News

సంఘం నిర్వహించే సేవా ద్వారా ధార్మిక వారియర్స్, నేషన్ బిల్డర్స్ తయారవుతారు – దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్

345views

పత్తి వత్తిగా మారింది, అది నూనెలో తడిసి, దీపపు సెమ్మెలో నిలబడి, అగ్నిసాన్నిహిత్యంతో దీపంగా మారి వెలుగులు పంచుతోంది. మనుష్యులలోనూ పత్తి, నూనె, దీపపు సెమ్మె, అగ్నిలాంటి వ్యక్తులున్నారు. వీళ్ళంతా కలిసి సమాజానికి వెలుగులు ప్రసరింపజేయాలంటే వారందరి మధ్య సమన్వయం అవసరమని శ్రీ అచలానంద ఆశ్రమానికి చెందిన విరజానంద స్వామి ఆశీః ప్రసంగంలో అన్నారు. కర్నూలులోని కేశవ స్మృతిమండలి ఆధ్వర్యంలో మునగాలపాడులోని శ్రీ భగవాన్ బాలసాయిబాబా ప్రాంగణంలో నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆగస్ట్ 11,2025న భూమిపూజ జరిగింది.

స్వామిజీ ప్రసంగిస్తూ పరాయిపాలన అనే ఎలుక చచ్చినా ఈనాటికీ దుర్వాసన పోలేదు. ఎలుక కళేబరాన్ని తొలగిస్తే తప్ప ఆ దుర్వాసన పోదని, మన సమాజం మనవైనవి మరచిపోయిందని, మన ఆచార సంప్రదాయాలను మళ్లీ ప్రచారంలోకి తెచ్చినపుడే మన దేశం ప్రపంచానికి వెలుగులనందజేయగలదని అన్నారు. సమాజంలో వెనుకబడినవారికి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అంకురార్పణ జరిగింది. దానికి మనం సాక్షులమయ్యాము. ఈ కేంద్రం పరిపూర్ణంగా ఆ బాధ్యత పోషిస్తుందన్నారు.

దక్షిణ మధ్యక్షేత్ర ప్రచారక్ భరత్ మాట్లాడుతూ సంఘం సేవా కార్యక్రమాలు చేసేది, ఏదో ఒక సంస్థను నడపాలనే ఉద్దేశంతో కాదని, వ్యక్తిలో మార్పు తీసుకు రావడం కోసం నిర్వహిస్తుందని తెలిపారు. సంఘం నిర్వహించే సేవ ద్వారా ధార్మిక వారియర్స్, నేషన్ బిల్డర్స్ తయారవుతారని, ఈ సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయంతో పాటు, కార్యకర్తలు సమయమివ్వాలన్నారు. డబ్బు అనే దానికి మనుషులమైన మనం వెలకట్టామని, భగవంతుడు సమయానికి వెల కట్టాడని, ఆ డబ్బును, సమయాన్ని మనం సమాజానికివ్వాలని, అంటే సంఘం చేసే సేవాకార్యక్రమాలకు ఆర్థిక సహాయంతో పాటు సమయాన్నీ కూడా ఇవ్వాలి అన్నారు.

అఖిలభారత సహ సేవాప్రముఖ్ సెంథిల్ ప్రసంగిస్తూ, ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ 1926లోనే సేవ గురించి మార్గదర్శనం చేశారని, స్వయం సేవక్ హృదయంలో సమాజ సేవ చేయాలనే భావన ఉంటుందని అన్నారు. ప్రపంచంలో రెండే జాతులున్నాయి. 1. సమాజానికి ఇవ్వడం తెలిసిన సజ్జనులు, 2. సమాజం నుండి లబ్ధిపొందే స్వార్ధపరులు, సమాజంలోని వారందరినీ మొదటిరకం వారిగా మార్చే ప్రయత్నం మనం చేయాలని సూచించారు. అందరూ సేవ చేస్తారు. సంఘం సేవచేయడంలో ఉన్నత లక్ష్యముంది. సేవ ద్వారా జీవన నిర్మాణం జరగాలని సంఘం భావిస్తుందన్నారు. ఈనాడు సేవ పొందేవారు భవిష్యత్తులో సేవ చేసేవారుగా మారాలనేది సంఘ ప్రయత్నమని చెప్పారు.

కేశవస్మృతి మండలి ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు, పారిశ్రామికవేత్త, టి.జి.వెంకటేశ్, శ్రీ భగవాన్ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టీ రామారావు, క్షేత్రసేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ సేవాప్రముఖ్ మనోహర్, కర్నూలు జిల్లాలో పనిచేసిన సంఘ ప్రచారకులు, పురప్రముఖులు, పాల్గొన్నారు.

భూమిపూజా కార్యక్రమం కర్నూలు విభాగ సంఘచాలక్ నీలకంఠం దంపతులు, కర్నూలు జిల్లా సంఘచాలక్ ఎన్విఎస్ గుప్తా దంపతులు, సంఘ జ్యేష్ఠ కార్యకర్త రఘురామయ్య దంపతుల ద్వారా జరిగింది.