ArticlesNews

నాటి వ్యవస్థకు కేంద్రం దేవాలయం

306views

తీరాంధ్ర ప్రాంతంలో పంచారామాలు – అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట. శివుడు త్రిపురాసురులను జయించి, వారి ఇష్టలింగాన్ని భగ్నం చేసినప్పుడు, అది ముక్కలై ఈ ఐదు చోట్ల పడగా ఆరామాలు వెలిశాయి. భూగోళశాస్త్రజ్ఞుడు టాలమీ ‘‘త్రిలింగోన్‌’’ ‌గురించి ప్రస్తావిస్తాడు. ఇది త్రిలింగ లేక ఆధ్రదేశమని భావిస్తారు. త్రిలింగాలలో చివరిది ద్రాక్షారామం. మరొకటి శ్రీశైలం. చివరిది కాళేశ్వరం. ద్రాక్షారామంలో లభ్యమయ్యే మొత్తం శాసనాలు 387. రాజమండ్రి మ్యూజియం స్తంభ శాసనం ఈ ప్రదేశాన్ని ‘‘భీమాపురము, డాకరేమియు, సమాడాల, గుడిపూండియు, బాలుకొలన’’ అని పేర్కొంటుంది. ఈ వర్ణనలో పాలకొలన అంటే పాలకొల్లు, (ప।।గో।।జిల్లా) గుడిపూడి (గునుపూడి-భీమవరం) అమాడాలు-(అమరావతి) డాకరేమి (ద్రాక్షారామము) భీమాపురము (చాళుక్య భీమవరం) సామర్లకోట.

భీమ మండలం చరిత్ర ఆ ఆలయం మీది శాసనాలలో ప్రతిబింబిస్తున్నది. ఈ ప్రాంతపు ముఖ్య పట్టణం ద్రాక్షారామం. ఈ ఆలయంలోని లింగం చాలా పెద్దది. భీమలింగం అని పిలుస్తారు. భీమేశ్వ రుడు కేంద్రంగా ఉన్న ప్రాంతం గనుక భీమమండల మని పిల్చారు. శివుని మామగారైన దక్షప్రజాపతి కేంద్రంగా ఈ పట్టణాన్ని భావిస్తారు. దక్షుడి ముఖ్య పట్టణం గనుక ద్రాక్షారామం. శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో ఈ మండలపు వర్ణన ఉంది. ద్రాక్షా రామం, జననాథపురం, డాకరేమి అలా వరసగా ఆ ప్రదేశానికి చెందిన మత, రాజకీయ ఆర్థిక ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. చాళుక్యరాజు మొదటి భీమునికి జననాథుడనే బిరుదు ఉన్నది. క•నుక జననాథుడు స్థాపించిన ఈ జనవాసానికి జననాథ పురమనే పేరు ఉన్నది. భీమేశ్వరాలయానికి చెందిన తొలికాలపు శాసనం శా।। 960 నాటిది. కనుక 1038 కల్లా ఆ ఆలయం వ్యవస్థీకృతమైందని తెలుస్తున్నది. నన్నయ్య మహాభారతంలోనూ, అలాగే విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.

‘‘తూర్పు దక్షిణాన సముద్రం పశ్చిమాన గోదావరి నది, ఉత్తరాన పిఠాపురం వద్ద నున్న ఏలేరు నది దీనికి ఎల్లలు’’ అని శ్రీనాథుడు చెప్పాడు. ఈ ప్రాంతాన్ని సప్తగోదావరి మండలమని కూడా పిలు స్తారు. గోదావరి ఇక్కడ ఏడుపాయలుగా విడిపో యింది. వృద్ద గౌతమి, గౌతమి, వాశిష్ఠి, కౌశికి, ఆత్రేయి, వైనతేయి, తుల్యభాగాలు. వీటితో ఈ ప్రాంతం సారవంతమైంది. ఈ ప్రాంతాన్ని వేంగి చాళుక్యులు, చాళుక్య-చోళులు, కల్యాణీ చాళ•క్యులు, వెలనాడు నాయకులు, కాకతీయులు, తూర్పు గాంగులు, ఒరిస్సా గజపతులు, రాజమండ్రి రెడ్డిరాజులు, విజయనగర రాజులు పాలించారు. ముసునూరి ప్రోలయ నాయకుడు విస దాన శాసనం వేయించాడు. దానివలన మధ్యయుగంలో ఆంధప్రాంత ఇస్లాం దాడులు, పాలకులు- దేవుడిని, బ్రాహ్మణులను, గోవులను కాపాడ ప్రయత్నించారో తెలుస్తుంది. ఈ దిశగా జరిగిన సేవ వర్ణ వ్యవస్థలో గణనీయమైన మార్పు తెచ్చి ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది.

