ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు?

1.5kviews

న దేశంలో ప్రస్తుతం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు, హింసాత్మక చర్యలు కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వలననే అనుకుంటే అది సమస్యని తేలిక చేసినట్లవుతుంది. గత కొంత కాలంగా కొన్ని స్వార్ధపర రాజకీయ, అసాంఘిక శక్తులు సత్యదూరమైన, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలలో భయాన్ని సృష్టిస్తూ ఉండటం చేతనే నిజాలు తెలుసుకోకుండా ప్రజలనుంచి ఇంత ప్రతిఘటన ఎదురవుతోంది.

పౌరసత్వ సవరణ చట్టంలోని ముఖ్యాంశాలు:

1) భారతీయ పౌరులెవరూ కూడా (ఏ మతం వారైనా) తమ పౌరసత్వాన్ని కోల్పోరు.

2) దక్షిణాసియా దేశాలలోని వారందరికీ మన దేశ పౌరసత్వం ఇవ్వబోవటం లేదు.

3) మన దేశంలో ఇప్పటికే లేని వారెవరికీ ఈ చట్టం పిలిచి పౌరసత్వం ఇవ్వబోవటం లేదు.

4) శ్రీలంక నుంచీ వచ్చిన శరణార్థుల విషయంలో మన దేశం శ్రీలంకతో జరిగిన ఒప్పందంలో స్పష్టమైన అంగీకారానికి వచ్చి వారికి న్యాయం చేసింది.

5) బర్మా ప్రభుత్వం అక్కడి విదేశీయుల విషయంలో నిరంకుశంగా ప్రవర్తించినప్పుడు, మన దేశం బర్మా ప్రభుత్వంతో చర్చలు జరిపి మన దేశానికి తీసుకువచ్చి వారికి భారతీయ పౌరసత్వం కల్పించింది.

6) ఆఫ్రికా దేశాలలో కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, మన దేశం ఆయా దేశాలతో చర్చించి, మన దేశానికి సంబంధించిన వారిని వెనక్కి తీసుకువచ్చి వారిని మన దేశంలోనే గౌరవంగా బ్రతికేలా ఏర్పాట్లు చేసింది.

7) ఈ విధంగా చాలా దేశాలలో ఉన్న భారతీయులని, అక్కడి ప్రభుత్వాలు సరిగా చూడని పరిస్థితులు ఉన్నప్పుడు – వారిని గుర్తించి మన దేశానికి తీసుకురావటం జరుగుతోంది.

ఈ క్రమంలో మన దేశంలో ఉన్నవారిలో, పౌరులు ఎవరు?  పౌరులు కాని వారెవరు? అనే ఒక నిర్దుష్టమైన ఏర్పాటు లేకపోవటంతో – ఎవరికి ఓటు హక్కు ఉంది?  ఎవరికి లేదు? అనే విషయంలో స్పష్టత లేకుండా పోతోంది.  ఎన్నికలొచ్చినప్పుడు అప్పటికప్పుడు ఓటర్లను రకరకాల ప్రక్రియల ద్వారా గుర్తించి పట్టికలు తయారు చేయటం జరుగుతోంది.  దీనివలన ప్రజాస్వామ్యం పరిహాసం చెందుతున్న ఉదంతాలు కోకొల్లలు.  ఈ తప్పిదాన్ని సరిదిద్దటానికే జాతీయ పౌరుల పట్టికని తయారు చేయటానికి ప్రభుత్వం పూనుకుంది.  ఇందులో భాగంగా – మన దేశంలో ఇప్పటికే ఉన్న వ్యక్తులలో ఎవరిని పౌరులుగా గుర్తించాలి, ఎవరిని విదేశీయులుగా గుర్తించాలి అని ఆలోచిస్తే  – ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం ఆవశ్యకత అర్థమవుతుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన కాందిశీకులు గానీ, బంగ్లాదేశ్ దేశ అవతరణ సమయంలో మన దేశంలోకి వచ్చిన శరణార్థులు గానీ వేలాది, లక్షలాది మంది ఇంకా ఇక్కడి పౌరులుగా గుర్తింపుకు నోచుకోక, సరైన సదుపాయాలూ లేక, ప్రభుత్వ ఆసరా పొందలేక తరతరాలుగా దయనీయమైన పరిస్థితులలో బ్రతుకుతూ, వేధింపులకు, అణచివేతలకు గురౌతున్నారు.

