News

అన్యమత ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు

212views

ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిటిడిలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు, వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ కింద పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్యమత ప్రచారంలో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

‘ ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. టిటిడి నుంచి ఒంటిమిట్టలో అన్నదానం కోసం రూ.4కోట్లు కేటాయించాం. ప్రస్తుతం ఈ- టెండర్ల ద్వారా హోటళ్లు కేటాయించాం. తిరుమలలో త్వరలో కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తాం. శ్రీవాణి దర్శన సమయాల వేళలు మారుస్తాం. ఉదయం టికెట్లు తీసుకుని సాయంత్రం దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీవారి దర్శనాలు, ప్రసాదాల విషయంలో సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఏడాది కాలంలో 30వేల నకిలీ వెబ్‌సైట్లను క్రాష్ చేశాం. భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరిలో స్కానర్లు అప్‌డేట్‌ చేస్తున్నాం. గతంలో వీఐపీ దర్శనం ఉదయం 10 గంటలకు ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ దర్శనాలు ఉదయం 8 నుంచి 8.30గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు.

టిటిడి పరిధిలోని 90శాతం అటవీ ప్రాంతాన్ని 110 శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. తిరుమల కల్యాణకట్టలో అత్యాధునిక పరికరాలు వాడేలా చర్యలు తీసుకుంటున్నాం. తీర ప్రాంతాల్లో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మత మార్పిడులు జరగకుండా ఆలయాలు నిర్మించాలని నిర్ణయించాం. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 320 ఆలయాలు నిర్మించాం. మరో 500 నుంచి వెయ్యి ఆలయాలు నిర్మించాలని, ప్రతి రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టిటిడి నుబంధ ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో టిటిడి ఆలయాలు ఉన్నాయి. ఆలయాల విషయమై మిగిలిన రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశామని తెలిపారు.