మొదటి కులోత్తుంగుడు (క్రీ.శ.1115) ద్రాక్షారామంలో వేయించిన శాసనంలో ‘పసులు’ అని ఉంది. కె.ఈశ్వర్‌దత్తు కొన్ని శాసనాల్లో ‘మోదాలు’ అన్న మాట ఉందని రాశారు. దాని అర్ధం పాడియావులు. నేల విషయానికి వస్తే ‘కుల్యారామ భూమి’ అంటూ తోటలను ప్రస్తావించారు. అంటే కాలువ నీటిని ఉపయోగించి పెంచిన మామిడి, అరటి మొదలైన తోటలు. సాగునీటి వనరుల పరిధిలో ఉంటే భూమిని ఉదక ప్రదేశమని, ఊడ్పునేల అని పిలిచేవారు. అంటే నీటి వనరుతో సాగులో ఉండే భూమి. రాజేంద్ర చోడ చతుర్వేది మంగళం లాంటి ప్రాంతాలలో ఇలాంటి సాగు జరిగిందని, సాగులో 102 మంది కలిసి పాల్గొన్నారని ఒక శాసనం చెపుతున్నది (పేజీ-84).

పురోహితుడు, వండునది (వంట మనిషి) గుడి కొలువు (గుడి సేవకుడు) ఆలయ ఆధిపత్యంలోని సంస్థలలో పనిచేసే సభ్యులు, అక్కసాలి (వడ్రంగి) తమ సేవల ద్వారా వ్యవసాయేతర వస్తువులను ఉత్పత్తిలో ‘పంచాణం వారు’అనే నికాయం చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తుంది. పంచాణం అంటే వడ్రంగి, కంచరి, కంసాలి, కమ్మరి, వడ్డరి అను ఐదు కులాల సంఘం. ఆంధ్రదేశపు మధ్య యుగ శాసనాల్లో తరచుగా కన్పించే చేతి వృత్తుల వారి సంఘం (అమరావతి శాసనం).

భీమ మండలంలో వస్తు మార్పిడి విధానం కన్పిస్తుంది. ఆలయ సేవకుల సేవలను బియ్యం లేక తృణధాన్యాల రూపంలో కొలిచేవారు. భూములను పుట్టి, తూము, పందుము, ఏదుము, కుంచముల లెక్కలలో కొలిచేవారు. దక్షిణ భారతదేశంలోని భూమిశిస్తు పంటలో ఆరవభాగం. అది ధర్మశాస్త్రాల ప్రభావం వలన ఏర్పడినది. కాని క్రీ.శ.1324 ప్రాంతంలో ముస్లింల ఆరాచక సమయంలోనూ, తరచు స్థానిక నాయకులు దాడి చేయడం వలన భద్రతకు భగ్నం కలిగింది. కనుక సముద్ర వ్యాపారం కొనసాగ•లేదు.

ఆంధ్రదేశ చరిత్రలో క్రీ।।శ।। 11-15 శతాబ్దాల నడిమ గణనీయమైన మార్పులను చూసింది శూద్రులు రాజకీయాధికారం సంపాదించడం, దాతలుగా పరిపాలనాధికారులుగా ఆలయంలో వారి పాత్ర, వృత్తి సంఘాల వికాసం, భూస్వామ్య పద్ధతి పాలనవ్యవస్థ మొదలైన లక్షణాలు పదకొండవ శతాబ్ది అనంతరకాలాన్ని అంత ముందటి కాలం కంటే భిన్నమైనదిగా గుర్తించడానికి కచ్చితమైన ఆధారాలున్నాయని ప్రొ।। సి.సోమసుందర్రావు (శాసన పరిశోధకులు) అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో అన్ని వర్గాల ప్రజల నుండి ఈ రుషి సంస్క ృతి భక్తులను ఆకర్షించింది. ద్రాక్షారామంలోని సప్తర్షులు, అరుంధతీ విగ్రహాలు ఈ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని పొ।। కృష్ణకుమారి (చరిత్రకారులు) అభిప్రాయపడ్డారు. ఈ కాలంలోనే మహాకవి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో పంచారామాల మూలాన్ని వివరించే ప్రయత్నం చేశారని దానిలో ద్రాక్షారామం ఒకటని ఆచార్య కొల్లూరి సూర్యనారాయణ (పురావస్తు శాస్త్రవేత్త) వివరించారు.

సంక్రాంతి, సోమగ్రహణం, వ్యతీపాతం, సూర్యగ్రహణం మొదలైన పవిత్రదినాల్లో దానం చేసేవారు. అఖండ దీపం కోసం దానం ముఖ్యమై నది. ఎన్నో శాసనాలు అఖండ దీపదానాన్ని తెల్పు తున్నాయి. సుమారుగా అన్ని వర్గాలవారు దానాల ద్వారా భగవంతునికి సేవ చేశారు. అయితే బ్రాహ్మ ణులకు అగ్రహారాలు దానం చేసిన సందర్భాలేవి ద్రాక్షారామ శాసననాలో కన్పించలేదు.

