
17-18 శతాబ్దాల మధ్యకాలంలో మరాఠా సామ్రాజ్యాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిన యోధుడు ఒకటో రఘుజి భోంస్లేకి చెందిన ఖడ్గాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. లండన్‌లో జరిగిన ఒక వేలంపాటలో చేజిక్కించుకున్న ఈ ఖడ్గాన్ని ముంబయికి తీసుకొచ్చారు. ఇది దేశ వారసత్వ సంపదను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన చర్య అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఖడ్గాన్ని పి.ఎల్.దేశ్‌పాండే అకాడమీలో భద్రపరిచామని, సాంస్కృతిక శాఖ మంత్రి అశీశ్ షెలార్ అన్నారు. ఈ ఖడ్గాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఒక బైక్ ర్యాలీ నిర్వహించాలని ముందు నిర్ణయించారు కానీ భారీ వర్షాల కారణంగా దాన్ని రద్దు చేశారు. ఛత్రపతి షాహు మహారాజ్‌కు సేనాపతిగా పనిచేసిన రఘుజీ భోంస్లే నాగ్‌పుర్ సామ్రాజ్య స్థాపకునిగా ప్రసిద్ధుడు. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని బెంగాల్, ఒడిశా తదితర ప్రాంతాలకు విస్తరించారు.





