
స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దేశ ప్రగతికి పునాది రాళ్లు. అవి జాతికి సంక్రమించిన జన్మహక్కులు. స్వేచ్ఛ వ్యక్తిగతమైనది. స్వాతంత్య్రం సామాజికమైనది. స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ లేని స్వాతంత్య్రానికి అర్థం లేదు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేని సమాజం అశాంతికి, అలజడికి లోనవుతుంది. హక్కులను, బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ సంయమనంతో వ్యవహరించడం పైనే దేశ సామాజిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి.
‘అది నాః స్యామ శరదః శతమ్’- అని యజుర్వేదం పేర్కొంది. ఎవరికీ బానిసలు కాకుండా నిత్య స్వతంత్రులుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్థించాలనేది వేదవాక్కు. దేశం పురోగమించాలంటే ప్రజలు నైతిక సూత్రాలకు లోబడి జీవించాలి. ప్రజల్లో దేశభక్తి, త్యాగం, సహనం వంటి మేలిమి గుణాలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. స్వేచ్ఛ అనేది మానవజాతికి ఊపిరితో సమానం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో దేహంలో జీవకళ తొణికిసలాడినట్లే స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో దేశంలో చైతన్యం వెల్లివిరుస్తుంది. బాధ్యతతో కూడిన స్వేచ్ఛా జీవనమే స్వాతంత్య్రంగా మహాత్మాగాంధీ పేర్కొన్నారు.
ఏ జాతికైనా అసలైన సిరిసంపదలు… దేశ ప్రజల ఆత్మబలం, మనోధైర్యాలు. దేశభక్తి సమాజాన్ని ఏకీకృతం చేస్తుంది. దేశభక్తి అంటే- దేశం పట్ల ప్రేమాభిమానాలు, విధేయత, అంకిత భావాలను ప్రదర్శించడం; దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని గౌరవించడం; దేశ యశస్సుకు, శ్రేయస్సుకు కట్టుబడి వ్యవహరించడం. ఏ దేశ గౌరవమైనా అక్కడి ప్రజల జీవన విధానంపై, వారు అనుసరిస్తున్న పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. పౌరులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే అసలైన దేశభక్తి అని, బాధ్యతాయుతమైన పౌర సమాజంతోనే దేశంలో శాంతి నెలకొంటుందని మనుస్మృతి స్పష్టంచేసింది. సమైక్యతను పాటిస్తూ సమగ్రతను అనుసరిస్తూ వ్యక్తులు తమ దేశం పట్ల విధేయతను కనబరచడం ద్వారా మాతృభూమి రుణం తీర్చుకోవచ్చని మహాభారతం శాంతిపర్వంలో ధర్మరాజుకు భీష్ముడు ఉపదేశించాడు. దేశ భద్రత, ఐక్యత, సంపద, సంస్కృతి, గౌరవాలను కాపాడటం సైతం దేశభక్తిని ప్రకటించడమే! ప్రకృతిని పరిరక్షించడం, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం కూడా దేశభక్తి అవుతుందని పద్మ పురాణం విశ్లేషించింది.
మన భారత జనయిత్రి అపూర్వమైన, అపురూపమైన దివ్యధాత్రి. యోగభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా తేజరిల్లుతోంది. భారతీయులందరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ దేశాభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని ఆర్ష ధర్మం నిర్దేశించింది. సత్యం, ధర్మం, శాంతి, న్యాయం అనే నాలుగు చక్రాలతోనే ప్రజాప్రగతిరథం ముందుకు పయనిస్తుంది. దేశమంటే చైతన్యయుతమైన ప్రజా సమూహం, తమ విధ్యుక్త ధర్మాలను నిబద్ధతతో పాటించే జనజీవన చేతనం. స్వతంత్రం, స్వయంకృషి, స్వావలంబనల మేలు కలయికతోనే వ్యక్తుల జీవితం సార్థకమవుతుంది. కర్తవ్యదీక్షలో పురోగమిస్తూ, కార్యోన్ముఖులై శ్రమేవ జయతే అనే సూత్రాన్ని నిరంతరం అవలంబించాలి. అదే మనం దేశమాతకు సమర్పించే అమూల్యమైన కానుక!