వైశ్యులను శాసనాల్లో పేర్కొన్నారు. కమ్మకోమట్లు, వైశ్యముఖ్యులు, వైశ్యకులాబ్ది చంద్రులు, బచ్చులు అని పేర్కొన్నారు. వీరందరూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుండి వచ్చినవారుగా చెప్పుకుంటారు. వీరిని పెనుగొండ నాథ•లనీ, పెనుగొండ వాస్తవ్యులనీ అంటారు. కొందరు రాజులు వైశ్యులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని శాసనాలు చెబుతున్నాయి. కులోత్తుంగ గొంకరాజు సన్నిహితుడు భట్టిప్రోలి గోపతిసెట్టి అలాంటి వారే.

శాసనాలు శూద్రుల్లో కొన్ని ఉపకులాలను పేర్కొన్నాయి. అగసాలె వారిని సౌవర్ణకారులని, బలిజ కులం వారిని పంచమూల గోత్రీకులుగా పేర్కొన్నాయి. బోయల ప్రస్తావన ద్రాక్షారామ శాసనాలలో సర్వసాధారణం. అఖండ దీప నిర్వహణ సందర్భంలో బోయల ప్రసక్తి వస్తుంది. ఒక అఖండ దీపం కోసం యాభై పాడియావులను దానం చేస్తారు. ఈ పశువులను బోయిల సంరక్షణలో ఉంచుతారు. విజయా దిత్యుని కాలంలో (కీ।।శ।। 848-891) పన్నెండు బోయ కొట్టాల ప్రస్తావన ఉంది. ఇక్కడ తప్ప తక్కిన ఆరామాల్లో బోయల ప్రస్తావన దాదాపు శూన్యం.

బహు భార్యత్వం నాటి సాంప్రదాయం. అనంతవర్మ ఐదుగురు భార్యలనూ శాసనాలు పేర్కొన్నాయి. రాజ్య ప్రయోజనాల కోసం వివాహాలు సర్వసాధారణం. వేంగీ చాళుక్యులు, కాకతీయుల వంటి సార్వభౌములు కూడా రాజకీయపరమైన వివాహ సంబంధాలు చేసుకున్నారు. వేంగీ చాళుక్యులు వరసగా మూడు తరాలు చోళులతో వివాహ సంబంధాలు అందుకున్నారు. అదేవిధంగా కాకతీయ గణపతి దేవుడు తన కుమార్తెలను నిడదవోలు చాళుక్యులకూ, నతవాడి విషయానికి చెందిన కోట వంశీయులకు ఇచ్చాడు.

స్త్రీల విషయానికొస్తే 13వ శతాబ్దపు స్థానిక ప్రభువుల భార్యలు, స్త్రీలు రాణులుగా, రాకుమార్తె లుగా, దాతలుగా దేవాలయంలో దర్శనమిస్తారు. శాసనాలలో స్త్రీలను బోధించే సాధారణ పదం ‘సాని’. ఈ పదానికి సంస్క ృత మూలం ‘‘స్వామిని’’. స్వామిని అంటే రాజు భార్య లేక ఉంపుడుగత్తె. దొరసాని, ఒజ్జిసాని, పూజారిసాని, సోమిసాని వంటి ప్రయోగాలు కన్పిస్తున్నాయి. కాని సాని పదం తరువాతి శతాబ్దంలో వేశ్యను బోధిస్తుంది. అమరనాయకుని కుమార్తె సత్యసాని దండనాయక చోడప నాయకుని తల్లి కొమ్మసాని (కీ।।శ।।53), చోడప నాయకుని భార్య కామసాని (కీ।।శ।।1180), కడియం మాచినేని భార్య పోతసాని (కీ।।శ।।53). ద్రాక్షారామ శాసనాలు కమ్మర్లు, సెట్లు, చాకళ్లు, క్షురకులు, కుమ్మరి, వడ్రంగి మొదలగు వృత్తివర్గాల వారిని పేర్కొన్నవి. వృత్తివర్గా లతో మరోకటి, వ్రాయసగాండ్రు. వీరు స్వర్ణకార వృత్తికి చెందిన ఆచారి ఓజు, బట్టుడు వంటి ఉప నామాలతో ఉంటారు. భీమ మండలం భూస్వామ్య సమాజం కాదనీ, హిందూమత నిర్మాణ అవశిష్ట లక్షణాలు, బ్రాహ్మణేతర విభాగాల స్వాభిప్రాయ ప్రకటన కాంక్షతో కలిసి సమాజాన్ని నవ్యప్రాచీన సమాజమనడానికి తగిన సామాజిక లక్షణాలు అందిస్తున్నాయని డా।। ఆర్‌.‌చంపకలక్ష్మి అభిప్రాయ పడ్డారు. రక్షణ, పౌర పరిపాలనకు సంబంధించిన అధికారులను గురించి శాసనాలు ప్రస్తావిస్తాయి. దండనాయక, సమస్త సేనాపతి, సాహిణి, గజ సాహిణి, చమూనాథ లాంటి పదాలు సైన్యాన్ని నియంత్రించే అధికారులను తెలియపరుస్తాయి. గ్రామస్థాయిలో కార్య నిర్వాహకాధికారులను రట్టడ్లు, కరణాలు, తలారి అంటారు. రట్టడ్లు ఆదాయానికి బాధ్యత వహించే అధికారులు. వీరే గ్రామ కరణాలు, శ్రీ కరణాలు, కర్మకరణాలు. కర్మకరణాలు గ్రామానికి సంబంధించినవారు కాగా, శ్రీ కరణాలు దేవాలయం వంటి సంస్థలకు చెందినవారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షకుడు తలారి. పాలకులకు లేక వారి సహాయకులకు కర్షకులు దాస్యం నెరపినట్లు ఎక్కడా లేదు.

