News

శివపూజకు చివురించిన ‘స్విట్జర్లాండ్‌’ మువ్వ

211views

స్విట్జర్లాండ్‌కు చెందిన సుసి బ్రాస్‌ (22) అనే యువతి రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. డ్యాన్స్‌, నటనలో తనకున్న నైపుణ్యాలతో థియేటర్‌, సినిమా రంగంలో ప్రతిభ చాటాలనుకుంది. ఓ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసిన ఆ విదేశీ యువతి.. శివ భక్తురాలిగా మారింది. బిహార్‌లోని వైశాలిలో ప్రస్తుతం నివాసముంటోంది.

స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన సుసి.. వైశాలి సోన్‌పుర్‌లో ఉన్న శోభా సామ్రాట్‌ థియేటర్‌లో కళాకారిణిగా పనిచేసింది. కొన్ని రోజుల తర్వాత అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి దూరమైంది. ఈ క్రమంలోనే ఓసారి స్థానికంగా ఉన్న బాబా హరిహర్నాథ్‌ ఆలయాన్ని సందర్శించింది. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షితురాలైంది. మెడకు తులసిమాల ధరించి.. ఓం నమఃశివాయ జపించడం మొదలుపెట్టింది. అంతేకాదు క్రమంగా మాంసాహారాన్ని త్యజించింది. ఆలయానికి సమీపంలోనే ఓ గదిలో అద్దెకు ఉంటూ.. గంగా, గండక్‌ నదుల తీరాలను అస్వాదిస్తోంది. ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందంటున్న ఆమె.. తనకు ఏ సమస్య వచ్చినా భగవంతుడికి విన్నవించుకొంటే పరిష్కారం లభిస్తోందని చెబుతోంది.

సుసి తండ్రి కృష్ణ పాండే దిల్లీకి చెందినవాడు. 25ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడే సుసి తల్లిని వివాహం చేసుకున్నాడు. అయితే, 2011లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో సుసి ఒంటరైందని తెలిసింది. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆమె.. ఇక్కడి సంప్రదాయాలను అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. సినిమాలో నటించాలనేది తన లక్ష్యం అయినప్పటికీ.. ప్రస్తుతానికి భక్తికే తన ప్రాధాన్యం అని, ఎంతో ప్రశాంతతను ఇస్తోందని తెలిపింది.