మన ప్రధానులు కూడా వీరిని వారి వారి దేశాలకు పంపాలనే ప్రయత్నించారు గానీ – ఆ దేశాలు మతపరమైన దేశాలుగా రూపాంతరం చెందటం చేత ఇతర మతాల వారిని తమ పౌరులుగా గుర్తించి వెనక్కి తీసుకోవటానికి నిరాకరిస్తూ వస్తున్నాయి.  పౌరసత్వ నిర్ధారణ, హక్కులు, బాధ్యతలు లేకుండా శరణార్ధులుగా దశాబ్దాల తరబడి వీరు ఉండటం వలన వీరుంటున్న ఆయా ప్రాంతాలలో ప్రజలపై, ఆర్ధిక వ్యవస్థలపై, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో, కేంద్ర ప్రభుత్వం వీరిని మన దేశ పౌరులుగా గుర్తించటానికి మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చింది. మన దేశంలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్న వారిలో హిందువులు, సిక్కులు, క్రిష్టియన్లు, పార్సీలు, జైనులు, బౌద్ధులు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లకి వెళ్లి నివసించే పరిస్థితులు లేకపోవటం చేత (అక్కడి ప్రకటిత మతతత్త్వ ప్రభుత్వ విధానాల కారణంతో) వారికి త్వరితగతిన మన దేశ పౌరసత్వం వచ్చే వెసులుబాటు కల్పించారు.  ముస్లిం శరణార్థులు – వారి వారి దేశాలకు తిరిగి వెళ్ళవచ్చు; లేదా మన దేశంలోనే ఉండాలనుకుంటే ఇప్పటికే ఉన్న పౌరసత్వ అర్హతా ప్రమాణాలను అనుసరించి పౌరసత్వాన్ని పొందవచ్చు.

శరణార్థులు ఎవరినీ కూడా మన ప్రభుత్వం నేరస్థులుగా పరిగణించదు.  శరణార్థులను అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి రక్షణ కల్పిస్తూ – మన చట్టాలకు లోబడి అర్హత ఉన్నవారికి పౌరసత్వాన్ని సమయానికి ఇస్తూ, లేనివారిని వారి వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తుంది.  ఎట్టి పరిస్థితులలోనూ తమ దేశానికి తిరిగి వెళ్ళము అనే వారికి మన రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఎప్పటినుంచో ఉంది.  ఎప్పటికీ ఉంటుంది.

మరి ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  (a) ముస్లిము శరణార్ధులను ఎందుకు చట్టంలో చేర్చలేదు?  (b) రోహింగ్యాలను ఎందుకు చేర్చలేదు?  (c) శ్రీలంక తమిళుల పరిస్థితి ఏమిటి?

(a) భారత ప్రభుత్వ సిద్ధాంతం మొదటినుంచీ కూడా – శరణార్థులకు వసతి కల్పించటం, వారి దేశాలలో పరిస్థితులు చక్కబడినాక వారిని తిరిగి వెనక్కి పంపించటము. అలాగే ఇన్నాళ్ళూ శరణార్థులు అందరూ ఉన్నారు మన దేశంలో – దొంగచాటుగా సరిహద్దులు దాటి వచ్చిన వారితో సహా.     ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మూడు దేశాలూ కూడా ప్రకటిత ముస్లిం దేశాలు.  ఆ దేశాలలో మతపరమైన వివక్ష, హింస, బలవంతపు మతమార్పిడులతో ముస్లిమేతరులు చాలా కాలంగా పీడించబడుతున్నారు.  ఈ వివక్ష తగ్గే సూచనలు కూడా లేవు.  అందువలన ఈ దేశాలనుంచీ శరణు కోరి వచ్చిన ముస్లిమేతరులకి ఆరు సంవత్సరాల నివాస నిబంధనతో పౌరసత్వం కల్పించే వెసులుబాటు (హక్కు కాదు) ఈ చట్ట సవరణ ద్వారా ఏర్పాటు చేశారు.  విదేశీయులుగా మన దేశంలో ఉంటున్న ఈ మూడు దేశాలకు చెందిన  ముస్లిములు ఎప్పుడైనా తిరిగి వారి దేశానికి వెళ్ళే హక్కు వారికి ఆ దేశ రాజ్యాంగాలు కల్పిస్తున్నాయి.  కావున ఆ దేశాల ముస్లిములకు కూడా సత్వర పౌరసత్వం కల్పించటమనేది సిద్ధాంతపరంగా, ఆచరణాత్మకంగా ఆమోదయోగ్యం కాదు. వారు కూడా వారి దేశాలలో వివక్ష, హింస ఎదుర్కొంటున్నామని భావిస్తే, మన దేశంలో పదకొండు సంవత్సరాలు నివాసం ఉన్న తరువాత  భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు – చట్టము, నిబంధనల మేరకు వారి దరఖాస్తుని ప్రభుత్వం పరిష్కరిస్తుంది.  ఈ వెసులుబాటు ఇదివరకూ ఉంది.  ఇకపై కూడా ఉంటుంది.