ఆంధప్రాంతంలో రాజ్యతంత్ర స్వభావం నవ్య ప్రామాణిక లక్షణం కలిగి ఉందని చెప్పవచ్చును. స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్రీకృత రాచరికం ఉంది. ప్రభువుకు, రాజ్యానికి స్థానిక స్థాయిలో నాయకుల విశ్వసనీయత రాజకీయ ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది. బలహీన వ్యాపారం, వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉన్న ఒక ఆర్థిక దృష్టి కోణపు రాజ్యతంత్ర స్వభావాన్నిక్కడ చూడవచ్చును. శివ, విష్ణువులు ప్రధాన దేవతలయ్యారు. శంకారాచార్య, రామానుజాచార్య తదితర మత సంస్కర్తలు ప్రతి పాదించిన హిందూమతం ఒక నూతనోత్సాహాన్ని పుంజుకుంది. ప్రజల ఊహలను కూడా ఆక్రమించు కొని ఈ నవ్య హిందూ మతోత్దానానికీ, బౌద్ద జైనాల క్షీణతకు కారణమై ప్రజల మత జీవనంలో వేళ్లూను కొంది. గుడి ఒక ప్రత్యేక అంగం కావడం వల్ల అది సామాజిక వర్తనకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. వస్తు,ధనరూపమైన సంపత్తి దేవాలయంలోనికి ప్రవహింపసాగింది.

శాసనాల్లో పేర్కొన్న కొన్ని ఉత్సవాల్లో తొంట్యో త్సవం, పంది ఉన్నాయి. తొంట్యోత్సవాన్ని తాటి వనంలో నిర్వహిస్తారు. పంది ఉత్సవాన్ని ‘‘మహా ఖేటక ఉత్సవం’’ అన్నారు. కాని వివరాలు తెలియవు. కొందరు దాతలు జయగొండ చోడియం వారు, స్మియం దేవి, కల్యాణదేవి, లీలావతీదేవి, రాజలదేవి, పద్మలదేవి, లావణ్యవతీ దేవి మొదలైన గాంగవంశపు రాణులు, చిన్నరాజ వంశీల అంతఃపుర స్త్రీలు, ప్రెగ్గడలు, దండనాయకులు కూడా దానాలు చేశారు. దానాలు చేసిన ఇతరవర్గాలలో ముఖ్యమైనవారు రెడ్డి, కమ్మ, బలిజ, దేవాంగ, కంసాలి, కమ్మర మొదలైన వారితోపాటు బోయలు కూడా దానాలు చేసినట్లు శాసనాధారాలున్నాయి.

మూలం:

1.శాసనాల్లో శ్రీ భీమేశ్వరాలయం చరిత్ర బై జాస్తి దుర్గాప్రసాద్‌ (‌తెలుగు అనువాధకులు) కాకాని చక్రపాణి, దుర్గంపూడి చంద్రశేఖరరెడ్డి పేజీ-9,11, 19, 21.
2.వెలుగు : మేగ్‌జైన్‌,
3.భారతి XXV-1
4.శ్రీనాధుని : భీమేశ్వరపురాణం (పేజీ.76) అశ్వాసం.
5.ఎమ్‌.‌కృష్ణకుమారి, పంచారామా ఇన్‌ ‌మిడివల్‌ ఆం‌ధ్రా (పేజీ 26,27).
6.History of Indian Agriculture (1200 AD onwards) P 110 (Madras Agrictulral Journal) by G.Jogi Raju

డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు