. దాని నిధులు, బ్యాంకు బాలెన్స్ ద్వారా గొప్పదనిపించుకోదని, అందులో వుండే కార్యకర్తల సేవా భావం, సంస్థ చేసే సేవా స్ఫూర్తి, చేసే పనుల ద్వారానే గొప్పదవుతుందన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లోనూ అనేక సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు కలిసి ప్రజలకు సేవ చేశాయని, ఉపాధి కూడా కల్పించాయని గుర్తు చేశారు.అదే సమయంలోనూ సంఘ స్వయంసేవకులు కూడా సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. దీని నుంచి ప్రేరణ తీసుకొనే, కొద్ది రోజుల తర్వాత నారాయణ సంస్థ ఆవిర్భవించిందని, నేడు ఈ రూపం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు.

‘‘ఓ సారి ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇలా అడిగాడు. దేవుడు ప్రతి చోటా వున్నాడు కదా.. ఇక ఆలయం ఎందుకు? అందులో పూజ ఎందుకు? అని.. అప్పుడు ఆ భక్తుడు సమాధానమిస్తూ… మీ సైకిల్ లో గాలి దిగిపోతే, మీరు తిరిగి గాలిని ఎందుకు నింపుతారు? గాలి ప్రతి చోటా వుంది కదా? అని ’’ ప్రశ్నించాడు. అలాగే ఈశ్వరుడు సర్వవ్యాపి. సర్వే సర్వత్రా వ్యాపించి వున్నాడు. అయినా దేవాలయం అత్యావశ్యకం. దేవాలయం ఎందుకు అన్న దానికి స్పష్టమైన భావన మనకు వుంది. ప్రజల మనస్సులో ఐక్యతను మేల్కొలుపుతుంది. మన దేవాలయాలు ఐకమత్యానికి కేంద్రాలు. శిల్పుకళలకు కేంద్రాలు. ఆలయం నిర్మాణం అంటే కేవలం ఇటుకలతో, రాతితో నిర్మాణం కాదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఓ పవిత్రమైన నిర్మాణం. దేవాలయాలు వ్యక్తిని పరమాత్మతో అనుసంధానించడానికి ఉపయోగపడతాయి’’అని హోసబళే వివరించారు.

ఆలయాల ద్వారా గ్రామ వికాసం…
ఆలయాల కేంద్రంగా గ్రామ వికాసం కూడా జరుగుతుందని అన్నారు. రాలేగావ్ సిద్ధి గ్రామంలో ప్రజలకు అవగాహన పెంచడానికి సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆలయ కేంద్రగానే పనులను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఉద్యమం ఉద్ధృతంగా సాగడానికి కారణమేంటని పలువురు అడగ్గా… ఆలయ కేంద్రీకత వ్యవస్థే తనకు ప్రేరణ ఇచ్చిందని వెల్లడించారని పేర్కొన్నారు.
‘‘అదేవిధంగా, ఓ ఆరెస్సెస్ స్వయంసేవక్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కర్ణాటకలోని ఒక గ్రామంలోని 900 సంవత్సరాల పురాతనమైన సీతారాముల ఆలయం చుట్టూ ఉన్న మురికిని మరియు దుర్వినియోగాన్ని తొలగించి, ఆలయ నిర్మాణంపై ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేశాడు మరియు కేవలం 5 సంవత్సరాలలో, ఆ ఆలయం గ్రామ చైతన్యానికి కేంద్రంగా మారింది.’’అని హోసబళే వెల్లడించారు.

గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్యపై అందరూ దృష్టి సారించారని, దేశ ప్రధాని గ్రామీణాభివృద్ధి, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరెస్సెస్ స్వయంసేవకులు కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి అందుబాటులో ఉండేలా సామాజిక సంస్థలు కృషి చేయాలి. భారతదేశ పునర్నిర్మాణం ఢిల్లీలోనే కాకుండా గ్రామాల్లో ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.