(b) రోహింగ్యాలెవరు?  బర్మా ప్రభుత్వం వాదన ప్రకారం – అవిభాజ్య భారత్ నుంచీ బర్మాకి వలస వచ్చిన ప్రజలు.  బ్రిటిష్ వారు బర్మాని ఆక్రమించుకున్నప్పుడు వారు అప్పటి భారత్ (ఇప్పటి బంగ్లాదేశ్) లోకి వెనక్కి వచ్చారు.  వీరు బంగ్లాదేశ్ నుంచీ మన దేశంలోకి కూడా వచ్చారు.  అయితే – ఈ వాదనని మన దేశం అంగీకరించటం లేదు.  అంతే గాక – బంగ్లాదేశ్ ఇప్పుడు స్వతంత్ర దేశం కాబట్టి – ఈ విషయం బర్మా, బంగ్లాదేశ్ లు చర్చించుకుని పరిష్కరించుకోవలసి ఉంది.  అది జరగకుండా మన దేశం వారికి పౌరసత్వం ఇవ్వటం జరగని పని.  అయితే – అంతవరకూ కూడా రోహింగ్యాలకు మన దేశం దీర్ఘకాలిక వీసాలు ఇస్తూ, శరణార్ధులుగా పరిగణిస్తోంది.  అందుకని రోహింగ్యాలను ప్రస్తుత చట్ట సవరణలో చేర్చలేదు.

(c) శ్రీ లంకలోని అంతర్యుద్ధం సమయంలో మన దేశంలోనికి వచ్చిన తమిళుల సమస్య పరిష్కారం కొరకు భారత్-శ్రీలంకల మధ్య ప్రత్యేక ఒడంబడికలు ఉన్నాయి.  వాటిని కాదని మరళా ఆ  తమిళ శరణార్థులకు కూడా సత్వర పౌరసత్వం కల్పించే ప్రక్రియ పలు ఇబ్బందులకు దారి తీస్తుంది.  అందుకని శ్రీలంక తమిళులను ఈ చట్టంలో ప్రస్తావించలేదు.

అలా అని ఈ చట్టము, చట్ట సవరణ ముస్లిములకు వ్యతిరేకము కాదు, వివక్ష చూపదు.  ముస్లిములైనప్పటికీ, ఆ దేశాల నుంచీ వచ్చిన శరణార్థులకు శరణార్థి హోదా ఇస్తూ, వారి పరిస్థితి చక్కబడే వరకూ మన దేశంలో ఉండే వెసులుబాటు ఇస్తున్నారు.  పరిస్థితులు చక్కబడినాక వారి దేశాలకు వారు వెళ్ళవచ్చు.  వెళ్ళలేక పొతే, మన దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక్కడ అర్థం చేసుకోవలసినదేమంటే – ఇతర దేశాల పౌరులకి మన దేశ పౌరసత్వం ఇవ్వము – వివక్ష, మతపరమైన హింస, బలవంతపు మతమార్పిడి, తదితర సహేతుక కారణాలు ఉంటే తప్ప.  ప్రస్తుతానికి ఆ దేశాల నుంచీ వచ్చిన  ముస్లిమేతర శరణార్థులకి ఆ దేశాలకి తిరిగి వెళ్ళే పరిస్థితులు లేవు, రావు అని రూఢీ అయింది.  అందుకని వారికి మాత్రమే ఈ చట్ట సవరణలో వెసలుబాటు కల్పించారు.  ఒకవేళ భవిష్యత్తులో మిగతావారికి కూడా వెనక్కి వెళ్ళలేని పరిస్థితులే ఉన్నట్లయితే, అప్పటి ప్రభుత్వం వారికి కూడా ఈ వెసలుబాటు కల్పించవచ్చునేమో.

వాస్తవాలు ఇలా ఉండగా, ఎన్నో సంస్థలు, రాజకీయ పక్షాలు, మతపెద్దలూ అనవసర అపోహలకు తావిస్తూ, సత్యదూర ప్రచారాలు చేస్తూ, అమాయక ప్రజలను భయభ్రాంతులను చేస్తూ, సమాజంలో అశాంతి, హింస లను ప్రోత్సహిస్తూ అరాచకాన్ని సృష్టిస్తున్నారు.  ప్రభుత్వాన్ని, వ్యవస్థలను నాజీ, జర్మనీతో పోలుస్తూ, తామే దేశోద్దారకులమని నమ్మించి రాజకీయ ప్రయోజనాల కోసం  కపట ప్రయత్నాలు చేస్తున్న ఇటువంటి అసాంఘిక, దేశ విద్రోహ శక్తుల విద్వేషపూరిత ప్రకటనలను, వార్తలను తిప్పికొట్టవలసిన ఆవశ్యకత బాధ్యతగల ప్రతి పౌరునిపై ఉంది.

జై హింద్!

రచనడాక్టర్ బి. సారంగపాణి

గమనిక : ఈ వ్యాసంలోని అభిప్రాయలు రచయిత వ్యక్తిగతం

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.