
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు రికార్డులు, పబ్లిక్ స్థలాల్లో కుల ప్రస్తావన పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర కేంద్ర సచివాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్ట్ మెమోలు, ఇతర పోలీసు డాక్యుమెంట్లలో కుల ప్రస్తావనలు ఉండకూడదని, గుర్తింపునకు తల్లిదండ్రుల పేర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
పోలీసు స్టేషన్లు, వాహనాలు, సైన్‌బోర్డులపై ఉన్న కుల చిహ్నాలు, స్లోగన్‌లు, ప్రస్తావనలను వెంటనే తొలగించాలని కూడా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, కుల ఆధారిత ర్యాలీలునిషేధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉల్లంఘనలను కఠినంగా పరిశీలించాలని పోలీసులకు సూచనలు జారీ చేశారు.
అయితే, షెడ్యూల్డ్ కులాలు-SC షెడ్యూల్డ్ ట్రైబ్స్-ST (అత్యాచారాల నివారణ) చట్టం కింద వర్గీకరించబడిన కేసుల్లో కుల గుర్తింపు చట్టపరంగా అవసరం కావున దీనికి మినహాయింపు ఇచ్చారు. ఈ ఆదేశాల అమలుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లు-SOPs పోలీసు మాన్యువల్‌లలో సవరణలు చేస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది.





